పొలంలో ఎలుకల నివారణకు పెట్టిన కర్రలు
- గజ్వేల్ ఏడీఏ శ్రావన్‌కుమార్ సలహాలు, సూచనలు
గజ్వేల్: వరిలో ఎలుకల బెడద రైతులను కలవరానికి గురిచేస్తున్నది. శాస్త్రీయంగా ఆలోచించి రైతులు కొన్ని చిట్కాలను, క్రిమిసంహారక మందులను వాడితే పంటలను రక్షించుకోవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్(సెల్ః 7288894469) అందించిన సలహాలు, సూచనలివి...
ఎలుకల నివారణకు చర్యలు
పంట చేలలోని గెట్లపై ఎలుకల రంధ్రాలలో పొగపెట్టినట్లయితే ఎలుకలు కొన్ని చనిపోవడం, మరికొన్ని ఆ వ్యవసాయ క్షేత్రం నుండి వెళ్లిపోవడం జరుగుతుంది. అంతేకాక ఎలుకలు గెట్లపై ఏర్పర్చుకున్న రంద్రాల వద్ద ఎలుక బోన్లు పెట్టడం ద్వారా వాటిని çపట్టవచ్చు. కానీ ఈ విధానాలు రైతులకు కొద్దిగా శ్రమతో కూడుకున్న పని. ఓపికగా పాటిస్తే ఎలాంటి రసాయనిక మందులు వాడకుండానే నివారించవచ్చు.
చిట్కాలతో నివారణ
వరి పైర్లలో మూడునాలుగు మీటర్లకు ఒక కర్రను పాతి దానికి కొద్దిగా ధ్వని వచ్చే విధంగా ఏవైనా పాలితిన్ కవర్లను, వరి గడ్డిని వేసి బురదను పెట్టి ఉంచాలి. ఎలుకలు మామూలుగా పంటచేనులో విచ్చల విడిగా అక్కడా ఇక్కడా తిరుగుతుంటాయి. తిరిగినపుడు ఈ కట్టెను తాకగానే మనిషి ఉన్నట్లుగానే అవి భయానికి గురవుతాయి.
ఆ ప్రాంతానికి రావడానికి సాహసించవు. అలాగే రెండుమూడు మీటర్లకు ఒకటి చొప్పున వరి పొలంలో మొత్తం పాతితే చాలా వరకు ఎలుకలను నివారించవచ్చు. ఈ చిట్కాను పాటించడం రైతులకు చాలా తేలిక.
క్రిమిసంహారక మందులతో నివారణ
శాస్త్రీయ పద్దతి ప్రకారం ఎలుకల నివారణకు క్రిమిసంహారక మందులను వాడటం వల్ల నివారించవచ్చు. కానీ రైతులు ఈ మందుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. బ్రొమోడలైన్ 50మి.గ్రా. రెండు కిలోల బియ్యంలో కలిపి పెడితే ఎలుకలు మృత్యువాతకు గురవుతాయి. బియ్యం, నూనె కలిపి మందు కలపకుండానే రెండ్రోజులు ఎలుకలు ఏర్పర్చుకున్న రంధ్రాల వద్ద పెట్టాలి.
వాటికి ఇవి తినొచ్చు అనే నమ్మకం కలిగిన తర్వాత బియ్యంలో మందు కలిపి పెట్టినట్లయితే తింటాయి. తినగానే వెంటనే చనిపోతాయి. మందు పెట్టడంలో రైతులు జాగ్రత్త వహించకపోతే హాని కలిగే అవకాశమున్నది. అల్యూమినియం పాస్పేట్, జింక్ సల్ఫేట్‌తో తయారు చేసిన బిస్కెట్ పెట్టడం వల్ల కూడా ఎలుకలు చనిపోతాయి. ఆ బిస్కెట్ గాలి ద్వారా వ్యాపించి ఎలుకలు గాలిని పీల్చగానే మృత్యువాతకు గురవుతాయి. కానీ ఈ విధానం రైతులకు నష్టం వాటిల్లే అవకాశమున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఈ మందును ప్రయోగించడం మంచిది.