
అరెస్ట్.. అలర్ట్..!
►జగన్ పర్యటనతో సర్కారులో వణుకు
►గరగపర్రు ఘటనలో నిందితుల అరెస్ట్
►హడావుడిగా కదిలిన యంత్రాంగం
ఆపదలో ఉన్న భక్తుల కోసం పూరీ జగన్నాథుడు కదిలినట్టుగా.. ఆపన్నుల కోసం వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తరలి
రానుండడంతో అధికార యంత్రాంగం కదిలింది. వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. జగన్నాథ రథచక్రాలు అన్న నినాదం సమరశంఖమై సర్కారు వెన్నులో వణుకు పుట్టించింది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్న చందంగా.. గరగపర్రు విద్వేషాలతో రగులుతుంటే.. రెండునెలల నుంచీ మొద్దు నిద్రపోయిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా చర్యలకు ఉపక్రమించింది. దళితులు, దళిత సంఘాల నేతలు పెద్దఎత్తున ఆందోళనలు చేసినా.. నిందితుల అరెస్ట్‌కు తాత్సారం చేసిన సర్కారు ఎట్టకేలకు అధికారులను పరుగులు పెట్టించి నిందితులను అరెస్ట్ చూపించింది. – సాక్షి ప్రతినిధి, ఏలూరు
గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణపై రెండు నెలలుగా మీనమేషాలు లెక్కించిన అధికార యంత్రాంగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో చలనం వచ్చింది. ఇప్పటివరకూ విచారణ జరుపుతున్నామని, అరెస్ట్‌కు సమయం పడుతుందని చెబుతూ వచ్చిన పోలీసు అధికారులు గురువారం ఉదయం హడావుడిగా భీమవరంలో విలేకరుల సమావేశం పెట్టి మరీ నిందితులను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఈ వివాదంలో దళితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు వారి ఆందోళనకు మద్దతు ప్రకటించడంతో ఈనెల 24న పాలకోడేరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి, 60 మంది సాక్షులను విచారించి నిందితులు ఇందుకూరి బలరామకృష్ణంరాజు, ముదునూరి రామరాజు, కొప్పుల శ్రీనివాస్‌లను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ ఎం.రవిప్రకాష్ ప్రకటించారు.
తొలి నుంచీ తాత్సారమే..!
గరగపర్రు విషయంలో అధికారులు, సర్కారు తొలి నుంచీ తాత్సార ధోరణే అవలంబించాయి. ఏప్రిల్ 23న గరగపర్రు గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు మంచినీటి చెరువు గట్టుపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టేందుకు యత్నించారు. దీంతో వివాదం మొదలైంది. ఈ సమాచారం పంచాయతీకి అందడంతో గ్రామ కార్యదర్శి అక్కడికి వెళ్లి ఆ విగ్రహాన్ని పాత పంచాయతీ కార్యాలయానికి తరలించారు. ఆ మరుసటి రోజు దీనిని నిరసిస్తూ.. ఎస్సీ సామాజిక వర్గం వారు ధర్నా, వంటావార్పు వంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, భీమవరం రూరల్ సీఐ, ట్రైనీ అడిషనల్ ఎస్పీ గ్రామానికి చేరుకుని దళితులకు నచ్చ చెప్పి తిరిగి విగ్రహాన్ని పంచాయతీ కార్యాలయం ముందు పెట్టించారు. ఈ వివాదంతో గ్రామస్తుల మధ్య విబేధాలు పెరిగాయి. ఇవి విద్వేషాల స్థాయికి చేరాయి. ఫలితంగా మిగిలిన సామాజికవర్గాల వారంతా కలిసి దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు. దీనిపై దళితులు ఎంతగా మొరపెట్టుకున్నా.. దళిత సంఘాలు ఆందోళన చేసినా అధికార యంత్రాంగంలో కదలిక లేకపోయింది. దీంతో రోజురోజుకూ ఆందోళన తీవ్రమై గత శనివారం పతాక స్థాయికి చేరింది. ఫలితంగా హడావుడిగా దళితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వైఎస్సార్ సీపీ బృందం రాక
దీనిపై ప్రసారమాధ్యమాల్లో కథనాలు రావడంతో జాతీయ ఎస్సీ, కమిషన్ సభ్యుడు కె.రాములు గ్రామానికి వచ్చి అధికారుల తీరును తప్పుబట్టారు. ఆ మరుసటి రోజే వైఎస్సార్ సీపీ బృందం గ్రామాన్ని సందర్శించి బాధితుల్లో ధైర్యం నింపింది. స్థానిక పరిస్థితులను పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. అదేరోజు ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, మంత్రులు గ్రామాన్ని సందర్శించి 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించినా.. అధికారులు ముందుకు వెళ్లలేదు.
జగన్ పర్యటన ప్రకటనతో హడల్
ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధినేత, విపక్ష నేత జగన్‌మోహనరెడ్డి శుక్రవారం గరగపర్రు రానున్నట్టు ప్రకటించడంతో సర్కారు గుండెల్లో వణుకు మొదలైంది. ప్రజాప్రతినిధులు గ్రామానికి వరుస కట్టడం ప్రారంభించారు. అధికారులూ ఎప్పటికప్పుడు గ్రామంలోని పరిస్థితులను పర్యవేక్షించారు. జగన్ పర్యటనకు ముందు రోజు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు పీవీరావు మాలమహానాడు నేత గుమ్మాపు సూర్యవరప్రసాద్, కేవీపీఎస్ నేతలు రామకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు సిరింగుల స్వరూపారాణి, ఎరిచర్ల రాజేష్ తదితరులు గురువారం ఉదయం నుంచి నిరశనæ దీక్షకు దిగారు. జగన్ పర్యటన, దళిత నేతల దీక్షల వల్లే హడావుడిగా నిందితులను అరెస్ట్ చూపించారనే వాదన వినిపిస్తోంది.
నిందితులంతా అధికారపార్టీవారే..
నిందితులంతా అధికార పార్టీకి చెందిన నేతలు కావడంతోనే అరెస్ట్‌కు అధికారులు మీనమేషాలు లెక్కపెట్టారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించడంతో వారిని భీమవరం సబ్ జైలుకు తరలించారు.
అరెస్ట్‌లను నిరసిస్తూ..
ఈ అరెస్ట్‌లను నిరసిస్తూ గ్రామంలోని దళితేతరులూ ఆందోళనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులను భారీగా మోహరించారు. మరోవైపు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గరగపర్రు దళితులను పరామర్శించారు.
జగన్ పర్యటనకు ఏర్పాట్లు
గరగపర్రు బాధిత దళితులకు సంఘీభావం ప్రకటించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి శుక్రవారం రానున్నారు. దీనికోసం పార్టీ ఉండి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జ్ కొయ్యే మోషేన్‌రాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మంతెన యోగీంద్రకుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు.