గరగపర్రు చెప్పే చేదు నిజం | journalist doctor prasad murthy write on article in garagaparru issue | Sakshi
Sakshi News home page

గరగపర్రు చెప్పే చేదు నిజం

Published Wed, Jul 26 2017 1:32 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM

గరగపర్రు చెప్పే చేదు నిజం

గరగపర్రు చెప్పే చేదు నిజం

డెబ్భై ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా ఎవరో పనిలోకి రావద్దంటే బతకలేని దుర్భర స్థితి దళితులది. ఒక్క గరగపర్రుని చూస్తే దేశవ్యాప్తంగా వేలాది గ్రామాల్లోని దళితుల దయ నీయ పరిస్థితులు ఎలాంటివో అర్థమవుతాయి. ఇవాళ గరగపర్రు రాజులు కొత్తగా దళితుల్ని వెలి వేయలేదు. దేశంలో దళితులలో నూటికి 90 శాతం ఇంకా వెలిలోనే ఉన్నారు. అంట రానితనాన్ని, సాంఘిక బహిష్కరణను పాలకులే స్వయంగా పాటిస్తున్నారు. ఆ వాస్తవాన్నే గరగపర్రు నేడు దేశానికి చూపిస్తోంది.

డెబ్భై వసంతాల స్వాతంత్య్రం సందర్భంగా దేశం సంబరాలకు సిద్ధమవుతుండగా గరగపర్రులాంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉండటం ఏమిటి? అంబేడ్కర్‌ విగ్రహం పెట్టుకుంటామంటే ఏకంగా దళిత జాతినే వెలివేస్తారా? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శాసనసభ నియోజకవర్గంలోని భీమవరం పట్టణానికి అతి సమీపాన ఉన్న గ్రామం గరగపర్రు. తాడేపల్లిగూడెం నుంచి ఆ ఊరుకు వెళ్తుంటే, దారిలో నాట్లకు సిద్ధం చేసిన వరి పొలాలు కనిపించాయి. కొన్ని పొలాలు అప్పటికే నాట్లు పడి పచ్చగా కళకళలాడుతున్నాయి. కొంచెం దూరం వెళ్లేసరికి పొలాలు మాయమై చేపల చెరువులు, రొయ్యల చెరువులు దర్శనమిచ్చాయి. కొందరు మిత్రులు ఆ ఊరి దళితవాడలోని చర్చికి తీసుకుపోయారు. అక్కడ జరిగిన ఘటనకంటే దారుణమైన విషయాలను నేను కళ్లారా చూశాను, చెవులారా విన్నాను.

అల్లూరి సరసన అంబేద్కరా?
గరగపర్రు దళిత యువకులు తమ పాలిటి దేవుడులాంటి అంబేడ్కర్‌ విగ్రహాన్ని గ్రామంలో పెట్టాలనుకున్నారు. అంబేడ్కర్‌ అందరికీ ఆరాధ్యనీయుడేనని భావించి.. ఊరి చెరువు పక్కన కాటన్‌ దొర, అల్లూరి సీతారామరాజు, గాంధి, పొట్టి శ్రీరాములు తదితరుల విగ్రహాల చెంతనే ఆయన విగ్రçహాన్ని ప్రతిష్టించాలని అనుకున్నారు. ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతికి విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకున్నా, ఏవో కారణాల వల్ల అది కుదరలేదు. ఆ తర్వాత ఏప్రిల్‌ 23 రాత్రి 11 గంటల సమయంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని గ్రామానికి తీసుకొచ్చి, తాత్కాలికంగా చెరువు గట్టు పక్కన ఉంచి, తెల్లారాక విగ్రహ ప్రతిష్టాపన జరపాలనుకున్నారు. కానీ తెల్లారేసరికి విగ్రహం మాయమైంది. ఇది పెద్ద కులాల వారి కుట్రేనని భావించిన రెండు వాడల దళితులూ రోడ్డుపై బైఠాయించి, రహదారిని స్తంభింపజేశారు. దీంతో హుటాహుటిన అధికారులు రంగప్రవేశం చేశారు. విగ్రహం కోసం వెదికించి, పాత పంచాయతీ కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి లోపల బందీగా ఉన్న విగ్రహాన్ని బయటకు తీయించారు. రోడ్డును విశాలం చేసేటప్పుడు అడ్డం కావచ్చు కాబట్టి పాత పంచాయతీ కార్యాలయం ముందు విగ్రహాన్ని ఉంచితే మంచిదన్న డిప్యూటీ కలెక్టర్‌ సూచనను దళితులంతా అంగీకరించారు. పోలీసుల్ని కాపలా వుంచి అధికారులు వెళ్లిపోయారు.

ధిక్కారానికి విరుగుడు వెలి
ఇక్కడితో కథ ముగియడం కాదు, అసలు ఇక్కడే మొదలైంది. పాత పంచాయతీ కార్యాలయం ఊరికి, చెరువుకు మధ్యనున్న రహదారి పక్కనే ఉంది. అగ్రకులాలు, బీసీ కులాల వారంతా పాత పంచాయతీ కార్యాలయం ముందున్న అంబేడ్కర్‌ విగ్రహాన్ని చూస్తూ ఊళ్లోకి వెళ్లాలి, బయటకు పోవాలి. రోడ్డుకు ఇటు పక్కన అల్లూరి సీతారామరాజు విగ్రహం వుంది. దానికి ఎదురుగా అటు పక్కన అంబేడ్కర్‌ విగ్రహం ఉంది. అల్లూరి కులానికి చెందిన రాజులదే గరగపర్రులో ఆధిపత్య స్థానం. రాజుల్లో చాలా మందికి మనసులో కొంచెం కెలికినట్టున్నా, ఇద్దరు, ముగ్గురికి మాత్రం తల తీసేసినట్టయిందని, వారి అహం దెబ్బ తిందని దళిత సంఘాలు, వామపక్షాలు, తదితరుల కథనం. ఏమైనా ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించాలి.

ఎలా? వెంటనే ఆ ఊరిలో కీలకపాత్ర పోషిస్తున్న ఒక రాజు తక్షణమే దళితులు మినహా అన్ని కులాలను సమావేశపరిచాడు. మే 5 లోగా విగ్రహాన్ని తొలగిస్తే సరేసరి. లేదంటే మొత్తం దళితుల్ని మనమే మన పొలాలు, ఇళ్లు, గొడ్ల చావిళ్లు, ఫ్యాక్టరీల పనుల నుంచి తొలగించాలని నిర్ణయించారు. అంటే దళితులకు సాంఘిక బహిష్కారం విధించారు. ఇది, 14 కులాలు కలసి తీసుకున్న నిర్ణయమే అయినా నిర్ణయాధికారం రాజులదే. గ్రామంలో సిరిసంపదలు ఎవరి చేతుల్లో వుంటాయో అధికారాలు కూడా వారి చేతుల్లోనే వుంటాయని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మొత్తానికి వెలి అనే మహా నాటకానికి తెర లేచింది. దళితులు లొంగలేదు. కౌలు భూములు, పనులు, జీవనోపాధి పోయినా, ఊళ్లో పలకరించేవారు లేకపోయినా.. తమ ఆత్మ గౌరవానికి చిహ్నమైన అంబేడ్కర్‌ విగ్రహాన్ని తీసేది మాత్రం లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈ వెలి ఘోరం నెలన్నరకు పైగా బయటకు పొక్క లేదు. చివరికి 10 టీవీ, సాక్షి టీవీలు ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాకగానీ ఇది లోకానికి తెలియలేదు. ఆ తర్వాతైనా ప్రధాన స్రవంతి మీడియా ఈ ఘటన పట్ల పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు.

దళితుల మహాపరాధం
అటు వైపు వారు చెప్పే విషయాలూ తెలుసుకున్నాను. ఆ ఊరి సర్పంచ్‌ ఎలిజబెత్‌ రాణి దళితురాలే గానీ రాజుల పక్షాన నిలిచారు. ఆవిడ మాట్లాడిన వాట్సాప్‌ వీడియోను చూశాను. దళితులే చాలా ఘోరమైన తప్పిదం చేశారు, దొంగచాటుగా విగ్రహం పెట్టాల్సిన పనేంటి, మాకు (అంటే ఆ ఊళ్లో పెద్దలనుకుంటున్న వారికి) చెప్తే మేమే ఆ మహానుభావుడి విగ్రహం పెట్టేవారం కదా అంటూ ఆమె మాట్లాడారు. ధర్మ ప్రభువులైన రాజులకూ, ఊరికీ అపఖ్యాతి తెచ్చే పని దళితులు చేస్తే, వారి పక్షాన ఎందుకు మాట్లాడతానని ఆమె వాదించారు. రాజులలో నాకు తెలిసిన చాలా మంది మిత్రులు జరిగిన దానికి విచారాన్ని వ్యక్తం చేయగా, కొందరు ఇదేదో పాత గొడవల కొత్త మలుపు అన్నారు. గోరంతను కొండంత చేశారని ఆరోపించారు. ఏదేమైనా దళితులను మూకుమ్మడిగా వెలి వేశారనేది స్పష్టంగానే కనబడుతోంది. దళితులు కౌలు చేసుకుంటున్న భూములను వేరే వారికి కట్టబెట్టడాన్ని చూస్తేనే అది అర్థమవుతోంది.

అది లోకానికి వెల్లడయ్యాక, అనివార్యంగా జరగాల్సిన తతంగమంతా జరిగింది, జరుగుతోంది. పార్టీల వారూ, దళిత సంఘాల వారూ వచ్చి సానుభూతిని తెలియజేసి, ఉప్పు, పప్పు, బియ్యం బస్తాలు కుమ్మరించి పోతున్నారు. అధికారులు, పోలీసులు, నాయకులు ఇరు పక్షాలకీ రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ కేసు కింద ముగ్గురిని అరెస్టు చేశారు. వాళ్లు బెయిలు మీద బయటకొచ్చిన రోజునే.. ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, పీస్‌ కమిటీలో దళితుల వాదనను బలంగా విని పించిన యాకోబ్‌ను లారీ గుద్దేయడంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. ఇది ముమ్మాటికీ హత్యేనని దళితులు అంటున్నారు. కాదు యాక్సిడెంటే అంటున్నారు కొందరు.

దేశంలోని దళితుల దుస్థితికి నిలువుటద్దం
ఇప్పుడు మనమిక ఈ ఘటన మూలాల్లోకి వెళ్లి అసలు విషయాలను చూద్ధాం. ఈ ప్రాంతంలో రాజులకు, దళితులకు మధ్య పెద్దగా ఘర్షణలు జరిగిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ దారుణానికి ఒక కులాన్ని బోనెక్కించడానికి వీల్లేదు. రాజు కాకుంటే మరో దొరగారు ఎవరో ఒకరు ఉంటారు. ఇలాంటి ఘటనలు లెక్కకు మించి జరగడానికి అనువైన పరిస్థితులు దేశంలో ఇంకా పుష్కలంగా ఉన్నాయన్నదే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా ఎవరో పనిలోకి రావద్దంటే బతకలేని దుర్భర స్థితి. ఎవరో నా పొలంలోకి అడుగు పెట్టొద్దంటే మట్టికి దూరమైపోతామని గింజుకునే నిస్సహాయ స్థితి. ఎవరో వద్దన్నందుకు ఏ ఫ్యాక్టరీలోనూ పని దొరకదని వేదన పడే సంకట స్థితి. వెలి వేస్తున్నారంటే అయ్యో అంటూ విలవిల్లాడిపోయే దౌర్భగ్య స్థితి. ఊరవతల దశాబ్దాల క్రితం పుణ్యాత్ములెవరో దయతలచి పారేసిన నేల మీద నాలుగు గోడలు నిలబెట్టుకోలేని నిస్సహాయ స్థితి. దీని గురించే ఇప్పుడు ఆలోచించాలి. ఒక్క గరగపర్రుని చూస్తే దేశవ్యాప్తంగా వేలాది గ్రామాల్లోని దళితుల దయనీయ పరిస్థితులు ఎలాంటివో అర్థమవుతుంది. ఇవాళ గరగపర్రు రాజులు కొత్తగా దళితుల్ని వెలి వేయలేదు. దేశంలో దళితులలో నూటికి 90 శాతం ఇంకా వెలిలోనే ఉన్నారు. అంటరానితనాన్ని, సాంఘిక బహిష్కరణను పాలకులే స్వయంగా పాటిస్తున్నారు. ఆ వాస్తవాన్నే గరగపర్రు నేడు
దేశానికి చూపిస్తోంది.

గరగపర్రులోని సుమారు నాలుగొందల దళిత కుటుంబాలలో కేవలం 20 కుటుంబాలకు, మొత్తం 20 ఎకరాల భూమి ఉంది. అంటే 5 శాతం దళితులకే అంతో ఇంతో భూమి ఉంది. అతి కొద్ది శాతంగా ఉండి, గ్రామాల్లో ఆధిపత్య స్థానాల్లో ఉన్న అగ్రవర్ణాల చేతుల్లోనే భూమి ఇంకా కేంద్రీకృతమై ఉంది. ఎందుకు? భూ సంస్కరణల డ్రామా ఎప్పుడు కోమాలోకి పోయింది? ఇది ఏ రకం వెలి? ఏ రకం సాంఘిక బహిష్కరణ? ఇలాంటి చాలా ప్రశ్నలను గరగపర్రు దేశం ముందు ఉంచింది. ఆ ఊర్లో విద్యావంతులై ఉద్యోగాలు చేస్తున్న దళితులు లేనే లేరు. డిగ్రీ దాకా నెట్టుకొచ్చిన నలుగురైదుగురు యువకులు రొయ్యల ఫ్యాక్టరీల్లో కార్మికులుగానే మిగిలారు. నిర్బంధ ఉచిత విద్య ఏమైపోయింది? రిజర్వేషన్లు ఏమైపోయాయి? ఈ చీకట్లకు ఏం పేరు పెట్టాలి? గరగపర్రు దళితుల్లో చాలా మంది ఉఫ్‌మని ఊదితే పడిపోయే తాటాకు గుడిసెల్లోనే బతుకులు నెట్టుకొస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితమే స్థలాలు ఇచ్చినా, ఇంకా పక్కా ఇళ్లు రాలేదు. కొందరు కాయకష్టంతో కడుపు కట్టుకుని ఇళ్లు కట్టుకున్నారు. దళితుల కోసం కట్టిన మరుగుదొడ్లు ఇంకా బేస్‌మెంట్‌ దశ దాటలేదు. దాపరికంలేని దగా బతుకులు వారివి.

వెలి బతుకులు ఇంకెన్నాళ్లు?
ఇంత దుర్భరమైన జీవితాలను గడుపుతున్నవారిని కొత్తగా వెలి వేయడం ఏమిటి? దశాబ్దాలుగా వెలిలోనే ఉన్నారుగా. అసలు ఊరికి వెలుపల ఎక్కడో తలదాచుకునే దౌర్భాగ్యం ఇంకా దళితులను వెంటాడటమే ఒక భయానక బహష్కరణ కాదా? ఇంత జరిగాక ఎలాగూ ఇక రాజీ ప్రయత్నాలు అనివార్యం. అంతా కలసి సామరస్య వాతావరణం నెలకొల్పడానికి అన్ని ప్రయత్నాలూ చేయాలి. రాజీ కృషి ఫలించి ఒప్పందం కుదిరిందని, దళితులు అది లిఖితపూర్వకంగా ఉండాలని పట్టుబడుతున్నారని తాజా సమాచారం. అంతా సవ్యంగా జరిగి, అన్నీ సద్దుమణిగినా ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. ఈ వెలి ఎన్నటికి తొలగిపోతుంది? తమ భూముల్లో తామే పనిచేసుకునే అదృష్టం దళితులకు ఏనాటికి ప్రాప్తిస్తుంది? ఒకరి దయాదాక్షిణ్యాల మీద కాక తమ కాళ్ల మీద తామే నిలబడే సత్తువ వారికి ఎప్పటికి సిద్ధిస్తుంది? దశాబ్దాలుగా అమలవుతున్నా, రిజర్వేషన్లు 90 శాతం దళితులకు ఎండమావులుగానే ఎందుకు మిగిలిపోయాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికైనా అంతా అన్వేషించాలి. ఈ వ్యాసాన్ని ముగిస్తుండగా ‘ప్రజలకు శాంతి, సౌఖ్యం కలిగించే దేశమె దేశం’ అనే పాట గుర్తుకొచ్చింది. దాంతో పాటూ కన్నీళ్లూ వచ్చాయి.  


- డాక్టర్‌ ప్రసాదమూర్తి

వ్యాసకర్త ప్రముఖ కవి, సీనియర్‌ పాత్రికేయులు
ఈ-మెయిల్‌ : pramubandaru@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement