గరగపర్రు సమస్యకు పరిష్కారం
Published Tue, Jul 25 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM
చెరువుగట్టున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు ఒప్పందం
ఇరువర్గాలు చేతులు కలిపి.. కలసిమెలసి జీవిస్తామంటూ హామీ
దళితవాడలో సౌకర్యాలు కల్పిస్తామని మంత్రుల భరోసా
భీమవరం:
ఉండి నియోజవర్గంలోని గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణ సమస్య పరిష్కారమైంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామంత్రి నక్కా ఆనందబాబు, కార్మికశాఖామంత్రి పితాని సత్యనారాయణ రెండు రోజులు పాటు చర్చలు జరిపి అగ్రవర్ణాలు, దళితుల పెద్దలతో చేతులు కలిపి భాయిభాయి అనిపించి మంగళవారం వివాదానికి శుభం కార్డు వేశారు. అయితే దాదాపు నాలుగు నెలల పాటు సాగిన వివాదంలో ప్రభుత్వ పరంగా బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి 5 కిలోల బియ్యం పంపిణీ తప్ప ఇతరత్రా ఎటువంటి ప్రయోజనం సమకూరకపోవడం విశేషం.
పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో ఏప్రిల్‌లో మంచినీటి చెరువుగట్టున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతో గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. గ్రామంలో 14 కులాలు ఒక వైపు దళితులంతా ఒక వైపు ఉండి దాదాపు మూడు నెలల పాటు ఉద్యమాన్ని నడిపించారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడికిపోయింది. మేము దళితులను సాంఘిక బహిష్కరణ చేయలేందటూ దళితేతరులు చెబుతుండగా.. తామ సాంఘిక బహిష్కరణకు గురై తీవ్ర మానసిక క్షోభ, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. సాంఘిక బహిష్కణకు కారకుడైన ప్రధాన నిందితుడు ఇందుకూరి బలరామకృష్ణంరాజును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తరువాత బలరామకృష్ణంరాజుతోపాటు మరో ఇరువుర్ని అరెస్టు చేశారు.
ఈనెల 24న రాష్ట్ర మంత్రులు ఆనందబాబు, జవహర్, పితాని సత్యనారాయణ గరగపర్రు గ్రామం దళితవాడలో సమావేశం ఏర్పాటుచేసి గ్రామంలోని 63 కుటుంబాలకు రూ. లక్ష సాంఘిక సంక్షేమశాఖ నిధులు పరిహారంగా అందించడానికి ప్రయత్నం చేశారు. అయితే 335 కుటుంబాలకు పరిహారం చెల్లించాలని పట్టుబట్టారు. దీంతో ఎవరికీ సహాయం అందించకుండానే ఆరోజు చర్చలు ముగిశాయి. తిరిగి మంగళవారం పాలకోడేరులోని మండలపరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో దళితుల తరపున శిరంగుల వెంకటతర్నం, ఎరిచర్ల రాజేష్, విప్పర్తి ఏసుపాదం, విజయకుమార్, రెండవ వర్గం తరపున చింతలపాటి సూర్యనారాయణరాజు, ముదునూరి రామకృష్ణంరాజు, అన్నవరం, మేకల చంద్రరావు, అబ్బులు పెద్దలుగా వ్యవహరించడంతో రెండు వర్గాలు శాంతియుతంగా ఎటువంటి అరమరికలు లేకుండా జీవిస్తామంటూ చేతులు కలిపాయి.
Advertisement
Advertisement