Farmhouses
సాక్షి, రంగారెడ్డి: పగలు ప్రశాంతంగా ఉండే పల్లెలు చీకటైతే చాలు గానాబజానా.. డీజే చప్పుళ్లతో హోరెత్తుతున్నాయి. ఫాంహౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. వేడుకల పేరుతో మద్యం, హుక్కా, గంజాయి మత్తులో తూలుతున్నా పట్టించుకునేవారు లేకుండాపోయారు. నగరాల్లోనే కనిపించే పాడు కల్చర్ ఇప్పుడు పల్లెలకూ పాకింది. పేకాట, కోళ్ల పందేలు, రెయిన్ డాన్స్, ముజ్రా పార్టీలకు సైతం ఫాంహౌస్‌లు వేదికలవుతున్నాయి. పా ర్టీల పేరుతో నిర్వహించే ఈవెంట్లతో యువత పెడ దారి పడుతోంది. నగరానికి అతి చేరువలో ఉన్న శివారు ప్రాతాల్లో వేల సంఖ్యలో ఫాంహౌస్‌లు ఉ న్నాయి. నిత్యం ఏదో ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నా రు. కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ కూడా వినియోగిస్తున్నారు. మొయినాబాద్, శంకర్‌పల్లి, చేవెళ్ల, శంషాబాద్, కొత్తూరు, షాద్‌నగర్, మహేశ్వరం, కందుకూ రు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లోని ఫాంహౌస్‌లలో ఈ వ్యవహారం ఎక్కువగా నడుస్తోంది.
పోకిరీలతో ఇబ్బందులు..
సాధారణంగా గ్రామీణ ప్రాంతాలన్నీ ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాయి. ఇక్కడ మాత్రం ఫాంహౌస్‌లు గ్రామాలకు అతి చేరువలో ఉండడంతో గానా బజానాల్లో మునిగి తేలుతున్నాయి. పోకిరీలు మద్యం మత్తులో గ్రామాల్లోకి వచ్చి గొడవలకు దిగుతున్నారు. డీజే సౌండ్స్, గొడవలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల మొయినాబాద్ మండలం చిన్నషాపూర్‌లోని ఓ ఫాంహౌస్‌లోకి వచ్చిన పోకిరీలు అర్థరాత్రి గ్రామంలో సంచరిస్తుండగా గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో వారిపై దాడికి తెగబడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వారం రోజులపాటు స్టేషన్ చుట్టూ తిరిగితే అప్పుడు కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి.
అనుమతులు లేకుండా..
నగరానికి చేరువలో ఫాంహౌస్‌లు నిర్మించి వాటిని ఆన్‌లైన్ ద్వారా అద్దెకిస్తున్నారు. ఏదైనా వేడుక చేసుకోవాలనుకున్నవారు ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకుంటారు. మద్యం వినియోగిస్తే ఎక్సైజ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అవేవీ పట్టించుకోకుండా మద్యం వినియోగం కొనసాగుతోంది. దీనికి తోడు హుక్కా, గంజాయిని సైతం వినియోగిస్తున్నారు.మూడు నెలల క్రితం ఓ ఫాంహౌస్‌లో జరిగిన జన్మదిన వేడుకల్లో గంజాయి వినియోగిస్తుండగా ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. ఇటీవల షాద్‌నగర్, కొత్తూరు ప్రాంతాల్లోనూ గంజాయి పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ బయటపడుతున్నా ఎక్సైజ్, స్థానిక పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై ఆరోపణలు వస్తున్నాయి.
అనుమతి తీసుకోవాలి..
ఫాంహౌస్‌లలో చిన్నచిన్న వేడుకలు, పార్టీలు జరిగితే యజమానులు ఎలాంటి అనుమతి తీసుకోవడం లేదు. పార్టీలు, ఈవెంట్లు జరిగినప్పుడు మద్యం వినియోగిస్తే ఎక్సైజ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వేడుకల్లో మాదకద్రవ్యాలు వినియోగిస్తే చర్యలు తప్పవు.
– రాజు, ఇన్‌స్పెక్టర్, మొయినాబాద్
Comments
Please login to add a commentAdd a comment