
మ్యాప్..మాయం
- రెండు జిల్లాల్లో 30వ నంబరు జాతీయ రహదారి గల్లంతు
- కొత్తగూడెం–మణుగూరు రైల్వే లైన్ కూడా..
- భద్రాద్రి రాములోరి క్షేత్రమెక్కడ...
- కొత్త జిల్లాల మ్యాప్‌లు వెబ్‌సైట్‌లోకి పెట్టిన సర్కారు
- గార్ల, బయ్యారం మండలాలు మహబూబాబాద్ జిల్లాలో
- దక్షిణ అయోధ్య భద్రాచలం మాయం..
- కొత్తగూడెం– మణుగూరు రైల్వే లైను కట్...
- మహబూబాబాద్ మ్యాప్‌లో గార్ల, బయ్యారం..
సాక్షిప్రతినిధి,ఖమ్మం: జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల మ్యాప్‌లలో ముఖ్యమైన వాటిని విస్మరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 30వ నంబరు జాతీయ రహదారిని రెండు జిల్లాలోనూ చూపించలేదు. కొత్తగూడెం జిల్లాలో రైల్వేలైన్ పాక్షికంగా చూపించగా, దక్షిణ అయోధ్యగా ప్రిసిద్ధిగాంచిన భద్రాచలం పట్టణాన్నే విస్మరించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం ప్రభుత్వం వినతులు స్వీకరిస్తూనే... కొత్త జిల్లాల మ్యాప్‌లను విడుదల చేసింది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలుగా పేర్కొంటూ మ్యాప్‌లు వెబ్‌సైట్‌లో పెట్టారు. ప్రధానంగా స్టార్ గుర్తులో జిల్లా హెడ్‌క్వార్టర్, పట్టాల గుర్తులో రైల్వేలైన్, రెడ్ మార్క్‌లో నేషనల్ హైవే, వైలెట్ కలర్‌లో స్టేట్‌హైవే, లైట్ బ్లాక్‌లో మండల సరిహద్దులు, పసుపు కలర్‌లో నియోజకవర్గాల సరిహద్దులు, నీలి రంగులో నదులను సూచికలో చూపించారు. అయితే విజయవాడ–జగదల్‌పూర్ జాతీయరహదారిని రెండు జిల్లాల్లోనూ చూపించలేదు. కొత్తగా ఛత్తీస్‌గఢ్‌లోని భోపాలపట్నం నుంచి హైదరాబాద్ వరకు నిర్మించిన 163 జాతీయ రహదారి.. కొత్తగూడెం జిల్లాలోని వెంకటాపురం మండలంలోని గ్రామాల నుంచి వాజేడు మీదుగా వెళ్తుంది. దీనిని మాత్రం మ్యాప్‌లో చూపించారు.
భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది. అయితే ఈ పట్టణాన్ని కొత్తగూడెం జిల్లా మ్యాప్‌లో విస్మరించారు. ఎస్టీ నియోజకవర్గంగా భద్రాచలంను చూపించినప్పటికీ...పట్టణాన్ని మాత్రం చూపించలేదు. దీంతో మ్యాప్ చూసిన పట్టణవాసులు, జిల్లా ప్రజలు అవాక్కయ్యారు. భద్రాచలంలో ఐటీడీఏతోపాటు రెవెన్యూ డివిజన్ ఉంది. కొత్తగా పాల్వంచ రెవెన్యూ డివిజన్‌ను రద్దు చేసి నాలుగు మండలాలను భద్రాచలం డివిజన్‌లో కలిపారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన భద్రాచలంను మ్యాప్‌లో చూపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజుల క్రితం భద్రాచలంను జిల్లా చేయాలని కూడా ఇక్కడ ఆదివాసీలు ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్ర విభజనతో ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాల్లోని గ్రామాలు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి. అయితే ఆ తర్వాత ప్రభుత్వం అధికారికంగా ఖమ్మం జిల్లా మ్యాప్‌ను విడుదల చేయలేదు. ఇప్పుడు జిల్లాల విభజనతో కొత్త మ్యాప్‌లను విడుదల చేసింది. దీంట్లో బూర్గంపాడు మండలం నుంచి గోదావరి నది మీదుగా రాష్ట్ర రహదారిని చూపించారు. అలాగే గోదావరి నదిమీదుగా భద్రాచలం నియోజకవర్గ బౌండరీని చూపినప్పటికీ పట్టణాన్ని మాత్రం ఎక్కడా చూపలేదు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి కారేపల్లి మీదుగా మణుగూరు వరకు రైల్వే లైన్ ఉంది. ఇక్కడ నుంచి హైదరాబాద్‌కు సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్, మణుగూరు –ఖాజీపేట, కొత్తగూడెం–విజయవాడ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే కొత్తగూడెం జిల్లా మ్యాప్‌లో మాత్రం కొత్తగూడెం వరకు మాత్రమే రైల్వే లైన్ చూపించారు. కొత్తగూడెం నుంచి మణుగూరు వరకు రైల్వేలైన్‌ను చూపించలేదు. ఖమ్మం జిల్లాలో మాత్రం రైల్వేలైన్లు అన్నింటినీ చూపించారు.
ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం మండలాలు జిల్లా పునర్విభజనతో మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్లాయి. ఈ రెండు మండలాలను ఆ జిల్లా మ్యాప్‌లో చూపించారు. అలాగే ఇల్లెందు, టేకులపల్లిని కొత్తగూడెం జిల్లాలో.. కామేపల్లిని ఖమ్మం జిల్లా మ్యాప్‌లో చూపించారు.