దిగొచ్చిన రవిశంకర్
న్యూఢిల్లీ :ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ఎట్టకేలకు దిగి వచ్చారు. నిన్నటివరకు పైన్ కట్టేది లేదని భీష్మించిన రవిశంకర్ చివరికి అంగీకరించారు. కోర్టు తమకు విధించిన ఫైన్ చెల్లించేందుకు గడువు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నాలుగు వారాల్లోగా అయిదు కోట్ల జరిమానాను చెల్లిస్తామని శుక్రవారం కోర్టును ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వేడుకుంది. అంత పెద్ద మొత్తాన్ని ఇప్పటికిపుడు చెల్లించలేమని తెలిపింది. తమది స్వచ్ఛంధ సంస్థ అని, కల్చరల్ ఫెస్టివల్ ఆరంభమయ్యేలోపు అంత మొత్తాన్ని సమీకరించలేమని పిటిషన్‌లో పేర్కొంది.
అటు జైలుకైనా వెళతాకానీ, ఫైన్ కట్టేదిలేదన్న రవిశంకర్ వ్యాఖ్యలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయన లాంటి వారినుంచి అలాంటి ప్రకటనను ఊహించలేమని, ట్రిబ్యునల్ ను వివాదాస్పదం చేయొద్దని హెచ్చరించింది. బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. అయితే తక్షణమే రూ.25 లక్షలు చెల్లించాలని, మిగిలిన రూ 4.75 కోట్లు చెల్లించడానికి వీలుగా 3 వారాల గడువును ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఒకవేళ ఈరోజు రూ .25 లక్షల చెల్లించడంలో సంస్థ విఫలమైతే ప్రభుత్వం జారీ చేసే 2.5 కోట్ల రూపాయలు ఎటాచ్ చేయబడతాయని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను ఏ్రపిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యమునా నది తీరంలో వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ కు గ్రీన్ సిగ్నల్ పడినట్టయింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఫెస్టివల్ ను ప్రారంభించనున్నారు.
అటు పండిట్ రవిశంకర్ నిర్వహిస్తున్న ప్రపంచ సంస్కృతి ఉత్సవంపై ఇవాళ కూడా పార్లమెంట్ దద్దరిల్లింది. రాజ్యసభలో రవిశంకర్ వైఖరిపై జేడీయూ నేత శరద్ యాదవ్ మండిపడ్డారు. కల్చర్ ఈవెంట్‌తో పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేశ్ ఆరోపించారు.