నెల్లూరులోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం
జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి హద్దే లేకుండా పోయింది. చేయి తడిపితే చాలు నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినందుకు సబ్‌రిజిస్ట్రార్లు భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నారు. గత టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతల సహకారంతో అక్రమ రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగినట్లు తెలుస్తోంది. ఒక టీడీపీ ఎమ్మెల్సీ ప్రోద్బలంతో రూ.10 కోట్ల విలువజేసే భూమిపై న్యాయస్థానంలో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం వెనుక రూ.కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి.
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని కోవూరు మేజర్ పంచాయతీ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 295లో 3.30 ఎకరాలు భూమి ఉంది. ఆ గ్రామంలో అగర్వాల్ నారాయణదాసుకు సంబంధించిన ఆస్తి ఉంది. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు వారసులుగా ఉన్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న ఆ భూమి ప్రస్తుతం మార్కెట్‌ధర రూ.10 కోట్లుగా ఉంది. ఈ భూమిపై స్థానిక టీడీపీ నేత కన్ను పడింది. ఎలాగైనా ఆ భూమిని కారుచౌకగా కొట్టేయాలని పథకం వేసిన టీడీపీ నేత అగర్వాల్ నారాయణ దాసుకు చెందిన ఓ కుమార్తె పద్మాబాయ్ ఆరుగురు పిల్లలను వారసులుగా చూపించి ఆ భూమిని 2010లో జీపీ (జనరల్ పవరాఫ్ పట్టా) కమ్ సేల్ అగ్రిమెంట్ చేయించుకున్నాడు.
కానీ ఆ భూమికి ఇంకా వారసులు చాలా మంది ఉన్పప్పటికీ ఒక కుమార్తె పిల్లల చేత అక్రమంగా జీపీ చేయించుకుని భూమిని సొంతం చేసుకునేలా పథకం వేశారు. ఆ భూమిని ఇతరులు కొనుగోలు చేయకుండా అప్పటి జిల్లా తెలుగు యువత నేతతో కుమ్మక్కై న స్థానిక టీడీపీ నేత మాస్టర్‌ప్లాన్ వేసి సేల్ అగ్రిమెంట్ చేశారు. ఆ ఇద్దరు మధ్య వివాదం ఉన్నట్లు సృష్టించి జిల్లా జడ్జి కోర్టులో ఇంజక్షన్ అర్డర్ తెచ్చారు. అయితే వైఎస్సార్ జిల్లాకు చెందిన ఆర్.శేఖర్‌బాబు అలియాస్ యల్లారెడ్డి కూడా పద్మాబాయ్ అక్క సుందరాబాయ్ పిల్లల చేత ఆ భూమిలో సగభాగం 1.67 సెంట్లు భూమిని సేల్ డీడ్‌ను 2013లో చేయించుకున్నాడు. దీంతో వారి మధ్య భూ వివాదం తలెత్తింది. న్యాయస్థానంలో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న ఆ భూమిని నిషేధిత జాబితాలో ఉంచాల్సిన రిజిస్ట్రేషన్ శాఖ కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టారు.
న్యాయస్థానం ఉత్తర్వులున్నా..
కోవూరుకు చెందిన 295 సర్వే నంబర్‌పై జిల్లా ఐదో జిల్లా జడ్జి కోర్టులో ఆ భూమిని ఎవరూ క్రయ, విక్రయాలు చేయకూడదని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కానీ 2012 డిసెంబర్ 26వ తేదీన అప్పటి కోవూరు సబ్‌రిజిస్ట్రార్ కె.శోభమ్మ 30 అంకణాలను డాక్యుమెంట్ నంబరు 2327–2012 రిజిస్ట్రేషన్ చేసింది. అప్పటికే ఆ భూమిపై న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నాయని ఆమె దృష్టికి తీసుకెళ్లినా ఆ సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో నమోదు చేయకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసింది. మరో ఏడాది పాటు 2013 డిసెంబర్ వరకు కోర్టు ఉత్తర్వులు ఉన్న ఆ సర్వే నంబరును నిషేధిత జాబితాలో చేర్చకుండా కావాలనే జాప్యం చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరలేపారు. ఆపై అదే భూమిని నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నాగేశ్వరరావు సబ్‌రిజిస్ట్రార్ కూడా 4159–2013, 4409–2013, 4410–2013 డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేశారు.
ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే జీïïపీఏ కమ్ సేల్ చేసిన వ్యక్తి అగర్వాల్ రామ్ ప్యారీ అనే వ్యక్తి మరణించాడు. జీపీఏ చేసిన వ్యక్తి చనిపోతే జీపీ కమ్ సేల్ అగ్రిమెంట్ ఆటోమేటిక్‌గా రద్దు అయిపోయింది. కానీ ఇవేమీ పట్టించుకోని సబ్ రిజిస్ట్రార్ మాత్రం భారీగా ముడుపులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేశాడు. అలాగే అదే సర్వే నంబరును అల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్ సింహాద్రినాయుడు డాక్యుమెంట్ నంబర్లు 823–2013, 824–2013, 825–2013, అలాగే నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నంబర్లు 822–2014, 823–2014, 1540–2014, 3306–2014, 3854–2014, 3855–2014గా రిజిస్ట్రేషన్ చేశారు. 2013లో నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్న నాగేశ్వరరావు 2015లో కోవూరు సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో కూడా డాక్యుమెంట్ నంబర్లు 361–2015, 362–2015, 458–2015,1661–2015, 1686–2015గా మరోసారి రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే 2014లో స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్న నందకిశోర్ కూడా అదే సర్వే నంబర్‌ను డాక్యుమెంట్ నంబర్లు 4202–2014, 4203–2014గా రిజిస్ట్రేషన్ చేశారు.
టీడీపీ హయాంలో నివేదకలు తొక్కిపెట్టి..
నిషేధిత జాబితాలో ఉన్న భూమిని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి భారీగా లబ్ధిపొందిన ఆ ఐదుగురు సబ్‌రిజిస్ట్రార్లపై శేఖర్‌బాబు అలియాస్ ఎల్లారెడ్ది ఫిర్యాదు మేరకు టీడీపీ హయాంలో పలుమార్లు విచారణ చేపట్టి నివేదిక తొక్కిపెట్టారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్సీ అండతో నివేదికలను తొక్కి పెట్టి చర్యలు తీసుకోలేకపోయారు. ఈ అవినీతి బాగోతం వెనుక గతంలో రిజిస్ట్రేషన్‌శాఖ జిల్లా డీఐజీగా పనిచేసిన అధికారితోపాటు అప్పటి నెల్లూరు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ హస్తం ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. దీంతో గత ఐదేళ్ల పాటు కేవలం విచారణ పేరుతో కాలయాపన చేశారు.
న్యాయం కోసం లోకాయుక్తకు ఫిర్యాదు
టీడీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు ఎల్లారెడ్డి న్యాయం కోసం లోకాయుక్తను ఆశ్రయించాడు. గతంలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ మునిశంకరయ్య అక్రమ రిజిస్ట్రేషన్లపై వాస్తవ నివేదిక ఇచ్చినా కూడా చర్యలు తీసుకోలేదని, గత ఐదేళ్లగా విచారణ పేరుతో కాలయాపన చేస్తూ అవినీతికి ఉన్నతాధికారులు కొమ్ముకాస్తున్నారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో లోకాయుక్త వాస్తవ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాకతో మరోసారి విచారణ
అవినీతి రహిత పాలనలో ముందుకెళ్తున్నా ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి అధికారులపై మరోసారి విచారణకు ఆదేశించారు. రెండు నెలలుగా విచారణ చేపట్టిన అధికారులు ఐదుగురు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసింది వాస్తవమే అన్నట్లు నిర్ధారించి నివేదిక తయారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment