సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అద్దె బస్సుల వ్యవహారం గందరగోళంగా మారింది. వాటి ఉనికే ప్రశ్నార్థకంలో పడటంతో అవి కొనసాగుతాయా లేదా అన్న అయోమయం నెలకొంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ వసతి కల్పించటంతో పాటు, సొంత బస్సుల రూపంలో ఆర్టీసీపై పడే భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ బస్సులు ఇప్పుడు యజమానుల ఇళ్ల ముందు అలంకారప్రాయంగా మారాయి. ఫిబ్రవరి నుంచి వాటికి సంస్థ చార్జీలు నిలిపేయటంతో, వాటి యజమానులు డ్రైవర్లకు జీతాలిచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఇక అవి ఆర్టీసీతో కటీఫ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
సమ్మె తర్వాత ఉత్సాహం.. లాక్‌డౌన్‌తో విలాపం
గతేడాది చివర ఆర్టీసీలో సమ్మె జరిగినప్పుడు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అద్దె బస్సులు తీసుకోవాలని నిర్ణయించింది. అప్పటికే 2 వేల బస్సులుండగా, కొత్తగా మరో 1,300 బస్సులు తీసుకుంది. లాక్‌డౌన్‌కు కొంతకాలం ముందే అవి ఆర్టీసీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈలోపు లాక్‌డౌన్ ముంచుకొచ్చింది. గతేడాది సమ్మె వల్ల ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దెబ్బతినటంతో ఫిబ్రవరి నెల నుంచి అద్దె బస్సులకు చార్జీలు చెల్లించటాన్ని సంస్థ ఆపేసింది. ఆ నెలలో కేవలం సగం రోజులకే ఇచ్చింది. మిగతా సగాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఇక మార్చి 22 నుంచి లాక్‌డౌన్ ప్రారంభమయ్యే వరకు బస్సులు తిరిగినా నయా పైసా ఇవ్వలేదు.
ఇక లాక్‌డౌన్‌తో బస్సులే తిరగకపోవటంతో చెల్లింపులూ లేకుండా పోయాయి. కానీ వాటికి సంబంధించిన డ్రైవర్లకు జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉండటంతో యజమానులు లబోదిబోమంటున్నారు. ఇటు సంస్థ బకాయిలు చెల్లించకపోవటం, ఆదాయం నయా పైసా లేకున్నా డ్రైవర్లకు జీతాలు చెల్లించాల్సి రావటంతో యజమానులు అయోమయంలో పడ్డారు. దీనిపై చర్చించేందుకు ప్రయత్నిస్తే ఉన్నతాధికారులు సమయం ఇవ్వటం లేదని తెలుస్తోంది. దీంతో ఇటు ఆర్టీసీ ఎండీ కార్యాలయం, అటు బస్‌భవన్ చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావటం లేదు.
కొత్త బస్సులది మరింత గందరగోళం
సమ్మె కాలంలో 1,300 కొత్త బస్సులతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. కానీ అందులో కొన్ని బస్సులు మాత్రమే సంస్థలో చేరగా, మిగతావి లాక్‌డౌన్‌తో నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ బస్సులన్నీ నిరుపయోగంగా యజమానుల ఇళ్ల ముందు మూలుగుతున్నాయి. ఇక నగరంలోనే దాదాపు 480 అద్దె బస్సులున్నాయి. లాక్‌డౌన్ కారణంగా మార్చి 22 నుంచి ఇప్పటివరకు అవి తిరగటం లేదు. దీంతో వాటి యజమానులు మరింత నష్టపోయారు. ఇన్ని నెలల కాలానికి సంబంధించి వాటి డ్రైవర్లకు జీతాలు చెల్లించే పరిస్థితిలో లేమని వారు చేతులెత్తేస్తున్నారు. కొందరు బస్సులను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
బకాయిలే కాదు.. డ్రైవర్లనూ ఆదుకోవాలి..
‘ప్రయాణికులకు మెరుగైన సేవల కోసం మా బస్సులు తీసుకున్నారు. సంతోషించే విషయమది. కానీ ఇప్పుడు తీవ్ర నష్టాలొస్తే మమ్మల్నెవరూ పట్టించుకోవటం లేదు. సమ్మె కాలంలో ఒక్కో బస్సుపై రూ.80 వేలకు పైగా నష్టపోయాం. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి చార్జీలు ఇవ్వలేదు. ఇప్పటికైనా సంస్థ ఆ బకాయిలు చెల్లించడంతో పాటు లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయి ఉన్నందున మా డ్రైవర్లకు చెల్లించే డబ్బుల్లో కొంత సాయం చేయాలని కోరుతున్నాం. మా గోడు వినేందుకు అధికారులు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవటం ఆవేదన కలిగిస్తోంది..’
– జగదీశ్‌రెడ్డి, అద్దె బస్సుల సంఘం ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment