అసాంఘిక చర్యలకు ఆశ్రయం
Published Sat, Mar 18 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
సాక్షి, రాజమహేంద్రవరం :
దేవతామూర్తులు కొలువైన పుష్కరఘాట్ పక్కన ఉన్న ‘ది ఆశ్రయ రెసిడెన్సీ’ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిలుస్తోంది. పేకాట, వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఈ లాడ్జి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థది కావడంతో లీజుదారుడైన నిర్వాహకుడు జూపూడి శ్రీనివాసరావు సమగ్ర వివరాలు తీసుకోకుండానే అడిగిన వారికి అడిగినట్లు గదులు ఇస్తున్నారు. ఈ నెల 6వ తేదీన ఓ విశ్రాంత పంచాయతీ కార్యదర్శి మూడో పట్టణ పోలీస్ స్టేష¯ŒSలో తాము ఆశ్రయ లాడ్జిలో ఉండగా పోలీసులమంటూ తమ వద్ద బంగారం తీసుకెళ్లారంటూ ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు మరో యువకుడు పురాతన నాణేలా సేకరణ వ్యాపారంలో భాగస్వాములు. వీరిరువురు తరచూ మద్యం సేవించి, మహిళలతో గడుపుతుంటారు. ఈ క్రమంలో యువకుడు ఆర్థికంగా నష్టపోయాడు. ఆ విశ్రాంత అధికారి వద్ద నుంచి ఎలాగైనా డబ్బు గుంజాలని విలేకరిగా చెప్పుకుంటున్న తన స్నేహితుడికి ఈ విషయం చెప్పాడు. దీంతో అనుకున్న ప్రకారం ఎప్పటిలాగే ఆ యువకుడు, విశ్రాంత అధికారి ఓ మహిళతో ‘ది ఆశ్రయ రెసిడెన్సీ’కి వెళ్లారు. వారు ఆ గదిలో ఉండగా యువకుడి స్నేహితుడు తాను పోలీసులమంటూ ఆ వృద్ధుడి వద్ద రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసి కేసు పెడితే ప్రభుత్వ పెన్ష¯ŒS ఆగిపోతుందంటూ బెదిరించడంతో ఆయన తన వద్ద ఉన్న 32 గ్రాముల బంగారు ఆభరణాలు ఇచ్చేశాడు.
జూపూడి శ్రీనివాసరావుపై కేసు నమోదు...
ఈ నెల 13న ఆ లాడ్జిలోనే పేకాట ఆడుతూ నగరానికి చెందిన పదిమంది దొరికారు. వీరందరూ ఒకే గదిని తీసుకున్నారు. సాధారణంగా ఒక గదిలో ఇద్దరు మాత్రమే ఉండగలరు. అలాంటిది పది మంది ఒక గది కావాలన్నప్పుడు లాడ్జి నిర్వాహకుడు తిరస్కరించాలి. కానీ ఇక్కడ యథేచ్ఛగా ఇచ్చేశారు. చిరునామా, గుర్తింపు కార్డులు కూడా తీసుకోలేదు. తీసుకుని ఉంటే వారు స్థానికులని గుర్తించేవారు. వారు పేకాట ఆడుతుండగా ఎస్పీ బి.రాజకుమారి ఇచ్చిన సమాచారం, ఆదేశాల మేరకు ఏజీఎస్ పోలీసులు ఆ లాడ్జిపై దాడి చేశారు. జూదగాళ్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అదే కేసులో నిర్వాహకుడు జూపూడి శ్రీనివాసరావును ఏ7గా పేర్కొన్నారు.
డబ్బులు వస్తుండడం చూస్తున్నాడు తప్ప అదనపు సమాచారం ఏదీ అడగకపోవడంతో ‘ది ఆశ్రయ రెసిడెన్సీ’ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పైగా అది నగరపాలక సంస్థది కావడంతో ఎవరికీ జవాబుదారీతనంగా ఉండనక్కరలేకపోవడంతో నిర్వాహకులు సైతం ఏమీ పట్టించుకోకుండానే గదులు ఇచ్చేస్తున్నారు. కాగా ఈ రెసిడెన్సీలో 18 గదులుండగా మొత్తం ఏసీ గదులే. గది ఒక్కరోజు ఫీజు రూ.1500. దీనిని నిర్మించిన నగరపాలక సంస్థ జూపూడి శ్రీనివాసరావుకి లీజుకు ఇచ్చింది. దీనిపై 2012 నుంచి నగరపాలక సంస్థకు లీజుదారుకు మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం.
Advertisement
Advertisement