illigal activities
-
పాత భవనం.. లోపల భూతల స్వర్గం.. స్పా మాటున హైటెక్ వ్యభిచారం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగరంలో భూతల స్వర్గాన్ని తలపించేలా స్పా, సెలూన్లు, వెల్నెస్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లు నిర్వహిస్తున్నారు. బయటకు వేరే కలరింగ్ ఉన్నా లోపల మాత్రం పాడు పనులను ప్రోత్సహిస్తున్నారు. మసాజ్ సెంటర్ల ముసుగులో హైటెక్ వ్యభిచార దందా కొనసాగుతోంది. వీటి మాయలో పడి ఎంతోమంది జేబులకు చిల్లులు పడుతుండగా ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. వీటి నియంత్రణకు పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె. రాణా నేతృత్వంలో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి విటులను అరెస్ట్‌చేసి కొందరికి ఈ మురికికూపం నుంచి విమక్తి కల్పించారు. మొదటి దశలో నగరంలో గుర్తించిన 190 స్పాలపై 18 ప్రత్యేక పోలీస్ బృందాలతో దాడులు చేశారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న స్పాలను సీజ్ చేసి నిర్వాకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇందులో కొంతమంది విటులను అదుపులోకి తీసుకొని 28 మంది యువతులకు మురికి కూపం నుంచి విముక్తి కల్పించారు. వారిని వారి సొంత గ్రామాలకు పంపారు. అనధికారికంగా నిర్వహణ.. గతంలో చేసిన తనిఖీల్లో చాలా వాటికి ఎలాంటి అనుమతులు లేకుండానే అనధికారికంగా నిర్వహిస్తున్నారు. స్పా, మసాజ్‌ల పేరుతో దోపిడీ చేస్తున్నట్లు గుర్తించారు. ఏకంగా కొన్ని స్పాలలో అసాంఘిక, అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నట్లు, అందుకు తగిన ఆధారాలు సైతం లభించడంతో పోలీసులు అటువంటి వాటిపై ఉక్కు పాదం మోపారు. రెండో దశలో పోలీసు నిఘా ఉన్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా ఓ హైటెక్ స్పా కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. దీనిపై పోలీసులు పక్కా స్కెచ్‌తో బందరురోడ్డులో స్టింగ్ అపరేషన్ చేసి అక్కడ క్రాస్ మసాజ్ జరగుతున్నట్లు నిర్ధారించుకొన్నాక, రెవెన్యూ, లోకల్ పోలీసులు, మహిళా సంరక్షణ కార్యదర్శులతో కలిసి దాడి చేసి స్పాను సీజ్ చేశారు. స్పా నిర్వాహకుడిని అరెస్ట్ చేసి, అక్కడ పట్టుబడిన యువతులను హోంకు తరలించారు. సెక్షన్ 18 కింద స్పాను ఖాళీ చేయించేలా అధికారులు హౌస్ ఓనర్‌కు నోటీసులు జారీ చేశారు. ఇవే కాకుండా గతంలో నగరంలో స్పాలకు వెళ్లిన అమాయకుల ఫొటోలను తీసి, బెదిరించి డబ్బులు గుంజుతున్న ముఠాలను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. పాత భవనం.. లోపల భూతల స్వర్గం.. పైకి చూసేందుకు మూడు అంతస్తుల పాత భవనం అయినా లోపల మాత్రం భూతల స్వర్గాన్ని తలదన్నేలా వసతులున్నాయి. అధునాతన బాత్ సౌక్యరం కలిగి ఉంది. హైటెక్ సెక్యూరిటీ కార్డు సిస్టం ద్వారానే లోనికి ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. మొదట స్పాలోకి వెళ్లగానే అందులో జరిగే కార్యకలాపాలు చూసుకొనేందుకు వీలుగా కస్టమర్లతో మాట్లాడేందుకు మేనేజరు, రిసెప్షనిస్ట్ ఉంటారు. వారు కస్టమర్‌కు వారి వద్ద ఉన్న వివిధ రకాల సర్వీసులను వివరిస్తారు. ఈ విధంగా కస్టమర్ తనకు కావాల్సిన సర్వీసును ఎంపిక చేసుకున్న తరువాత, వారు ఎంపిక చేసుకున్న సర్వీసుకు అనుగుణంగా రూమ్‌లకు రూ.3,700 నుంచి రూ.13,000 వరకు వసూలు చేస్తున్నారు. కస్టమర్‌కు కావాల్సిన సర్వీస్‌ను ఎంపిక చేసుకున్న తరువాత మేనేజర్ అక్కడ తన వద్ద ఉన్న ఉద్యోగిని, కస్టమర్‌తో రూమ్ లోపలికి పంపిస్తారు. రూమ్ లోపల కస్టమర్‌కు కావాల్సిన సరీ్వస్ చేసే సమయంలో కస్టమర్లను మాటల్లో దించి తన హావభావాలు, డ్రెస్ కోడ్‌తో రెచ్చగొట్టేలా చేస్తారు. స్పా ఉద్యోగి కస్టమర్‌కు వివిధ రకాలైన లైంగిక సరీ్వస్‌లను చెప్పి, వాటి ఖర్చుల కనుగుణంగా అదనంగా రూ. నాలుగు వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలన్నీ పోలీసు స్టింగ్ అపరేషన్‌లో వెలుగు చూసినట్లు సమాచారం. కఠిన చర్యలు తీసుకొంటాం నగరంలో స్పాలకు ఎలాంటి అనుమతులు లేవు. గత ఏడాది అక్టోబర్ నుంచి స్పాలపై నిఘా పెట్టి దాడులు చేయించాం. అందులో 15 స్పాలలో అసాంఘిక, అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశాం. కొంత మంది అనుమతులు తీసుకొన్నామని చెబుతున్నా వాటిని అతిక్రమించి చేయకూడని పనులు చేస్తున్నారు. అటువంటి వాటిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొంటాం. నిబంధనల విరుద్దంగా కార్యకలాపాలు చేస్తున్న స్పాలపై దాడులు చేసి సీజ్ చేసి నిర్వాహకులను అరెస్టు చేశాం. – టి.కె. రాణా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్. -
విజిలెన్స్ విస్తృత దాడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమార్కులపై విజిలెన్స్ విభాగం కొరడా ఝళిపిస్తోంది. సామాన్యులు, అన్నదాతలకు అండగా నిలుస్తోంది. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నవారిపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. అలాగే కల్తీలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు నెలల్లోనే 10,015 దాడులు నిర్వహించడంతోపాటు 2,891 కేసులను నమోదు చేసింది. ఇక వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుండటంతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలు, నకిలీ దందాల కట్టడికి కూడా రంగంలోకి దిగింది. అంతర్జాతీయ పరిణామాలు, పంటల సీజన్ పరిస్థితులను సావకాశంగా తీసుకుని అక్రమార్కులు సామాన్యులు, రైతులను దోపిడీ చేయకుండా విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధ పరిస్థితులను సాకుగా చూపించి.. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేయడం, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించడాన్ని గుర్తించింది. రాష్ట్రంలో అందుకు అవకాశం లేకుండా కట్టడి చేసేందుకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తోంది. ఇక కల్తీ విత్తనాలు, ఎరువుల కట్టడికి విజిలెన్స్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. అక్రమాలకు పాల్పడినవారిని గుర్తించి నిత్యావసర వస్తువుల చట్టం, తూనికలు–కొలతల చట్టం, ఆహార భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. తీవ్ర నేరాలకు పాల్పడినవారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తుండటంతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు. తిరుపతిలో వంటనూనెల దుకాణంలో విజిలెన్స్ అధికారుల తనిఖీ 10,015 దుకాణాలు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు.. విజిలెన్స్ అధికారులు రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 6 నుంచి మే 17 వరకు ఏకంగా 10,015 దుకాణాలు, వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన 2,891 దుకాణాలు, వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు. వాటిలో తూనికలు–కొలతల చట్టం కింద 2,689 కేసులు, నిత్యావసర వస్తువుల చట్టం కింద 71 కేసులు, ఆహార భద్రతా చట్టం కింద 113 కేసులతోపాటు 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 515 కేసులు నమోదు కాగా అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి. అక్రమ రవాణా మార్గాలపై దృష్టి గతంలో లేని విధంగా నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలు, అక్రమ రవాణా మార్గాలపై విజిలెన్స్ దృష్టి సారించింది. కర్ణాటకలో నకిలీ విత్తనాలు తయారుచేసే ముఠాలు వ్యవస్థీకృతమైనట్టు.. అక్కడి నుంచే రాష్ట్రంలోకి తరలిస్తున్నట్టుగా గుర్తించింది. దీంతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాలపై విజిలెన్స్ అధికారులు పటిష్ట నిఘా పెట్టారు. కర్ణాటక నుంచి విత్తనాలు కొనుగోలు చేసే వారిపై దృష్టిసారించారు. అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల దుకాణాలపై రెండు రోజులుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండురోజుల్లోనే 100 దుకాణాలపై దాడులు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన 12 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ప్రత్యేక బృందాల ద్వారా రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం.. వంట నూనెలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలను అడ్డుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. వంట నూనెలను అక్రమంగా నిల్వ చేస్తూ.. ధరలను అమాంతంగా పెంచేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇక వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుండటంతో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను విక్రయించకుండా తనిఖీలు ముమ్మరం చేశాం. అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – శంకబ్రత బాగ్చి, అదనపు డీజీ, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ తమ జిల్లా యూనిట్లను ఇంకా పునర్వ్యస్థీకరించలేదు. పాత 13 జిల్లాల యూనిట్ల వారీగా విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడులు, నమోదు చేసిన కేసుల వివరాలు.. -
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఫాంహౌస్‌లు.. రెచ్చిపోతున్న పోకిరీలు
సాక్షి, రంగారెడ్డి: పగలు ప్రశాంతంగా ఉండే పల్లెలు చీకటైతే చాలు గానాబజానా.. డీజే చప్పుళ్లతో హోరెత్తుతున్నాయి. ఫాంహౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. వేడుకల పేరుతో మద్యం, హుక్కా, గంజాయి మత్తులో తూలుతున్నా పట్టించుకునేవారు లేకుండాపోయారు. నగరాల్లోనే కనిపించే పాడు కల్చర్ ఇప్పుడు పల్లెలకూ పాకింది. పేకాట, కోళ్ల పందేలు, రెయిన్ డాన్స్, ముజ్రా పార్టీలకు సైతం ఫాంహౌస్‌లు వేదికలవుతున్నాయి. పా ర్టీల పేరుతో నిర్వహించే ఈవెంట్లతో యువత పెడ దారి పడుతోంది. నగరానికి అతి చేరువలో ఉన్న శివారు ప్రాతాల్లో వేల సంఖ్యలో ఫాంహౌస్‌లు ఉ న్నాయి. నిత్యం ఏదో ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నా రు. కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ కూడా వినియోగిస్తున్నారు. మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, శంషాబాద్, కొత్తూరు, షాద్‌నగర్, మహేశ్వరం, కందుకూ రు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లోని ఫాంహౌస్‌లలో ఈ వ్యవహారం ఎక్కువగా నడుస్తోంది. పోకిరీలతో ఇబ్బందులు.. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలన్నీ ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాయి. ఇక్కడ మాత్రం ఫాంహౌస్‌లు గ్రామాలకు అతి చేరువలో ఉండడంతో గానా బజానాల్లో మునిగి తేలుతున్నాయి. పోకిరీలు మద్యం మత్తులో గ్రామాల్లోకి వచ్చి గొడవలకు దిగుతున్నారు. డీజే సౌండ్స్, గొడవలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల మొయినాబాద్ మండలం చిన్నషాపూర్లోని ఓ ఫాంహౌస్‌లోకి వచ్చిన పోకిరీలు అర్థరాత్రి గ్రామంలో సంచరిస్తుండగా గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో వారిపై దాడికి తెగబడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వారం రోజులపాటు స్టేషన్ చుట్టూ తిరిగితే అప్పుడు కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. అనుమతులు లేకుండా.. నగరానికి చేరువలో ఫాంహౌస్‌లు నిర్మించి వాటిని ఆన్లైన్ ద్వారా అద్దెకిస్తున్నారు. ఏదైనా వేడుక చేసుకోవాలనుకున్నవారు ఆన్లైన్లో బుక్‌చేసుకుంటారు. మద్యం వినియోగిస్తే ఎక్సైజ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అవేవీ పట్టించుకోకుండా మద్యం వినియోగం కొనసాగుతోంది. దీనికి తోడు హుక్కా, గంజాయిని సైతం వినియోగిస్తున్నారు.మూడు నెలల క్రితం ఓ ఫాంహౌస్‌లో జరిగిన జన్మదిన వేడుకల్లో గంజాయి వినియోగిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఇటీవల షాద్‌నగర్, కొత్తూరు ప్రాంతాల్లోనూ గంజాయి పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ బయటపడుతున్నా ఎక్సైజ్, స్థానిక పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి తీసుకోవాలి.. ఫాంహౌస్‌లలో చిన్నచిన్న వేడుకలు, పార్టీలు జరిగితే యజమానులు ఎలాంటి అనుమతి తీసుకోవడం లేదు. పార్టీలు, ఈవెంట్లు జరిగినప్పుడు మద్యం వినియోగిస్తే ఎక్సైజ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వేడుకల్లో మాదకద్రవ్యాలు వినియోగిస్తే చర్యలు తప్పవు. – రాజు, ఇన్స్పెక్టర్, మొయినాబాద్ -
చేయి తడిపితే చాలు.. ఏ భూమైనా..
జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి హద్దే లేకుండా పోయింది. చేయి తడిపితే చాలు నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినందుకు సబ్రిజిస్ట్రార్లు భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నారు. గత టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతల సహకారంతో అక్రమ రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగినట్లు తెలుస్తోంది. ఒక టీడీపీ ఎమ్మెల్సీ ప్రోద్బలంతో రూ.10 కోట్ల విలువజేసే భూమిపై న్యాయస్థానంలో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం వెనుక రూ.కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. సాక్షి, నెల్లూరు: జిల్లాలోని కోవూరు మేజర్ పంచాయతీ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 295లో 3.30 ఎకరాలు భూమి ఉంది. ఆ గ్రామంలో అగర్వాల్ నారాయణదాసుకు సంబంధించిన ఆస్తి ఉంది. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు వారసులుగా ఉన్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న ఆ భూమి ప్రస్తుతం మార్కెట్‌ధర రూ.10 కోట్లుగా ఉంది. ఈ భూమిపై స్థానిక టీడీపీ నేత కన్ను పడింది. ఎలాగైనా ఆ భూమిని కారుచౌకగా కొట్టేయాలని పథకం వేసిన టీడీపీ నేత అగర్వాల్ నారాయణ దాసుకు చెందిన ఓ కుమార్తె పద్మాబాయ్ ఆరుగురు పిల్లలను వారసులుగా చూపించి ఆ భూమిని 2010లో జీపీ (జనరల్ పవరాఫ్ పట్టా) కమ్ సేల్ అగ్రిమెంట్ చేయించుకున్నాడు. కానీ ఆ భూమికి ఇంకా వారసులు చాలా మంది ఉన్పప్పటికీ ఒక కుమార్తె పిల్లల చేత అక్రమంగా జీపీ చేయించుకుని భూమిని సొంతం చేసుకునేలా పథకం వేశారు. ఆ భూమిని ఇతరులు కొనుగోలు చేయకుండా అప్పటి జిల్లా తెలుగు యువత నేతతో కుమ్మక్కై న స్థానిక టీడీపీ నేత మాస్టర్‌ప్లాన్ వేసి సేల్ అగ్రిమెంట్ చేశారు. ఆ ఇద్దరు మధ్య వివాదం ఉన్నట్లు సృష్టించి జిల్లా జడ్జి కోర్టులో ఇంజక్షన్ అర్డర్ తెచ్చారు. అయితే వైఎస్సార్ జిల్లాకు చెందిన ఆర్.శేఖర్‌బాబు అలియాస్ యల్లారెడ్డి కూడా పద్మాబాయ్ అక్క సుందరాబాయ్ పిల్లల చేత ఆ భూమిలో సగభాగం 1.67 సెంట్లు భూమిని సేల్ డీడ్‌ను 2013లో చేయించుకున్నాడు. దీంతో వారి మధ్య భూ వివాదం తలెత్తింది. న్యాయస్థానంలో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న ఆ భూమిని నిషేధిత జాబితాలో ఉంచాల్సిన రిజిస్ట్రేషన్ శాఖ కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టారు. న్యాయస్థానం ఉత్తర్వులున్నా.. కోవూరుకు చెందిన 295 సర్వే నంబర్‌పై జిల్లా ఐదో జిల్లా జడ్జి కోర్టులో ఆ భూమిని ఎవరూ క్రయ, విక్రయాలు చేయకూడదని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కానీ 2012 డిసెంబర్ 26వ తేదీన అప్పటి కోవూరు సబ్‌రిజిస్ట్రార్ కె.శోభమ్మ 30 అంకణాలను డాక్యుమెంట్ నంబరు 2327–2012 రిజిస్ట్రేషన్ చేసింది. అప్పటికే ఆ భూమిపై న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నాయని ఆమె దృష్టికి తీసుకెళ్లినా ఆ సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో నమోదు చేయకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసింది. మరో ఏడాది పాటు 2013 డిసెంబర్ వరకు కోర్టు ఉత్తర్వులు ఉన్న ఆ సర్వే నంబరును నిషేధిత జాబితాలో చేర్చకుండా కావాలనే జాప్యం చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరలేపారు. ఆపై అదే భూమిని నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నాగేశ్వరరావు సబ్‌రిజిస్ట్రార్ కూడా 4159–2013, 4409–2013, 4410–2013 డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేశారు. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే జీïïపీఏ కమ్ సేల్ చేసిన వ్యక్తి అగర్వాల్ రామ్ ప్యారీ అనే వ్యక్తి మరణించాడు. జీపీఏ చేసిన వ్యక్తి చనిపోతే జీపీ కమ్ సేల్ అగ్రిమెంట్ ఆటోమేటిక్‌గా రద్దు అయిపోయింది. కానీ ఇవేమీ పట్టించుకోని సబ్ రిజిస్ట్రార్ మాత్రం భారీగా ముడుపులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేశాడు. అలాగే అదే సర్వే నంబరును అల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్ సింహాద్రినాయుడు డాక్యుమెంట్ నంబర్లు 823–2013, 824–2013, 825–2013, అలాగే నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నంబర్లు 822–2014, 823–2014, 1540–2014, 3306–2014, 3854–2014, 3855–2014గా రిజిస్ట్రేషన్ చేశారు. 2013లో నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్న నాగేశ్వరరావు 2015లో కోవూరు సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో కూడా డాక్యుమెంట్ నంబర్లు 361–2015, 362–2015, 458–2015,1661–2015, 1686–2015గా మరోసారి రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే 2014లో స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్న నందకిశోర్ కూడా అదే సర్వే నంబర్‌ను డాక్యుమెంట్ నంబర్లు 4202–2014, 4203–2014గా రిజిస్ట్రేషన్ చేశారు. టీడీపీ హయాంలో నివేదకలు తొక్కిపెట్టి.. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి భారీగా లబ్ధిపొందిన ఆ ఐదుగురు సబ్రిజిస్ట్రార్లపై శేఖర్‌బాబు అలియాస్ ఎల్లారెడ్ది ఫిర్యాదు మేరకు టీడీపీ హయాంలో పలుమార్లు విచారణ చేపట్టి నివేదిక తొక్కిపెట్టారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్సీ అండతో నివేదికలను తొక్కి పెట్టి చర్యలు తీసుకోలేకపోయారు. ఈ అవినీతి బాగోతం వెనుక గతంలో రిజిస్ట్రేషన్‌శాఖ జిల్లా డీఐజీగా పనిచేసిన అధికారితోపాటు అప్పటి నెల్లూరు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ హస్తం ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. దీంతో గత ఐదేళ్ల పాటు కేవలం విచారణ పేరుతో కాలయాపన చేశారు. న్యాయం కోసం లోకాయుక్తకు ఫిర్యాదు టీడీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు ఎల్లారెడ్డి న్యాయం కోసం లోకాయుక్తను ఆశ్రయించాడు. గతంలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ మునిశంకరయ్య అక్రమ రిజిస్ట్రేషన్లపై వాస్తవ నివేదిక ఇచ్చినా కూడా చర్యలు తీసుకోలేదని, గత ఐదేళ్లగా విచారణ పేరుతో కాలయాపన చేస్తూ అవినీతికి ఉన్నతాధికారులు కొమ్ముకాస్తున్నారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో లోకాయుక్త వాస్తవ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకతో మరోసారి విచారణ అవినీతి రహిత పాలనలో ముందుకెళ్తున్నా ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి అధికారులపై మరోసారి విచారణకు ఆదేశించారు. రెండు నెలలుగా విచారణ చేపట్టిన అధికారులు ఐదుగురు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసింది వాస్తవమే అన్నట్లు నిర్ధారించి నివేదిక తయారు చేశారు. -
దేవుడి భూమిలోనూ అక్రమంగా.
సాక్షి, పాలకొల్లు(పశ్చిమ గోదావరి): భూమి యజమాని తన స్థలంలో మట్టిని తవ్వుకోవాలన్నా అధికారుల అనుమతులు తప్పనిసరి. అలాంటిది దేవస్థానం భూమిని కౌలుకు తీసుకున్న ఓ కౌలు రైతు ఆ భూమిలో మట్టిని దర్జాగా బయటకు తరలించేస్తుండటం గమనార్హం. పంచారామక్షేత్రాల్లో ప్రసిద్ధి గాంచిన పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానం భూమి అనేక చోట్ల ఉంది. స్వామివారి పేరున సుమారు 57.30 ఎకరాల భూమి ఉంది. అందులో సుమారు ఆరు ఎకరాలు సబ్బేవారి పేట శివారు ప్రాంతంలో ఉంది. దానిని ఓ రైతు కౌలుకు పాడుకున్నాడు. ఇంకా సంవత్సరంన్నర కౌలు గడువు ఉన్నట్లు సమాచారం. ఈ ఆరు ఎకరాల్లో మట్టిని నాలుగు రోజుల నుంచి తవ్వేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవుని భూమిని కౌలుకు తీసుకుని పంటను పండించుకోవాలి గాని ఇలా మట్టి అమ్మేసుకుంటారా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం మట్టిని తవ్వుతుండగా దేవస్థానం సిబ్భంది వచ్చి రైతును హెచ్చరించి వెళ్లారని వారు వెళ్లిన తరువాత మళ్లీ తవ్వడం మొదలు పెట్టాడని స్థానికులు తెలిపారు. కాని రెండోసారి దేవస్థానం అధికారులు గాని సిబ్బంది గాని ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని చెబుతున్నారు. రూ. ఏడు లక్షలు స్వాహా ఎకరాకు సుమారు 300 నుంచి 350 ట్రాక్టర్ల చొప్పున సుమారు నాలుగు ఎకరాల్లో సుమారు 1200 నుంచి 1400 ట్రాక్టర్ల మట్టిని అక్రమంగా తరలించినట్టు సమాచారం. ఒక్కో ట్రాక్టర్ మట్టి రూ.500 వరకూ విక్రయిస్తున్నారు. అంటే సుమారు ఇప్పటి వరకు రూ. ఏడు లక్షల వరకు మట్టిని స్వాహా చేసేశారు. దీనిపై దేవస్థానం అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మట్టి తవ్వాలంటే అనుమతులు ఉండాలి ఏభూమిలో అయినా మట్టిని తవ్వాలంటే ముందుగా అనుమతులు తీసుకోవాలి. భూమి వివరాలతో పాటు మట్టిని ఎందుకు విక్రయిస్తున్నారో తెలిపే విదంగా ఒక దరఖాస్తును తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలి. దానిని మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్‌కు సిఫార్సు చేస్తాం. దాంతో మైనింగ్ సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది కలిసి భూమిని సర్వే చేసి ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వాలో అంచనాలు వేస్తారు. అంచనాలు వేసిన క్యూబిక్ మీటర్లకు సీనరేజి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన భూమిలో మట్టి తవ్వకానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. – ఎస్. నరసింహారావు, తహసీల్దార్, పాలకొల్లు -
‘ఖాకీ’ కళంకం
సాక్షి, నిర్మల్ : భద్రత మాదే..బాధ్యత మాదే.. ఉన్నది మేం మీ కొరకే.. రాత్రని లేదు.. పగలని లేదు..’ అంటూ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసుగా ఆ శాఖ గుర్తింపు తెచ్చుకుంటోంది. కానీ.. అదే శాఖలో కొంతమంది ఖాకీల తీరు మొత్తం వ్యవస్థకే కళంకం తెస్తోంది. ఇటీవల కొంతమంది పోలీసు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఫ్రెండ్లీ పోలీసుకు వ్యతిరేక అర్థాన్నిస్తున్నాయి. ఓ వైపు ఉన్నతాధికారులు జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు శాయశక్తులా కృషిచేస్తుంటే.. కొంతమంది కిందిస్థాయి కానిస్టేబుళ్లు మాత్రం ‘ఖాకీ’ చొక్కాను అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి.. పోలీస్‌శాఖలో పలువురు కానిస్టేబుళ్లు అడ్డదారులు తొక్కుతున్నారన్న విషయం రెడ్‌హ్యాండెడ్‌గా బయట పడింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోనే ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీఎస్(సెంట్రల్ క్రైం స్టేషన్) కానిస్టేబుల్ ఎబ్‌నైజర్ ఓ గుర్తు తెలియని యువతితో నిర్మల్‌లోని ఓ లాడ్జిలో ఉండగా.. స్థానిక యువకులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన వారే ఇలా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీసుల వివరణ మరోలా ఉంది. హైదరాబాద్ నుంచి నిర్మల్ వచ్చిన సదరు యువతి తన ఊరికి వెళ్లాల్సిన బస్సు వెళ్లిపోవడంతో బస్టాండ్‌లోనే ఉండిపోయింది. పలువురు వ్యక్తులు ఆమెను వేధిస్తున్నట్లు సీసీఎస్ పోలీసుల దృష్టికి వచ్చింది. ఈమేరకు కానిస్టేబుల్ ఎబ్‌నైజర్ ఆమె వద్దకు వెళ్లి, బస్సు అందుబాటులో లేకపోవడంతో సమీపంలోని లాడ్జీలో ఉంచేందుకు తీసుకెళ్లినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఏది ఏమైనా.. ఓ కానిస్టేబుల్ ఇలా లాడ్జీలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. సస్పెన్షన్ దాకా.. అసాంఘిక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన కానిస్టేబుల్ ఎబ్‌నైజర్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆదివారం జరిగిన ఘటనపై మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఎస్పీ శశిధర్‌రాజు మంగళవారం ఎబ్నైజర్కు సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు. ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా ఉన్న ఎబ్‌నైజర్ ప్రస్తుతం సీసీఎస్ అటాచ్డ్ కానిస్టేబుల్‌గా కొనసాగుతున్నారు. లాడ్జీలో ఉండగా స్థానిక యువకులు వీడియోలు తీయడంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. దారితప్పుతున్న ఖాకీ.. ఓ వైపు ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసు విధానం అమలు చేస్తోంది. పోలీసులకు ఇటీవలే వీక్లీ ఆఫ్ కూడా ప్రకటించింది. కానీ.. డిపార్ట్మెంట్ పేరు చెప్పి ప్రజల్లో ఉన్న కాసింత భయాన్ని కొంతమంది తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఖాకీ చొక్కాకు ఉన్న విలువను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారు. నెలవారీగా వసూళ్లు, శాఖ పేరు చెప్పి డబ్బులు తీసుకోవడం, కేసులు వస్తే తమకు లాభం చేకూరేలా వ్యవహరించడం.. ఇలా పలువురు కానిస్టేబుళ్ల వ్యవహారం నడుస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో తలమునకలైన ఉన్నతాధికారుల దాకా వీరి వ్యవహారం వెళ్లడం లేదు. కొంతమంది అధికారులకు తెలియకుండా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. . చిన్నకేసులేనా..? జిల్లాలో పేకాట ఆడేవారిని పట్టుకునే పోలీసులు.. మట్కా, గుట్కావంటి పెద్ద దందాలను నడిపే వారిని ఎందుకు వదిలేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొంతమంది అధికారం అండదండలతో దొంగ దందాలు నడుపుతున్నారన్న విషయం తెలిసినా.. అడ్డుకోవాల్సిన పోలీసులు ‘మాములు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చిన్నపాటి పేకాట కేసులను పెద్దగా చూపే పోలీసులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిన పలు లాడ్జీలపై ఇప్పటివరకు ఎందుకు దృష్టి పెట్టలేదన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాకేంద్రంలోని బస్టాండ్‌లోనే ఏడాదిలో దాదాపు యాభైకిపైగా దొంగతనాలు జరిగాయి. ఇందులో రికవరీ చేసింది పదిలోపే ఉన్నాయి. మిగతా వాటి సంగతి ఏమవుతోంది..? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. సమాజ రక్షకులుగా కొండంత అండగా నిలబడే పోలీస్ శాఖకు కళంకం తెచ్చే కొందరిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరమూ ఉంది. చర్యలు తప్పవు.. పోలీస్‌శాఖకు మచ్చతెచ్చేలా ఎవరు ప్రవర్తించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. సీసీఎస్ కానిస్టేబుల్‌పై వచ్చిన ఆరోపణల మేరకు కేసు నమోదుతోపాటు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశాం. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయడానికే ప్రతి పోలీసూ ప్రయత్నించాలని చెబుతున్నాం. – శశిధర్‌రాజు, ఎస్పీ, నిర్మల్ -
టీడీపీ నేతల ‘దారి’ దోపిడీ!
సాక్షి, ప్రకాశం : కందుకూరులో టీడీపీ నాయకులు ‘దారి’ దోపిడీకి తెగబడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంతర్గత రోడ్ల నిర్మాణం పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. అందులో భాగంగా జీప్లస్‌త్రీ ఇళ్ల వద్ద అంతర్గత రోడ్ల నిర్మాణానికి బయట ప్రదేశం నుంచి గ్రావెల్ తోలాల్సి ఉండగా, పక్కనే పేదలకు పంపిణీ చేసిన స్థలాల్లో భారీ గోతులు తవ్వి ఆ మట్టిని తరలించారు.కందుకూరు పట్టణంలోని ఉప్పుచెరువు వద్ద ఎన్టీఆర్ నగర్ పేరుతో నిర్మిస్తున్న జీప్లస్‌త్రీ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. అక్కడ నివాసం ఉండే పేదలకు మౌలిక వసతులతో పాటు అంతర్గత రోడ్లు నిర్మించాలి. అందుకోసం అప్పటి ప్రభుత్వం సుమారు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో సింగరాయకొండ మండంలోని శానంపూడి గ్రామ వద్ద నుంచి గ్రావెల్ మట్టిని తోలి రోడ్ల నిర్మాణాలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. కానీ టీడీపీ నాయకులు అధికారం చేతిలో ఉంది కదా తాము ఏమిచేసినా చెల్లుతుందని ఇష్టానూసారంగా వ్యవహరించారు. నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాల్సి ఉండగా మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో శానంపూడి నుంచి మట్టిని తొలకుండా జీప్లస్‌త్రీ భవనాల పక్కనే గతంలో మహీధర్‌రెడ్డి పేదలకు పట్టాలు పంపిణీ చేసిన భూముల్లో మట్టి తవ్వి అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. పేదలకు చెందిన 6 ఎకరాల భూమిలో 9 అడుగుల తోతున మట్టి తవ్వి.. జీప్లస్‌త్రీ ఇళ్ల వద్ద రోడ్లు వేసి నిధులు బొక్కేందుకు పథకం రచించారు. అయితే టీడీపీ ఘోర ఓటమి చెందడం.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నాయకుల అవినీతి బాగోతం బయట పడింది. యథాస్థానానికి మట్టి తోలకం స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి గతంలో çపురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో పేదలకు పంపిణీ చేసిన పట్టాలకు పొజిషన్ చూపించడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఆయన అధికారులతో కలిసి స్థలాల పరిశీలన కోసం వెళ్లగా 9 అడుగుల లోతున గోతులు తవ్విన విషయం బయటపడింది. టీడీపీ నాయకులు యథేచ్ఛగా మట్టి తవ్వి జీప్లస్‌త్రీ నివాసాల వద్ద అంతర్గత రోడ్లు నిర్మిస్తుంటే అధికారులు చేష్టలుడిగి చూశారు. టీడీపీ నాయకుల అక్రమాలు, అధికారుల ఉదాసీన వైఖరి బయట పడటంతో తప్పును చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా కమిషనర్ వి.శ్రీనివాసరావు జీప్లస్‌త్రీ ఇళ్లు నిర్మిస్తున్న కంపెనీకి నోటీసులు జారీచేశారు. దీంతో ఆ కంపెనీ యాజమాన్యం రెండు రోజుల నుంచి జీప్లస్‌త్రీ ఇళ్ల వద్ద అంతర్గత రోడ్లకు తోలిన మట్టిని జేసీబీ సహాయంతో మరలా పేదలకు పంపిణీ చేసిన లే అవుట్లలోని గోతులను పూడ్చే పనిని ముమ్మరం చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే అధికారులను ఆ పార్టీ నాయకులు ప్రలోభపెట్టి బిల్లులు చేసుకుని జేబులు నింపుకొనే వారని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై జీప్లస్‌త్రీ ఇళ్లకు సంబంధించిన ఓ అధికారిని వివరణ కోరగా గత ప్రభుత్వంలో టెండర్లు పిలవకుండానే టీడీపీ నాయకులు మట్టిని తోలారని, అందువల్ల ప్రభుత్వ ఆదేశాలతో రోడ్లకు సంబంధించిన పనులు రద్దు చేసినట్లు తెలిపారు. -
టీడీపీ నేతల భూదాహం.. రైతులకు శాపం
సాక్షి, నగరం(గుంటూరు) : గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకుల భూదాహం రైతుల పాలిట శాపంగా మారింది. మండలంలోని టీడీపీ నేతల అక్రమాలకు రేపల్లె ప్రధాన మురుగు కాల్వ కట్ట (ఆర్ఎం డ్రైయిన్), న్యూకోర్స్ కాల్వ కట్టలు బక్కచిక్కిపోయాయి.వీటిని అభివృద్ధి పరిచిన సంవత్సరానికే కోతకు గురయ్యాంటే కాల్వ కట్టలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాల్వ కట్టల మట్టిని మట్టానికి కల్లా టీడీపీ నాయకులు దోచుకోవడంతో చిన్న పాటి వర్షాలకే అవి భారీగా కోసుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నగరం నుంచి అద్దంకివారిపాలెం వెళ్లే దారిలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో 10 నుంచి 15 చోట్ల కాల్వకట్ట భారీగా కోసుకుపోయింది. ఈ విషయంపై అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓగ్ని తుఫాన్ సమయంలో రైతులకు అపారనష్టం: 2006 సంవత్సరంలో ఓగ్ని తుఫాన్ సమయంలో నగరంలో కాల్వ కట్టకు భారీగా గండి పడింది. వేలాది ఎకరాల్లోని పంట ముంపుకు గురై, కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఆ సమయంలో గండి పూడ్చేందుకు లక్షలాది రూపాయల్ని వెచ్చించినా అప్పటికే రైతులకు అపారనష్టం వాటిల్లింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటి ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణారావు కాల్వ కట్టల అభివృద్ధికి నిధుల కేటాయించాలని కోరగా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కాల్వకట్టల అభివృద్ధికి సుమారుగా రూ.12 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో విడతల వారీగా కాల్వ కట్టలను అభివృద్ధి పరిచారు. తర్వాత 2012లో రూ.9.5 కోట్లతో అద్దంకివారిపాలెం నుంచి ఈదుపల్లి వరకు సుమారు 6 కి.మీ మేర కాల్వ కట్టల అభివృద్ధి పనులు ప్రారంభించారు. రెండేళ్ల పాటు కాల్వ కట్టల అభివృద్ధి పనులు నిర్వహించారు. ఈ సమయంలో వచ్చిన మట్టిని కాల్వ కట్టలపై గుట్టలుగా పోశారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతల కన్ను మట్టి గుట్టలపై పడింది. దీంతో నిబంధనలను తుంగలోకి తొక్కి అడ్డగోలుగా మట్టిని అమ్ముకుని జేబులు నింపుకున్నారు. కనీసం కట్ట ఎత్తు 10 అడుగులపై ఉంచాల్సిన మట్టిని మట్టానికి కల్లా తీసేయడంతో కాల్వ కట్టలు బక్కచిక్కిపోయాయి. ఈ సమయంలో రైతులు అభ్యంతరాలు చెప్పినా అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా కోట్లాది రూపాయల మట్టిని అమ్ముకుని జేబులు నింపుకున్నారు. దీంతో కాల్వ కట్టల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కాల్వ కట్టల మరమ్మత్తుల పేరుతో నిధుల దోపిడీ.. కాల్వ కట్టల మరమ్మత్తు నిధులను టీడీపీ నేతలు దోపిడీ చేశారనే వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. 2016 సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు కారంకివారిపాలెం సమీపంలో మురుగుతూముల వద్ద కాల్వ కట్టకు గండి పడింది. ఆ సమయంలో నీటి ఉదృతి అంతగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం చోటుచేసుకోలేదు. ఈ సమయంలో కట్టల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ నుంచి సుమారుగా 10 లక్షల నిధులు కేటాయించారు. ఈ నిధులను టీడీపీ నేతలు దోపిడీ చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. మరమ్మత్తు పనులను తూతూ మంత్రంగా నిర్వహించి, నిధులను స్వాహా చేశారని పలువురు బహిరంగంగా వాఖ్యానిస్తున్నారు. మురుగుతూముల వద్ద కల్వర్టులు నిర్మించకుండా కట్టలు మాత్రం పూడ్చారు. అప్పుడు పనుల్లో నాణ్యత కొరవడుతుందని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వ కట్టలకు గండ్లు పడకముందే వాటిని పటిష్టం చేయాలని రైతులు కోరుతున్నారు. చిన్నపాటి వర్షానికే గండి పడుతోంది.. రేపల్లె ప్రధాన మురుగు కాల్వ కట్టలు బలహీనంగా ఉండటం వల్ల చిన్నపాటి వర్షాలకే వాటికి గండి పడుతున్నాయి. కాల్వకు గండి పడటం వల్ల పంట పొలాలు ముంపుకు గురై అపార నష్టం వాటిల్లుతుంది. రైతుల బాధల్ని అర్థం చేసుకుని కాల్వ కట్టలను అభివృద్ధి పరచాలి – కారంకి రాం బాబు, రైతు కాల్వ కట్టల ఎత్తు పెంచాలి కాల్వ కట్టల మట్టిని తరలించడం వల్ల కట్టలు బలహీనమయ్యాయి. కాల్వ కట్టలు రహదారి ఎత్తులో ఉండటం వల్ల వర్షపు నీటికి కట్టలు కోసుకుపోతున్నాయి. కట్టల ఎత్తు పెంచితే కోతకు గురికాకుండా ఉంటాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వ కట్టలను పటిష్ట పరచాలి. లేకపోతే పంటలు ముంపుకు గురికాక తప్పదు. – ఎం నాగరాజు, రైతు -
అభివృద్ధి ముసుగులో ‘స్మార్ట్’గా దోపిడీ
సాక్షి, కాకినాడ( తూర్పు గోదావరి) : దేశవ్యాప్తంగా తొలి విడతలోనే జిల్లా కేంద్రం కాకినాడ ఆకర్షణీయ నగరంగా ఎంపికైందన్న ఈ ప్రాంతవాసుల ఆనందంపై గత తెలుగుదేశం పాలకులు నీళ్లు చల్లారు. వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుని కాకినాడ నగరాన్ని అభివృద్ధి వైపు నడిపించాల్సిన పాలకులు ఆ నిధులను కైంకర్యం చేసేందుకే ప్రాధాన్యతనివ్వడంతో అభివృద్ధిపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. 2016లో కాకినాడ నగరాన్ని స్మార్ట్‌సిటీగా ఎంపిక చేశాక తొలివిడతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ద్వారా రూ.384 కోట్లు విడుదలయ్యాయి. ఒక్కసారిగా అంతమొత్తంలో నిధులు విడుదల కావడంతో వాటిని ఎలా స్వాహా చేయాలనే అంశంపైనే అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. సరైన అంచనాలు, పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసారంగా పనులు మంజూరు చేయించి అందిన కాడకు దోచుకున్నారు. వేసిన రోడ్లపైనే మళ్లీమళ్లీ రోడ్లు వేయడం, లోపభూయిష్టమైన టెండరింగ్ విధానాన్ని అనుసరిస్తూ ఇష్టారాజ్యంగా టెండర్లు పిలవడం ద్వారా కోట్లాది రూపాయలను బొక్కేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. నగరంలో అనేకచోట్ల రహదారులు ధ్వంసమైనప్పటికీ పట్టించుకోని అధికారులు శుభ్రంగా ఉన్న రహదారులపై మళ్లీ మళ్లీ రోడ్లు వేయడం విమర్శలకు తావిచ్చింది. ప్రజాప్రతినిధుల ధన దాహానికి స్మార్ట్‌సిటీలో పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేసిన ఓ కీలక అధికారి అండదండలు ఉండడంతో ఇక ఆ నేతల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మంజూరైన రూ.384 కోట్లలో ఇప్పటి వరకు దాదాపు రూ.290 కోట్ల వరకు సొమ్ములు కూడా చెల్లించేశారు. కొత్త ప్రభుత్వం రాకతో బెంబేలు స్మార్ట్‌సిటీ నిధులను అడ్డంగా బొక్కేసిన నేతలకు ప్రభుత్వం మారడంతో షాక్ తగిలింది. ఇష్టారాజ్యంగా పనులు చేయించి నిధులు దిగమింగిన నేతల అక్రమాలు ఇప్పుడు బయటపడతాయన్న భయం వారిలో నెలకొంది. అప్పటి ప్రజాప్రతినిధి ఆదేశాలకు జీ హుజూర్ అంటూ తలాడించిన అధికారులకు ఇప్పుడు దడ పట్టుకుంది. కొత్త ప్రభుత్వం వచ్చాక స్మార్ట్‌సిటీ ద్వారా జరుగుతున్న ఆరు ప్రాజెక్టులకు సంబంధించి రూ.198 కోట్ల పనులు నిలుపుదల చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎన్నికల ముందే స్మార్ట్సిటీపనుల్లో అక్రమాలను ఉన్నత స్థాయి వరకు తీసుకువెళ్లడంతో అప్పట్లోనే పనులను నిలుపుదల చేసి విచారణకు ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం కూడా మారిన నేపథ్యంలో నాటి అక్రమాలు వెలుగుచూసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అధికారులు చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక, ఎన్నికల పూర్తయ్యాక కూడా ఆగమేఘాలపై రేయింబళ్లు, రాత్రి, పగలు కూడా పనిచేసి అనేక రోడ్డు నిర్మాణాలను పూర్తి చేసేశారు. వందలకోట్ల నిధులతో నగరాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా చేసే అవకాశాన్ని నీరుగార్చి స్వార్థంగా వ్యవహరించి నిధులు బొక్కేసిన పాలకుల అవినీతి త్వరలోనే వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు. -
పార్కుల్లో మందు‘పార్టీలు’
సాక్షి, పరవాడ: ఆహ్లాదాన్ని పంచే పార్కులు అసాంఘి క కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నా యి. తీర ప్రాంతాల్లోని పార్కుల్లో నిత్యం మందు‘పార్టీలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వచ్చే పర్యాటకులు, సందర్శకులు నానా అవస్థలు పడుతున్నారు. ముత్యాలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన పార్కులు అధ్వానంగా తయారయ్యాయి. తీరంలో సేద దీరడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల కోసం సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన సీ వాటర్ పార్కు, మినీ పార్కుల దుస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇక్కడ పార్కులకు విశాఖ స్టీల్ ప్లాంటు, గాజువాక, అగనంపూడి, సబ్బవరం, అనకాపల్లి, పరవాడ, ఎన్టీపీసీ తదితర ప్రాంతాల నుంచి ప్రతీ ఆదివారం, సెలవు దినాల్లో పర్యాటకులు నిత్యం అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. వేసవి సెలవుల్లో నిత్యం విద్యార్థులతో తీర ప్రాంతాలతో పాటు పార్కులు కళకళలాడుతుంటా యి. అయితే కొందరు ఆకతాయిల వల్ల ఇవి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే యువకులు పుట్టిన రోజు, పెళ్లి రోజు పేరుతో నిత్యం మందు పార్టీలు చేసుకుంటున్నారు. పర్యాటకానికి దెబ్బ... తాగిన మద్యం సీసాలు, ఆకులు, ప్లేట్లు, డ్రింకు బాటిళ్లు, సిగరెట్లు తదితర వస్తువులను ఎక్కడపడితే అక్కడే వదిలేస్తున్నారు. కొందరు ఆకతాయిలు ఖాళీ మద్యం సీసాలను చితక్కొట్టి విసేరేస్తున్నారు. చితికిన గాజు పెంకులు ఇసుకలో కూరుకుపోయి ఉంటున్నాయి. బీచ్‌లకు వస్తున్న పర్యాటకులు ఆట పాటలతో సరదాగా గడుపుతున్న సమయంలో ఇసుకలో ఉన్న గాజుపెంకులు కాళ్లకు గుచ్చుకొని తీవ్రంగా గాయపడుతున్న సంఘటనలు అనేకం. తిక్కవానిపాలెం తీరంలో ఎన్టీపీసీ జెట్టీ వద్ద ఏర్పాటు చేసిన సీ వాటర్ పార్కును ఆకతాయిలు పాల్పడుతున్న ఆసాంఘిక కార్యకలాపాల వల్ల పార్కు లోపటికి సందర్శకులను అనుమతించడం మానేశారు. ఇక్కడి మినీ పార్కును ఆకతాయిలు ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్నారు. పార్కులో నిర్మించిన గొడుగుల కింద కూర్చుని మద్యం సేవిస్తున్నారు. ఆ తరువాత ఎక్కడ పడితే అక్కడ మద్యం సీసాలు, గాజు పెంకులు పడేస్తూ వెళ్లిపోతున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన చెత్తకుండీని కూడా ఉపయోగించడం లేదు. ఆదివారమైతే అధిక సంఖ్యలో యువకులు తరలివచ్చి ఇక్కడి సరుగుడు, జీడి మామిడి తోటల్లో జూదం ఆడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తీరంలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్లను ఎత్తివేయడంతో ఆకతాయిలకు ఆగడాలకు అడ్డూ అదుపులేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బీఎస్ఎఫ్లో ఇంటిదొంగల కలకలం
న్యూఢిల్లీ : దేశ భద్రతలో కీలక పాత్ర పోషించే సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో ఇంటిదొంగల వ్యవహారం కలకలం రేపుతున్నది. శత్రుదేశాల ఏజెంట్లు, అసాంఘిక శక్తులతో కుమ్మక్కైన కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల వెలుగుచూడటంతో అధికారులు అంతర్గత నిఘాను పటిష్టం చేశారు. విలాసవంమైన జీవనం గడుపుతూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై కన్నేసి ఉంచాలని, వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఈమేరకు 2017 సంవత్సరానికి గానూ అనుమానితుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇటీవలే బంగ్లాదేశ్ సరిహద్దులో ఉగ్రవాదులకు సహకరిస్తోన్న బీఎస్ఎఫ్ కమాండింగ్ అధికారిని సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అతని వద్ద నుంచి 45 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2.5 లక్షల సిబ్బంది కల్గిన బీఎస్ఎఫ్ ప్రతిష్టను కాపాడటం కోసమే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతియడానికి కాదని స్పష్టం చేశారు. -
అసాంఘిక చర్యలకు ఆశ్రయం
సాక్షి, రాజమహేంద్రవరం : దేవతామూర్తులు కొలువైన పుష్కరఘాట్ పక్కన ఉన్న ‘ది ఆశ్రయ రెసిడెన్సీ’ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిలుస్తోంది. పేకాట, వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఈ లాడ్జి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థది కావడంతో లీజుదారుడైన నిర్వాహకుడు జూపూడి శ్రీనివాసరావు సమగ్ర వివరాలు తీసుకోకుండానే అడిగిన వారికి అడిగినట్లు గదులు ఇస్తున్నారు. ఈ నెల 6వ తేదీన ఓ విశ్రాంత పంచాయతీ కార్యదర్శి మూడో పట్టణ పోలీస్ స్టేష¯ŒSలో తాము ఆశ్రయ లాడ్జిలో ఉండగా పోలీసులమంటూ తమ వద్ద బంగారం తీసుకెళ్లారంటూ ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు మరో యువకుడు పురాతన నాణేలా సేకరణ వ్యాపారంలో భాగస్వాములు. వీరిరువురు తరచూ మద్యం సేవించి, మహిళలతో గడుపుతుంటారు. ఈ క్రమంలో యువకుడు ఆర్థికంగా నష్టపోయాడు. ఆ విశ్రాంత అధికారి వద్ద నుంచి ఎలాగైనా డబ్బు గుంజాలని విలేకరిగా చెప్పుకుంటున్న తన స్నేహితుడికి ఈ విషయం చెప్పాడు. దీంతో అనుకున్న ప్రకారం ఎప్పటిలాగే ఆ యువకుడు, విశ్రాంత అధికారి ఓ మహిళతో ‘ది ఆశ్రయ రెసిడెన్సీ’కి వెళ్లారు. వారు ఆ గదిలో ఉండగా యువకుడి స్నేహితుడు తాను పోలీసులమంటూ ఆ వృద్ధుడి వద్ద రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసి కేసు పెడితే ప్రభుత్వ పెన్ష¯ŒS ఆగిపోతుందంటూ బెదిరించడంతో ఆయన తన వద్ద ఉన్న 32 గ్రాముల బంగారు ఆభరణాలు ఇచ్చేశాడు. జూపూడి శ్రీనివాసరావుపై కేసు నమోదు... ఈ నెల 13న ఆ లాడ్జిలోనే పేకాట ఆడుతూ నగరానికి చెందిన పదిమంది దొరికారు. వీరందరూ ఒకే గదిని తీసుకున్నారు. సాధారణంగా ఒక గదిలో ఇద్దరు మాత్రమే ఉండగలరు. అలాంటిది పది మంది ఒక గది కావాలన్నప్పుడు లాడ్జి నిర్వాహకుడు తిరస్కరించాలి. కానీ ఇక్కడ యథేచ్ఛగా ఇచ్చేశారు. చిరునామా, గుర్తింపు కార్డులు కూడా తీసుకోలేదు. తీసుకుని ఉంటే వారు స్థానికులని గుర్తించేవారు. వారు పేకాట ఆడుతుండగా ఎస్పీ బి.రాజకుమారి ఇచ్చిన సమాచారం, ఆదేశాల మేరకు ఏజీఎస్ పోలీసులు ఆ లాడ్జిపై దాడి చేశారు. జూదగాళ్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అదే కేసులో నిర్వాహకుడు జూపూడి శ్రీనివాసరావును ఏ7గా పేర్కొన్నారు. డబ్బులు వస్తుండడం చూస్తున్నాడు తప్ప అదనపు సమాచారం ఏదీ అడగకపోవడంతో ‘ది ఆశ్రయ రెసిడెన్సీ’ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పైగా అది నగరపాలక సంస్థది కావడంతో ఎవరికీ జవాబుదారీతనంగా ఉండనక్కరలేకపోవడంతో నిర్వాహకులు సైతం ఏమీ పట్టించుకోకుండానే గదులు ఇచ్చేస్తున్నారు. కాగా ఈ రెసిడెన్సీలో 18 గదులుండగా మొత్తం ఏసీ గదులే. గది ఒక్కరోజు ఫీజు రూ.1500. దీనిని నిర్మించిన నగరపాలక సంస్థ జూపూడి శ్రీనివాసరావుకి లీజుకు ఇచ్చింది. దీనిపై 2012 నుంచి నగరపాలక సంస్థకు లీజుదారుకు మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. -
అంగన్వాడీ కేంద్రం వద్ద అసాంఘిక పనులు
టేకులపల్లి: చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించి, పాఠాలు బోధించే అంగన్వాడీ కేంద్రం వద్ద మద్యం బాబులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం సింగ్యాతండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంగన్వాడీ కేంద్రానికి చుట్టూ ప్రహరీ లేకపోవడంతో చీకటి పడితే తాగుబోతులు అక్కడకు చేరి మద్యం సేవించడం, ఇతరత్రా పనులు నిర్వహిస్తున్నారు. వెంటనే వీటికి చెక్‌పెట్టి అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.