గంట్యాడ : మండలంలోని పెనసాం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి లెంక సీతంనాయుడు మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతంనాయుడు పూణేలో ఆర్మీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల ఎనిమిదో తేదీన అతని తండ్రి అప్పలనాయుడు మృతి చెందడంతో సీతంనాయుడు గ్రామానికి వచ్చాడు. మంగళవారం రాత్రి వరకు అదే గ్రామంలో ఉన్న మేనమామ ఇంటి వద్ద గడిపి పడుకునేందుకు తన సొంత ఇంటికి వెళ్లాడు.
బుధవారం ఉదయం సీతంనాయుడు మేనల్లుడు వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా దూళానికి ఉరి వేసుకుని కనిపించాడు. విషయం తెలుసుకున్న వీఆర్‌ఓ అబద్ధం గంట్యాడ పోలీసులకు సమాచారం తెలియజేశారు. దీంతో ఎస్సై తిరుపతిరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కుటుంబ సమస్యల కారణంగా మృతుడి భార్య కుమార్తెతో కలిసి కన్నవారింటిలో ఉంటోంది.
ఒకే ఇంటిలో..
మృతుడి తల్లి నారాయణమ్మ రెండేళ్ల కిందట గుండె పోటుతో మృతి చెందగా, తండ్రి అప్పలనాయుడు ఎనిమిది రోజుల కిందట కన్నుమూశాడు. సోదరుడు అప్పలరాజు కూడా గతేడాది మూడో నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు సీతంనాయుడు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాధ చాయలు అలముకున్నాయి. కొద్ది రోజుల్లోనే ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్నారు.
ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
Published Thu, Jun 16 2016 9:02 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement