’ఏవండోయ్ బావగారూ.. ఏంటీ మధ్య నల్లపూసై పోయారు. ఏ ఊరెళ్లారేంటి. ఈ వంకాయలు పట్టుకెళ్లండి.. మా చెల్లెమ్మకిచ్చి గుత్తొంకాయ్ కూరొండమనండి. ఔనూ.. మీవాడి చదువెలా సాగుతోంది. పొట్లకాయలు నవనవలాడుతున్నాయ్.. ఇవో రెండు వేస్తా. మా మేనకోడలు ఏం చేస్తోంది. చాలా రోజులైంది పాపను చూసి. బీరకాయలు బాగున్నాయ్.. కేజీ సరిపెడతా. ఏంటీ.. కాకరకాయలు తినట్లేదా. ఈ కాలం పిల్లలకి బొత్తిగా తిండిమీద అవగాహన లేదు. ఇలాగైతే ఆరోగ్యం ఏంకాను. సర్లెండి.. ఇంకేం ఇమ్మంటారు..’ కూరగాయల సంతలో ఎవరైనా ఈ తరహాలో మాట్లాడుతున్నారంటే.. అతడు కచ్చితంగా అత్తిలికి చెందిన వర్తకుడేనని ఇట్టే చెప్పేయొచ్చు. ఇలా గలగలా మాట్లాడటాన్ని బట్టి.. వాళ్లు వట్టి కబుర్ల పోగులనుకోకండి. అలాగని సరుకు అమ్ముకునేందుకు మాటల గారడీ చేస్తున్నారనుకోవడమూ తప్పే. వాళ్ల పలకరింపులో నిజంగా ఆత్మబంధువు కనిపిస్తాడు. వాళ్ల మాటల్లో మమతానురాగాలు ధ్వనిస్తాయి. ’ఆడికేంట్రా బాబూ.. అత్తిలి సత్తిబాబు. గాలి కూడా పోగేసి అమ్మేస్తాడు’ అనేవాళ్లూ లేకపోలేదు. దాని అర్థం వాళ్లేదో పనికిరాని సరుకుల్ని అంటగడతారని కాదు. అక్కడి వాళ్లకు జీవనోపాధి కష్టం కాదని.. వ్యాపార చతురత అంత గొప్పదని చెప్పడానికే ఆ మాట వాడతారు.
అత్తిలి :
అత్తిలి వాసులు వర్తక, వ్యాపార రంగంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ రాణిస్తూ జీవనోపాధి ఎలా పొందాలో.. వినియోగదారులతో ఎలా మసలుకోవాలో.. వ్యాపారాభివృద్ధి ఏలా చేయాలోననే విషయాల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాలతో పాటు మారుమూల పల్లెల్లోని వారపు సంతల్లో ఎక్కువమంది అత్తిలి వాసులే దుకాణాలు వేస్తుంటారు. రోజుకో ఊరి చొప్పున వారంలో ఏడు రోజులూ సంతలకు వెళుతూ జీవనాన్ని సాగిస్తున్నారు. వేకువజామునే ఇంటి నుంచి బయలుదేరి కూరగాయల దుకాణాలకు వెళతారు. వ్యాపారం ముగించుకుని తిరిగి రాత్రి అయ్యేసరికి ఇంటికి చేరతారు. ఇక్కడ ఇంకో విశేషం ఉంది.. అత్తిలి చుట్టు పక్కల వ్యాపారాలు చేసే వారు కూడా అత్తిలి వర్తకులకుగానే పిలవబడతారు. ఇదే మరి ’అత్తిలి బ్రాండ్ నేమ్‌కు ఉన్న గొప్పతనం’
చిల్లరవర్తక సంఘం స్థాపన
అత్తిలితో పాటు రేలంగి, ఎ.గోపవరం, కె.సముద్రపు గట్టు, మంచిలి గ్రామాలకు చెందిన చిల్లర వర్తకులు 360 మంది ఉన్నారు. 1982లో శ్రీ వెంకటేశ్వర చిల్లర వర్తక సంఘాన్ని స్థాపించారు. సంఘంలో ఉన్న చిల్లరవర్తక సభ్యులంతా ప్రతి నెలా రూ.10 చొప్పున సంఘానికి చెల్లిస్తుంటారు. ఇలా వచ్చిన మొత్తంతో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. వైద్య శిబిరాలు, వికలాంగులకు ఆర్థిక సహాయం, అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు వంట సామగ్రి పంపిణి వంటి కార్యక్రమాలను చేపడుతుంటారు.
వారపు సంతలకు తగ్గిన ఆదరణ
గతానికి, ఇప్పటి వారపు సంతలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పదేళ్ల క్రితం గ్రామాల ప్రజలు వారపు సంతలకు హాజరై వారానికి సరిపడా కూరగాయలు, నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకుని వెళ్లేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఆటోలు, మోటారు సైకిళ్లపై గ్రామాలకు వెళ్లి కూరగాయలు విక్రయిస్తున్నారు. దీంతో వారపు సంతలకు ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో దుకాణదారుల మధ్యన నెలకొన్న పోటీతత్వంతో ఒక్కోసారి రేట్లను తగ్గించి అమ్మకాలు సాగిస్తున్న సందర్భాలు ఉంటున్నాయని వర్తకులు చెబుతున్నారు. సంతలలో దుకాణాలు వేసే సంచార చిల్లర వర్తకులు ఉల్లిపాయలు, దుంపలు, కూరగాయలను తాడేపల్లిగూడెం మార్కెట్ నుంచి తీసుకువస్తుంటారు.
గతంలో పడవలపై కూరగాయల రవాణా
పూర్వకాలంలో గూడెం మార్కెట్ లేని సమయంలో నిడదవోలు, రాజమండ్రిల నుంచి ఉల్లిపాయలు, దుంపలు పడవలపై వేసుకుని గుమ్మంపాడు వద్ద దిగుమతి చేసుకుని ఎద్దుల బండ్లపై సంతలకు తీసుకెళ్లేవారమని అత్తిలి వర్తకులు చెప్పారు. అప్పట్లో కూరగాయలను రవాణా చేయడం కష్టతరంగా ఉండేదన్నారు. ప్రస్తుతం గూడెం మార్కెట్ నుంచి లారీలు, ఆటోలపై కూరగాయలను రవాణా చేస్తున్నారు. అత్తిలిలో గతంలో పెంకుటి షెడ్డులలో సంతలు నిర్వహించేవారు.
రైతుల నుంచి కూరగాయల కొనుగోలు
సంత జరిగే ప్రాంతానికి ఈ ప్రాంతంలో పండించే కూరగాయలను రైతులు తీసుకు వస్తుంటారు. రైతులు తీసుకువచ్చిన కూరగాయలకు వర్తకులు పాట నిర్వహించి, వాటిని పాడుకుంటారు.
జీవన విధానం
ఉదయాన్ని లేచి, స్నాన పానాదులు పూర్తిచేసి, ఇష్టదైవాన్ని పూజించి మెడలో కండువా, భుజాన కాట వేసుకుని, సంతలలో దుకాణాలు వేయడానికి వెళుతుంటారు. అత్తిలిలో పాటు తాడేపల్లిగూడెం, గణపవరం, ఉండి, భీమవరం, నిడదవోలు తదితర గ్రామాలలో జరిగే వారపు సంతలకు వీరంతా వెళ్లి దుకాణాలు వేస్తుంటారు. సంతలకు వెళ్లే సమయంలో వేషధారణ, ఇంటి వద్ద ఉన్న సమయంలో జీవన వి«ధానం వేరుగా ఉంటుంది. సంతలు చేసే వర్తకులు అధిక శాతం మంది ఆర్థికంగా స్థిరపడినవారే.
తాత కూడా సంతలకు వెళ్లి చదువుమానేశా..
16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు సంతలో ఉన్న తాతకు భోజనాన్ని తీసుకెళ్లేవాడిని. అలా దుకాణంలో కూర్చోవడం అలవాటై బడి మానేశాను. అప్పట్లో పందిళ్లు ఉండేవి. అప్పటి నుంచి సంతలలో కూరగాయల దుకాణాలను నిర్వహిస్తున్నాను. 1982లో శ్రీవెంకటేశ్వర చిల్లరవర్తక సంఘాన్ని స్థాపించి, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.
పోలినాటి చంద్రరావు, శ్రీ వెంకటేశ్వర చిల్లర వర్తక సంఘం ఉపాధ్యక్షుడు, అత్తిలి
సంతలకు తగ్గిన ఆదరణ
గతంలో వారపు సంతలకు ప్రజల నుంచి విశేష ఆదరణ ఉండేది. అప్పట్లో సంతలలో నిత్యావసర సరుకులన్నింటినీ వారానికి సరిపడా కొనుగోలు చేసుకునేవారు. ప్రస్తుతం ఇళ్లవద్దకే అన్ని రకాల సరుకులు వెళ్లడంతో సంతలలో దుకాణాలకు ఆదరణ తగ్గింది. అప్పట్లో ఒంటెద్దుల బండిపై సరుకులను సంతలకు చేరవేసేవాళ్లం. 45 ఏళ్లుగా సంతలతో నిత్యావసర సరుకులను విక్రయిస్తున్నాను.
బాదరాల రాజేశ్వరరావు. చిల్లర వర్తకుడు, అత్తిలి
30 ఏళ్లుగా దుకాణాలు వేస్తున్నా..
వారపు సంతలలో ముప్పై ఏళ్లుగా సంతలకు వెళ్లి దుకాణాలు వేస్తున్నాను. చిన్న వయస్సు నుంచే అలవాటు పడటంతో ఇదే వృత్తిని కొనసాగిస్తున్నా. గతంలో సంతలకు ఆదరణ బాగుండేది. ఇప్పుడు అంతగా బాగాలేదు.
కూనంశెట్టి స్వామినాయుడు, చిల్లర వర్తకుడు, అత్తిలి
చిన్నప్పటి నుంచే సంతలకు..
చిన్నప్పటి నుంచి సంతలలో దుకాణాలు వేయడం ప్రారంభించా. అత్తిలి పరిసర మండలాల్లో జరిగే వారపు సంతలలో దుకాణాలు వేస్తుంటా. రానురాను సంతలకు వచ్చే ప్రజల సంఖ్య తగ్గుతోంది.
కాకర్ల సత్యనారాయణ, చిల్లర వర్తకుడు, అత్తిలి
సంతలపై కుటుంబ పోషణ..
22 ఏళ్లుగా సంతలు చేస్తున్నా. సంతలపై ఆధారపడి కుటుంబ పోషణ జరుగుతోంది. గ్రామాలలో వాహనాలపై కూరగాయలను విక్రయించడంతో వ్యాపారాలు బాగా తగ్గాయి.
కోలా చిన అప్పారావు, చిల్లర వర్తకుడు, రేలంగి
తక్కువ ధరకే అమ్ముతున్నాం..
వారపు సంతలకు వచ్చే ప్రజలు తగ్గుతున్నారు. దీంతో ఒక్కోసారి కూరగాయలు వదిలించుకోవడానికి తక్కువ ధరకే విక్రయాలు జరపాల్సి వస్తోంది. వర్షాకాలంలో సంతలు సక్రమంగా సాగవు.
కొండేటి శ్రీనివాసరావు, చిల్లర వర్తకుడు, అత్తిలి
గట్టిగా అరవాల్సి వస్తోంది
గతంలో సంతలకు మంచి ఆదరణ ఉండేది. సంత ప్రారంభం నుంచి రాత్రి వరకు ప్రజలు వచ్చి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు సంతలకు వచ్చే ప్రజలను దుకాణాలకు రప్పించడానికి గట్టిగా అరవాల్సి వస్తోంది.
గంటా వేణుగోపాలస్వామి, చిల్లర వర్తకుడు, అత్తిలి.
సంతలపై ఆసక్తితో...
చిన్నప్పటి నుంచి సంతలకు వెళ్లేవాడిని. గూడెం, గణపవరం, అత్తిలి తదితర గ్రామాల్లో జరిగే సంతలకు వెళుతుంటాను. గత సంతలకు, ప్రస్తుతం వేస్తున్న సంతలకు ఎంతో వ్యత్యాసం ఉంది.
జవ్వాది రాజు, చిల్లర వర్తకుడు, రేలంగి
అత్తిలి మండల సమాచారం
గ్రామాలు...18
జనాభా ... 68,881
మండల విస్తీర్ణం.... 8,591 హెక్టార్లు
వరిసాగు ... 6,472 హెక్లార్టు
చేపల చెరువులు... 571 హెక్టార్లు
అరటి సాగు... 11 హెక్టార్లు
కొబ్బరి.... 10 హెక్టార్లు
మొత్తం పంటలు పండే విస్తీర్ణం.... 6,493 హెక్టార్లు