గరగపర్రులో దళితులకి న్యాయం జరిగే వరకు వారి తరపున పోరాడతామని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు.
పాలకోడేరు: పశ్చిమగోదావరి జల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో దళితులకి న్యాయం జరిగే వరకు వారి తరపున పోరాడతామని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. గ్రామానికి చేరుకున్న కేంద్ర పాలక మండలి సభ్యులు కొయ్యే మోషెన్ రాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజులు అండగా ఉంటామన్నారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో ఏర్పడిన వివాదంలో రెండు నెలలుగా దళితులపై జరుగుతున్న పలు సంఘటనలను వారు ఖండించారు. గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణను వారు వ్యతిరేకించారు.
ఈ సందర్భంగా దళితపేటను సందర్శించి సాంఘిక బహిష్కరణపై వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత రెండు రోజుల నుంచి వివిధ దళిత సంఘాలు గ్రామానికి రావడంతో ఉద్యమం తారా స్థాయికి చేరింది. గ్రామంలో దళితులందరు ఏకమై సాంఘిక బహిష్కరణకు కారణమైన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలని ధర్నా చేశారు. దీనికి సంఘీభావం తెలిపిన వైఎస్సార్సీపీ నేతలు సాంఘిక బహిష్కరణకు కారణమైన గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ ఇందుకురి బలరాంరాజును వెంటనే అరెస్టు చేసి గరగపర్రు దళితులకి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.