- సస్పెన్షన్‌కు రంగం సిద్ధం
ఏఓపై దాడికి ఏఆర్ ఎస్సై యత్నం
Published Sun, Oct 16 2016 1:49 AM | Last Updated on Mon, Apr 8 2019 8:33 PM
నెల్లూరు (క్రైమ్): జిల్లా పోలీస్ కార్యాలయ ఏఓపై ఏఆర్ ఎస్సై దాడికి యత్నించిన ఘటన శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో చోటుచేసుకుంది. పోలీస్ అధికారుల సమాచారం మేరకు.. నాగభూషణం ఏఆర్ కానిస్టేబుల్‌గా గతంలో డిప్యూటేషన్‌పై చెముడుగుంటలోని జిల్లా పోలీస్ శిక్షణ కళాశాలలో రైటర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన అందరితో పాటు 15 శాతం అలవెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంజూరులో జాప్యం జరగడంతో పలుమార్లు మినిస్టీరియల్ సిబ్బందిని కలిశారు. సమాధానం రాకపోవడంతో ఏఓ రాజశేఖర్‌ను కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తించే వారికి అలవెన్స్ వర్తించదని ఏఓ ప్రభుత్వ జీఓను చూపించారు. ఈ విషయమై నాగభూషణం ఏఓపై కక్ష పెంచుకున్నారు. ఇటీవల ఆయన ఏఆర్ ఎస్సైగా పదోన్నతి పొంది జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏఓ పోలీస్ కార్యాలయానికి వచ్చి కారు దిగుతుండగా నాగభూషణం కర్రతో వెళ్తున్న విషయాన్ని గమనించిన డ్యూటీ ఆర్‌ఎస్సై అంకమరావు గార్డ్‌ను అప్రమత్తం చేయడంతో వారు అడ్డుకున్నారు. వారి నుంచి తప్పించుకునేందుకు నాగభూషణం యత్నించిచా సాధ్యం కాకపోవడంతో ఏఓను దుర్భాషలాడారు.
విధుల బహిష్కరణ
ఏఓపై దాడికి యత్నం విషయం తెలుసుకున్న మినిస్టీరియల్ సిబ్బంది విధులను బహిష్కరించారు. నాగభూషణంపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ విశాల్‌గున్నీకి ఫిర్యాదు చేశారు. నాగభూషణం వ్యవహారశైలిని వారు ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎస్పీ విచారించి నివేదికను సమర్పించాల్సిందిగా ఏఆర్ ఆర్‌ఐ శ్రీనివాసరావును ఆదేశించారు. దీంతో మినిస్టీరియల్ సిబ్బంది ఆందోళనను విరమించారు. ఆర్‌ఐ పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఎస్పీకి నివేదికను సమర్పించారు. నాగభూషణాన్ని విధుల నుంచి సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం.
గతంలోనే రాజీనామా లేఖ
నాగభూషణం వ్యవహారశైలి ఆది నుంచే భిన్నంగా ఉండేదని సమాచారం. ప్రమోషన్ విషయంలో కలత చెంది రెండు సార్లు తన ఉద్యోగానికి రాజీనామా లేఖను ఏఆర్ ఉన్నతాధికారులకు నాగభూషణం సమర్పించారు. ఉన్నతాధికారులు ఆయనకు కౌనెలింగ్ నిర్వహించి మంచిపద్ధతి కాదని సూచించడంతో తన యత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం.
Advertisement