ఏడు నెలలుగా చెట్ల కిందే ఉన్న అద్దె బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అద్దె బస్సుల వ్యవహారం ముదురుతోంది. గతేడాది సమ్మె వరకు 2,300గా ఉన్న అద్దె బస్సులను, సమ్మె సమయంలో ఏకంగా 3,400కు ఆర్టీసీ పెంచుకుంది. ఇప్పుడు కోవిడ్ కారణంగా పూర్తిగా బస్సులు తిప్పే పరిస్థితి లేక వాటిని వాడటంలేదు. ఇప్పుడిదే సమస్యకు కారణమైంది. అన్‌లాక్ సమయంలో క్రమంగా బస్సులు తిప్పుతున్న ఆర్టీసీ, తమ బస్సులకు మాత్రం అవకాశమివ్వకుండా అప్పుల పాల్జేస్తోందంటూ అద్దె బస్సు యజమానులు రెండ్రోజుల క్రితం కోర్టుకెక్కారు. ఒక్కో బస్సుపై సిబ్బంది జీతాల రూపంలో నెలకు రూ.40 వేలు చొప్పున ఖర్చు మీద పడుతుండటమే కాక, బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పు తాలూకు వడ్డీ తడిసిమోపెడుకావడంతో బ్యాంకర్లు ఇళ్ల వద్దకు వచ్చి ఒత్తిడి చేస్తున్నారని యజమానులు అంటున్నారు. ఇప్పుడు తమకు షెడ్యూళ్లనైనా కేటాయించాలి.. లేదంటే సమ్మె సమయంలో ఆర్టీసీ ప్రతిపాదించినట్టు రూట్ పర్మిట్లనైనా ఇవ్వాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాల్లో వారానికి రెండ్రోజులు.. సిటీలో అసలే లేదు
ప్రస్తుతం ఆర్టీసీలో 3,400 అద్దె బస్సులున్నాయి. వాటిల్లో 2,900 జిల్లాల్లో తిరుగుతుండగా 500 సిటీ పరిధిలో ఉన్నాయి. గతేడాది సమ్మెకు ముందు 2,300 మాత్రమే ఉండేవి. అప్పట్లో కార్మికులు సమ్మె పేరుతో పంతానికి పోయారన్న ఉద్దేశంతో, ఆర్టీసీ హడావుడిగా టెండర్లు పిలిచి మరీ 1,100 కొత్త అద్దె బస్సులు తీసుకుంది. సమ్మె ముగిశాక పాత అద్దె బస్సులు యథావిధిగా రోడ్డెక్కాయి. కొత్త బస్సుల్లో 700 వరకు వచ్చి డిపోల్లో చేరగా, మిగతావి సిద్ధమయ్యే సమయంలో కోవిడ్ లాక్‌డౌన్ మొదలైంది. జూన్‌లో అన్‌లాక్ సీజన్‌లో భాగంగా బస్సులు రోడ్డెక్కటంతో అద్దె బస్సులు కూడా మొదలయ్యాయి. కానీ ప్రయాణికులు ఎక్కట్లేదన్న ఉద్దేశంతో కేవలం ఆర్టీసీ బస్సుల్లో కొన్నింటిని మాత్రమే తిప్పుతోంది. ఇక, పాత, కొత్త అద్దె బస్సుల్ని పూర్తిగా పక్కనపెట్టేసింది. దీంతో వాటి యజమానులు దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. బస్సులు తిరగకున్నా సిబ్బందికి కూర్చోబెట్టి జీతాలివ్వాల్సి వస్తోందంటూ వారంతా ఒత్తిడి తేవడంతో.. ఒక్కో బస్సుకు వారంలో రెండ్రోజుల చొప్పున అధికారులు షెడ్యూళ్లు ఇవ్వటం ప్రారంభించారు.
కానీ ఆ రూపంలో వచ్చే బిల్లులు ఏమాత్రం సరిపోక సిబ్బంది జీతాలను జేబులోంచి ఇవ్వాల్సిన పరిస్థితి వాటి నిర్వాహకులది. ఇక నగరంలో ఏడు నెలలుగా అద్దె బస్సులను వాడట్లేదు. అప్పట్నుంచి సిబ్బందికి యజమానులే సొంత డబ్బుల నుంచి జీతాలిస్తున్నారు. ఒక్కో బస్సుకు నెలకు రూ.40 వేల వరకు ఆ రూపంలో ఖర్చు వస్తోందని చెబుతున్నారు. మరోవైపు బస్సులను బ్యాంకు అప్పుతో కొనటంతో కిస్తీల కోసం బ్యాంకు సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. తాజాగా రుణాలను బ్యాంకులు రీషెడ్యూల్ చేశాయి. కొత్త రుణాలు ఇస్తూ వాటి నుంచి పాత రుణాలను జప్తు చేసుకున్నాయి. ఇప్పుడు బస్సులన్నీ ఏడు నెలలుగా దుమ్ముకొట్టుకుపోతున్నాయంటూ వాటి యజమానులు హైకోర్టును ఆశ్రయించారు.
రద్దీ పెరిగాక అద్దె బస్సుల్నీ తిప్పుతాం
‘కోవిడ్‌లాంటి ఉపద్రవాన్ని ఎవరూ ఊహించలేదు. దానివల్ల కొంతకాలం బస్సులు డిపోలకే పరిమితమై ఇప్పుడు తిరుగుతున్నాయి. కానీ బస్సుల్లో రద్దీలేక తక్కువ సంఖ్యలో తిప్పుతున్నాం. ఇలాంటి పరిస్థితిలో మా డ్రైవర్లకు పూర్తి జీతాలు చెల్లిస్తూ, మా బస్సులను ఖాళీగా డిపోల్లో ఉంచి అద్దె బస్సులను తిప్పలేం కదా. మళ్లీ రద్దీ పెరిగాక అద్దె బస్సుల్నీ తిప్పుతాం’అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు వివరణనిచ్చారు.
రూట్ పర్మిట్లు కేటాయించండి
పాత బకాయిలు రూ.130 కోట్లు పేరుకుపోయాయి. ఇప్పుడు బస్సులు తిరుగుతున్నా షెడ్యూళ్లు కేటాయించట్లేదు. సిటీలో అసలే లేకపోగా, జిల్లాల్లో వారంలో రెండు రోజులే కేటాయిస్తున్నారు. ఇంకా ఎన్ని నెలలు సిబ్బందిని కూర్చోబెట్టి మేం జీతాలివ్వగలం?. మరోవైపు బ్యాంకు సిబ్బంది కిస్తీల కోసం ఒత్తిడి చేస్తున్నారు. మాకు షెడ్యూల్స్ కేటాయించనప్పుడు రూట్ పర్మిట్లనైనా ఇవ్వాలి. దీనికైనా ఆర్టీసీ అంగీకరించాలి. – జగదీశ్‌రెడ్డి, అద్దె బస్సుల సంఘం ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment