భారీ కోతకు గురైన రేపల్లె ప్రధాన మురుగు కాల్వ కట్ట
సాక్షి, నగరం(గుంటూరు) : గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకుల భూదాహం రైతుల పాలిట శాపంగా మారింది. మండలంలోని టీడీపీ నేతల అక్రమాలకు రేపల్లె ప్రధాన మురుగు కాల్వ కట్ట (ఆర్‌ఎం డ్రైయిన్), న్యూకోర్స్ కాల్వ కట్టలు బక్కచిక్కిపోయాయి.వీటిని అభివృద్ధి పరిచిన సంవత్సరానికే కోతకు గురయ్యాంటే కాల్వ కట్టలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాల్వ కట్టల మట్టిని మట్టానికి కల్లా టీడీపీ నాయకులు దోచుకోవడంతో చిన్న పాటి వర్షాలకే అవి భారీగా కోసుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నగరం నుంచి అద్దంకివారిపాలెం వెళ్లే దారిలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో 10 నుంచి 15 చోట్ల కాల్వకట్ట భారీగా కోసుకుపోయింది. ఈ విషయంపై అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓగ్ని తుఫాన్ సమయంలో రైతులకు అపారనష్టం:
2006 సంవత్సరంలో ఓగ్ని తుఫాన్ సమయంలో నగరంలో కాల్వ కట్టకు భారీగా గండి పడింది. వేలాది ఎకరాల్లోని పంట ముంపుకు గురై, కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఆ సమయంలో గండి పూడ్చేందుకు లక్షలాది రూపాయల్ని వెచ్చించినా అప్పటికే రైతులకు అపారనష్టం వాటిల్లింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటి ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణారావు కాల్వ కట్టల అభివృద్ధికి నిధుల కేటాయించాలని కోరగా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కాల్వకట్టల అభివృద్ధికి సుమారుగా రూ.12 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో విడతల వారీగా కాల్వ కట్టలను అభివృద్ధి పరిచారు.
తర్వాత 2012లో రూ.9.5 కోట్లతో అద్దంకివారిపాలెం నుంచి ఈదుపల్లి వరకు సుమారు 6 కి.మీ మేర కాల్వ కట్టల అభివృద్ధి పనులు ప్రారంభించారు. రెండేళ్ల పాటు కాల్వ కట్టల అభివృద్ధి పనులు నిర్వహించారు. ఈ సమయంలో వచ్చిన మట్టిని కాల్వ కట్టలపై గుట్టలుగా పోశారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతల కన్ను మట్టి గుట్టలపై పడింది. దీంతో నిబంధనలను తుంగలోకి తొక్కి అడ్డగోలుగా మట్టిని అమ్ముకుని జేబులు నింపుకున్నారు. కనీసం కట్ట ఎత్తు 10 అడుగులపై ఉంచాల్సిన మట్టిని మట్టానికి కల్లా తీసేయడంతో కాల్వ కట్టలు బక్కచిక్కిపోయాయి. ఈ సమయంలో రైతులు అభ్యంతరాలు చెప్పినా అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా కోట్లాది రూపాయల మట్టిని అమ్ముకుని జేబులు నింపుకున్నారు. దీంతో కాల్వ కట్టల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
కాల్వ కట్టల మరమ్మత్తుల
పేరుతో నిధుల దోపిడీ..
కాల్వ కట్టల మరమ్మత్తు నిధులను టీడీపీ నేతలు దోపిడీ చేశారనే వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. 2016 సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు కారంకివారిపాలెం సమీపంలో మురుగుతూముల వద్ద కాల్వ కట్టకు గండి పడింది. ఆ సమయంలో నీటి ఉదృతి అంతగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం చోటుచేసుకోలేదు. ఈ సమయంలో కట్టల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ నుంచి సుమారుగా 10 లక్షల నిధులు కేటాయించారు. ఈ నిధులను టీడీపీ నేతలు దోపిడీ చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. మరమ్మత్తు పనులను తూతూ మంత్రంగా నిర్వహించి, నిధులను స్వాహా చేశారని పలువురు బహిరంగంగా వాఖ్యానిస్తున్నారు. మురుగుతూముల వద్ద కల్వర్టులు నిర్మించకుండా కట్టలు మాత్రం పూడ్చారు. అప్పుడు పనుల్లో నాణ్యత కొరవడుతుందని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వ కట్టలకు గండ్లు పడకముందే వాటిని పటిష్టం చేయాలని రైతులు కోరుతున్నారు.
చిన్నపాటి వర్షానికే గండి పడుతోంది..
రేపల్లె ప్రధాన మురుగు కాల్వ కట్టలు బలహీనంగా ఉండటం వల్ల చిన్నపాటి వర్షాలకే వాటికి గండి పడుతున్నాయి. కాల్వకు గండి పడటం వల్ల పంట పొలాలు ముంపుకు గురై అపార నష్టం వాటిల్లుతుంది. రైతుల బాధల్ని అర్థం చేసుకుని కాల్వ కట్టలను అభివృద్ధి పరచాలి
– కారంకి రాం బాబు, రైతు
కాల్వ కట్టల ఎత్తు పెంచాలి
కాల్వ కట్టల మట్టిని తరలించడం వల్ల కట్టలు బలహీనమయ్యాయి. కాల్వ కట్టలు రహదారి ఎత్తులో ఉండటం వల్ల వర్షపు నీటికి కట్టలు కోసుకుపోతున్నాయి. కట్టల ఎత్తు పెంచితే కోతకు గురికాకుండా ఉంటాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వ కట్టలను పటిష్ట పరచాలి. లేకపోతే పంటలు ముంపుకు గురికాక తప్పదు.
– ఎం నాగరాజు, రైతు
Comments
Please login to add a commentAdd a comment