అతిసారానికి అనూరులో ఒకరు మృతి
అనూరు(పెద్దాపురం) :
అతిసారం మహమ్మారి గ్రామంలో ఒకరిని బలిగొంది. గ్రామానికి చెందిన పైడిమళ్ల ముసలయ్య (65) కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అతిసారంతో ఈనెల ఐదవ తేదీన పెద్దాపురం ప్రభుత్వాస్పత్రిలో చేరిన ముసలయ్య పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారం పాటు చికిత్స పొందిన ముసలయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య గోయమ్మ, కుమారులు నానాజీ, ఏసు, కుమార్తె ఉన్నారు. ముసలయ్య కుటుంబ సభ్యుల రోదన అందరినీ కలచివేసింది.
మహమ్మారి మా నాన్న పొట్టన పెట్టుకుంది
డయేరియా అంటే అందరిలా తగ్గుతుందనుకున్నాం. కానీ కలుషిత నీరు ప్రాణం తీస్తుందనుకోలేదు.
–నానాజీ, ముసలయ్య కుమారుడు
అతిసారం కారణం ఇప్పటికీ అంతు చిక్కలేదు
గ్రామంలో డయేరియా కారణాలు ఇప్పటికీ అంతు చిక్కలేదు. వ్యాధి ప్రబలిన వెంటనే రోగులు తాగిన నీటికి పరీక్షలు నిర్వహించాం. అందులో ఏమీ లేదు. వారం రోజులుగా గ్రామంలో మంచినీటి సరఫరా నిలిపివేసి పెద్దాపురం నుంచి ట్యాంకర్ల ద్వారా గోదావరి నీటిని సరఫరా చేస్తున్నాం. అతిసారానికి ముసలయ్య మృతి చెందడం విచారకరం. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తాం.
–అరవిందకుమార్, సర్పంచ్