- ఉద్యానవన శాఖ విస్తరణ అధికారులు రమేశ్, శంకర్
- గ్రామంలో రైతులకు 150 ఆపిల్ మెుక్కల పంపిణీ
- ఒక్కో మొక్క ఖరీదు రూ.800
ఆపిల్ పంటకు ధనోరా అనుకూలం
Published Sat, Jul 23 2016 11:22 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
కెరమెరి : ఆపిల్ పంట పండేందుకు ధనోరా అనువైన ప్రదేశమని, అందుకోసమే ఆ మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు ఉద్యానవన శాఖ విస్తరణ అధికారులు బి.రమేశ్, శంకర్ అన్నారు. శనివారం వారు మండలంలోని ధనోరా గ్రామానికి సమీపంలో ఉన్న బాలాజీ పొలాన్ని సందర్శించారు. అనంతరం బాలాజికి 140, ఝరి గ్రామానికి చెందిన రైతు దస్తగిరికి 10 ఆపిల్ మొక్కలను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ, మార్చి నెలలో హైదరాబాద్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పొలాన్ని పరిశీలించారని, ఆపిల్ పంటకు కావాల్సిన ప్రదేశం అయినందున ఇక్కడ పండుతాయని నిర్ధారించారని వివరించారు. ఈ క్రమంలో జిల్లాలోనే ప్రథమంగా ఆపిల్ పంటలను ఇక్కడే పండిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడి నేల ఆపిల్ పంటకు అనుకూలమైందని తెలిపారు. అలాగే ఏడీహెచ్ కార్యాలయానికి 30, బెల్లంపల్లి డీఎఫ్‌వో ఆధ్వర్యంలో జోడేఘాట్‌లో నాటేందుకు 20 ఆపిల్ మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో మొక్క ఖరీదు రూ.800 ఉంటుందని, అందుకే వీటిని నాటడమే తమ బాధ్యత అనుకోకుండా కంటికిరెప్పలా కాపాడాలని సూచించారు. మొక్కలు నాటేందుకు ముందు గుంతలు తవ్వి, పోలీడాన్, గోబర్ ఎరువును వేయాలని, నాటిన తర్వాత ఫోరెట్ క్రిమిసంహారక మందు వేయాలని వివరించారు. ఈ పంట మూడేళ్లకు చేతికి వస్తుందని, అప్పటి వరకు చాలా జాగ్రత్తగా పెంచాలన్నారు. రైతులు ఎం.కేశవ్, మొహదిన్, ఆరీఫ్, మోబిన్, ఎజాజ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement