మాట్లాడుతున్న తమ్మినేని
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని క్యాబినెట్ నుంచి తొలగించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. సినీ నిర్మాత నట్టికుమార్ అచ్చెన్నాయుడు గురించి చెబుతున్న విషయాలు గగుర్పాటు కలిగిస్తున్నాయని అన్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని నట్టి కుమార్ సవాల్ విసరడం చూస్తుంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. అచ్చెన్నపై ఇన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బాధ్యత కలిగిన మంత్రిగా ఆయన స్పందించాలని కోరారు.
నట్టి కుమార్ జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డి వద్దకు వెళ్లి సాయం చేయమని కోరినా తన వల్ల కాదని, ఏం చేయలేనని ఎస్పీయే చేతులెత్తేయడం చూస్తుంటే ఆయనపై ఎంత ఒత్తిడి తెచ్చారో అర్థమవుతోందన్నారు. మంత్రి అచ్చెన్నపై ఆరోపణలు వస్తుంటే ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం, డీజీపీకి, హోంమంత్రికి ఎందుకు స్టేట్‌మెంట్ విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. కోనె ఈశ్వరరావును హత్య చేశారని, ఎన్నికల సమయంలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారని, ఇటీవలే ఒక మహిళా ఉద్యోగిపై వేధింపులు తదితర కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో వాస్తవాలు వెలుగు చూసేందుకు ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పొందల విశ్వేశ్వరరావు తదితరులు ఉన్నారు.