సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఆటో డ్రైవర్ల సంబంధించి సమాధానం చెప్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన పేర్ని నాని.. టీడీపీ సభ్యులు సభామర్యాదలు పాటించాలని హితవు పలికారు. టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సభలో హుందాగా వ్యవహరించాలన్నారు. అచ్చెన్నాయుడు సభా సంప్రాదాయాలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయడు బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని.. స్పీకర్‌పై అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయం వృథా చేయవద్దని స్పీకర్ తమ్మినేని సీతారాం హితవు పలికారు. సభాస్థానానికి నిబంధనలు పెట్టడం సరికాదని స్పీకర్ పేర్కొన్నారు. అయితే స్పీకర్ వారించినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. టీడీపీ సభ్యుల వైఖరిని శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఖండించారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం మంచి చేస్తామంటే టీడీపీ ఓర్వలేకపోతుందని మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను సమర్ధించడం లేదు : చంద్రబాబు
ఈ వ్యవహారం ముగిసిన తర్వాత కొద్దిసేపటికే టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయడు మరోసారి సభలో గందగోళం సృష్టించేందుకు యత్నించాడు. ‘మీరు రాసిస్తే నేను చదువుతానంటూ’ అచ్చెన్నాయుడు స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు తీరుపై స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారా అని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడును స్పీకర్ సూటిగా ప్రశ్నించారు. అయితే వాటిని తాను సమర్ధించడం లేదని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా సభలో సబ్జెక్ట్ పరంగా వెళ్లాలని స్పీకర్ సూచించారు.
లేకపోతే పయ్యావులు రాజీనామా చేస్తారా? : చెవిరెడ్డి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు స్పీకర్ స్థానాన్ని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని తెలిపారు. చంద్రబాబుకు స్పీకర్‌ను ప్రశ్నించే హక్కు ఉంటుందా అని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే సభా నాయకుడిని అడిగితే బాగుంటుందని సూచించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను గమనించాలని స్పీకర్‌ను కోరారు. గత సభలో టీడీపీ సభ్యులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని తెలిపారు. అంతేకాకుండా తమ సభ్యులను కారణం లేకుండా సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. గతంలో సభ ఆర్డర్‌లో లేనప్పుడు కూడా స్పీకర్ సభను నడిపారని అన్నారు. అప్పుడు సభ నడపలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తా.. లేదంటే టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment