సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగరంలో భూతల స్వర్గాన్ని తలపించేలా స్పా, సెలూన్లు, వెల్‌నెస్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లు నిర్వహిస్తున్నారు. బయటకు వేరే కలరింగ్ ఉన్నా లోపల మాత్రం పాడు పనులను ప్రోత్సహిస్తున్నారు. మసాజ్ సెంటర్ల ముసుగులో హైటెక్ వ్యభిచార దందా కొనసాగుతోంది. వీటి మాయలో పడి ఎంతోమంది జేబులకు చిల్లులు పడుతుండగా ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి.
వీటి నియంత్రణకు పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె. రాణా నేతృత్వంలో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి విటులను అరెస్ట్‌చేసి కొందరికి ఈ మురికికూపం నుంచి విమక్తి కల్పించారు. మొదటి దశలో నగరంలో గుర్తించిన 190 స్పాలపై 18 ప్రత్యేక పోలీస్ బృందాలతో దాడులు చేశారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న స్పాలను సీజ్ చేసి నిర్వాకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇందులో కొంతమంది విటులను అదుపులోకి తీసుకొని 28 మంది యువతులకు మురికి కూపం నుంచి విముక్తి కల్పించారు. వారిని వారి సొంత గ్రామాలకు పంపారు.
అనధికారికంగా నిర్వహణ..
గతంలో చేసిన తనిఖీల్లో చాలా వాటికి ఎలాంటి అనుమతులు లేకుండానే అనధికారికంగా నిర్వహిస్తున్నారు. స్పా, మసాజ్‌ల పేరుతో దోపిడీ చేస్తున్నట్లు గుర్తించారు. ఏకంగా కొన్ని స్పాలలో అసాంఘిక, అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నట్లు, అందుకు తగిన ఆధారాలు సైతం లభించడంతో పోలీసులు అటువంటి వాటిపై ఉక్కు పాదం మోపారు. రెండో దశలో పోలీసు నిఘా ఉన్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా ఓ హైటెక్ స్పా కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. దీనిపై పోలీసులు పక్కా స్కెచ్‌తో బందరురోడ్డులో స్టింగ్ అపరేషన్ చేసి అక్కడ క్రాస్ మసాజ్ జరగుతున్నట్లు నిర్ధారించుకొన్నాక, రెవెన్యూ, లోకల్ పోలీసులు, మహిళా సంరక్షణ కార్యదర్శులతో కలిసి దాడి చేసి స్పాను సీజ్ చేశారు. స్పా నిర్వాహకుడిని అరెస్ట్ చేసి, అక్కడ పట్టుబడిన యువతులను హోంకు తరలించారు. సెక్షన్ 18 కింద స్పాను ఖాళీ చేయించేలా అధికారులు హౌస్ ఓనర్‌కు నోటీసులు జారీ చేశారు. ఇవే కాకుండా గతంలో నగరంలో స్పాలకు వెళ్లిన అమాయకుల ఫొటోలను తీసి, బెదిరించి డబ్బులు గుంజుతున్న ముఠాలను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు.
పాత భవనం.. లోపల భూతల స్వర్గం..
పైకి చూసేందుకు మూడు అంతస్తుల పాత భవనం అయినా లోపల మాత్రం భూతల స్వర్గాన్ని తలదన్నేలా వసతులున్నాయి. అధునాతన బాత్ సౌక్యరం కలిగి ఉంది. హైటెక్ సెక్యూరిటీ కార్డు సిస్టం ద్వారానే లోనికి ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. మొదట స్పాలోకి వెళ్లగానే అందులో జరిగే కార్యకలాపాలు చూసుకొనేందుకు వీలుగా కస్టమర్లతో మాట్లాడేందుకు మేనేజరు, రిసెప్షనిస్ట్ ఉంటారు. వారు కస్టమర్‌కు వారి వద్ద ఉన్న వివిధ రకాల సర్వీసులను వివరిస్తారు.
ఈ విధంగా కస్టమర్ తనకు కావాల్సిన సర్వీసును ఎంపిక చేసుకున్న తరువాత, వారు ఎంపిక చేసుకున్న సర్వీసుకు అనుగుణంగా రూమ్‌లకు రూ.3,700 నుంచి రూ.13,000 వరకు వసూలు చేస్తున్నారు. కస్టమర్‌కు కావాల్సిన సర్వీస్‌ను ఎంపిక చేసుకున్న తరువాత మేనేజర్ అక్కడ తన వద్ద ఉన్న ఉద్యోగిని, కస్టమర్‌తో రూమ్ లోపలికి పంపిస్తారు. రూమ్ లోపల కస్టమర్‌కు కావాల్సిన సరీ్వస్ చేసే సమయంలో కస్టమర్లను మాటల్లో దించి తన హావభావాలు, డ్రెస్ కోడ్‌తో రెచ్చగొట్టేలా చేస్తారు. స్పా ఉద్యోగి కస్టమర్‌కు వివిధ రకాలైన లైంగిక సరీ్వస్‌లను చెప్పి, వాటి ఖర్చుల కనుగుణంగా అదనంగా రూ. నాలుగు వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలన్నీ పోలీసు స్టింగ్ అపరేషన్‌లో వెలుగు చూసినట్లు సమాచారం.
కఠిన చర్యలు తీసుకొంటాం
నగరంలో స్పాలకు ఎలాంటి అనుమతులు లేవు. గత ఏడాది అక్టోబర్ నుంచి స్పాలపై నిఘా పెట్టి దాడులు చేయించాం. అందులో 15 స్పాలలో అసాంఘిక, అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశాం. కొంత మంది అనుమతులు తీసుకొన్నామని చెబుతున్నా వాటిని అతిక్రమించి చేయకూడని పనులు చేస్తున్నారు. అటువంటి వాటిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొంటాం. నిబంధనల విరుద్దంగా కార్యకలాపాలు చేస్తున్న స్పాలపై దాడులు చేసి సీజ్ చేసి నిర్వాహకులను అరెస్టు చేశాం.
– టి.కె. రాణా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్.
Comments
Please login to add a commentAdd a comment