అన్ని సొసైటీల్లో ఏటీఎంలు ఏర్పాటు చేస్తాం
ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని
కంచికచర్ల :
జిల్లాలోని అన్ని కేడీసీసీ బ్యాంకులు, సొసైటీల్లో ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నామని ఆప్కాబ్ చైర్మన్, జిల్లా కేడీసీసీ బ్యాంకు అధ్యక్షుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక కేడీసీసీ బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన ఏటీఎం మిషన్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని బ్యాంకుల్లో 60 రోజుల్లో కంప్యూటీకరణ పూర్తి చేయటం జరుగుతుందని చెప్పారు. తాను కేడీసీసీ బ్యాంకు అధ్యక్షుడిగా పదవి చేపట్టే నాటికి రూ.730 కోట్లు డిపాజిట్‌లున్నాయని, ప్రస్తుతం రూ.1600 కోట్లకు పెరిగాయని తెలిపారు. నూటికి నూరుశాతం రుణాలు వసూలు చేసిన సొసైటీ కార్యదర్శులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ బండి జానికీరామయ్య, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నన్నపనేని నరసింహారావు, డీజీఎం ఎన్.రంగబాబు, బ్యాంకు వైస్ చైర్మన్ వి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.