అడ్డగోలు దోపిడీకి ఏర్పాట్లు
పనులు చేసినట్లు చూపించేందుకు యత్నం
సహకరిస్తున్న ఇరిగేషన్ అధికారులు
గొల్లపల్లి (నూజివీడు) :
నీరు–చెట్టు పథకం అధికార పార్టీ నేతలకు వరంగా మారింది. పనులు చేయకుండానే చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చి నిధులు దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ఇరిగేషన్ అధికారులు కూడా సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పనుల్లో నూజివీడు మండలం గొల్లపల్లిలో ఈ పథకం కింద చేపట్టిన పనుల్లో భారీగా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. మట్టిసరిచేసే పనులు ఇక్కడ జరుగుతున్నాయి. నీరు–చెట్టు పనులు చేపట్టిన వ్యక్తులు మట్టి తోలకుండానే తోలినట్లుగా చూపించి అడ్డగోలుగా లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని తోచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామంలోని వడ్డీ చెరువుకు నీరు–చెట్టులో పూడికతీత పనులు చేయడానికి ఉన్నతాధికారులు అనుమతినిచ్చారు. దీంతో ఈ చెరువు కట్టకు మట్టిని తోలడంతో పాటు కొంతవరకు బయటకు తోలారు. ఆ తరువాతే అసలు దోపిడీ పని ప్రారంభమైంది. దీనిలో భాగంగా చెరువు లోపలి భాగమంతా పొక్లెయిన్‌తో సరిచేయడం, డోజర్‌తో సమానంగా సర్ధడం, అంచులను చెక్కడం తదితర పనులు చేస్తున్నారు. పని చేయకుండా పనిచేసినట్లుగా కొలతల కోసం ఇలా చేసి దోచుకునేందుకే చెరువులోని గోతులను పొక్లెయిన్‌తో సరిచేస్తున్నారని గ్రామానికి చెందిన పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే విధంగా మండలంలోని పోలసానపల్లిలో కూడా పనులు మంజూరు కాని చెరువులో పొక్లెయిన్‌లతో గోతులను సరిచేయడం, అంచులను చెక్కడం తదితర పనులను చేశారు. ఇలా అధికార పార్టీ నాయకులు అధికారం ఉందనే ధీమాతో వారి ఇష్టం వచ్చిన విధంగా నీరు–చెట్టు పనులను చేస్తూ జేబులు నింపుకుంటున్నారని, దీనిపై విచారణ చేయించాలని పలు రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నారు.