ప్రతి జిల్లాలోనూ ఆయూష్ ఆస్పత్రులు
లాలాపేట: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 20 పడకల ఆయూష్ హాస్పిటల్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం తార్నాకలోని ఐఐసీటీ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి ఆయూష్ వైద్యాధికారుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయూష్ వైద్య సేవలపై ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయి నుంచే ఆయూష్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు.
గతంలో అల్లోపతి, హోమియోపతి, ఆయూష్ వేర్వేరు విభాగాలుగా ఉన్నందున నిరాదరణకు గురయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇందులో భాగంగా అన్ని రకాలైన వైద్య సేవలను ఒకే గొడుగు కిందికు తెస్తున్నామన్నారు. ప్రస్తుత ఆయూష్ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు నూతనంగా నిర్మించే హాస్పిటల్‌లలో ఆయూష్‌కు ప్రత్యేక స్థలం కేటాయించేలా, ఆహ్లదకరమైన వాతావరణం నెలకొల్పేలా వైద్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో చర్చిస్తామన్నారు.
అనంతగిరిలో ఆయూష్ హాస్పిటల్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అనంతరం ఆయూష్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారి, కమిషనర్ బుద్ధప్రకాష్, డాక్టర్ రమణి, లలితకుమారి, డా. కరుణాకర్‌రెడ్డి, నీరజారెడ్డి, మనోహర్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.