పోలీసు స్టేషన్ వద్ద మహిళ హల్‌చల్
రాజమహేంద్రవరం క్రైం : ఓ మహిళ రాజమహేంద్రవరం వన్‌టౌన్ పోలీసు స్టేషన్ వద్ద హల్‌చల్ చేసింది. ఆమెకు మతిస్తిమితం లేదని, పొంతన లేకుండా మాట్లాడుతోందంటూ పోలీసులు ఆమెను వారించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మెయిన్ రోడ్డు కంచుమర్తివారి వీధికి చెందిన కలశాల నళిని రాణి తన ఇంటిని ఓ ఫర్నిచర్ షాపు వారికి అద్దెకు ఇచ్చింది. వారు సకాలంలో ఖాళీ చేయలేదు. దీంతో ఆమె ఈ నెల 5న వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన వన్‌టౌన్ పోలీసులు, ఆ షాపు వారిని గురువారం ఖాళీ చేయించారు.
ఆమెకు రావలసిన రూ.75 వేల బకాయి కూడా ఇప్పించారు. తనకు న్యాయం జరగలేదని, తనను పోలీసులు మోసం చేశారంటూ శుక్రవారం నళిని రాణి వన్‌టౌన్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారని, ముగ్గురికీ వివాహాలు కాకపోవడంతో వీరు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. పొంతన లేని మాటలతో పోలీసు స్టేషన్ వద్ద హంగామా చేయడంతో, మహిళా పోలీసులు ఆమెను వారించి, కొద్దిసేపు పోలీసు స్టేషన్‌లో కూర్చోబెట్టారు.