కుటుంబ సభ్యులతో 26ఏళ్ళ క్రితం తీసిన ఫోటో.
బాతుపురం(కాశీబుగ్గ) : మల్కన్‌గిరి అడవుల్లో ఎన్‌కౌంటర్ వార్త విన్నప్పటి నుంచి ఉద్దానంలోని బాతుపురం నిద్దరపోలేదు. ఇదే ఎన్‌కౌంటర్‌లో గ్రామానికి చెందిన చెల్లూరు నారాయణరావు, అతని భార్య బొడ్డు కుందన చనిపోయారని తెలిసి ఆ ఊరంతా రోదించింది. గ్రామం విడిచి 26 ఏళ్లయినా స్థానికులు ఇంకా వారిని మర్చిపోలేదు. జిల్లాలో విప్లవ భావాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఉద్దానం ప్రముఖమైనది. ఉద్దానంలోని ఓ పల్లెటూరైన బాతుపురం గ్రామానికి చెందిన చెల్లూరు నారాయణ అలియాస్ సూరన్న (సురేష్) 1990 అక్టోబర్ 13 తేదిన గ్రామం విడిచి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇన్నేళ్ల తర్వాత భార్య కుందనతో కలిసి కన్ను మూశాడని తెలియడంతో గ్రామంలో విషాద ఛాయల అలముకున్నాయి. నారాయణకు ఇద్దరు సోదరులు సింహాచలం, భూచంద్రరావులు ఉన్నారు. వీరి ఊరిలోనే కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు.
నారాయణ ఊరిలో ఉన్నప్పుడే చాలా దుడుకుగా ఉండేవాడు. వాలీబాల్ ఆటలో మంచి నేర్పరి కూడా. అక్కుపల్లిలో పదో తరగతి చదివాడు. గ్రామంలో అక్షరభారతి పాఠాలు బోధిస్తూ గ్రామంలో అనేక మందిని విద్యా వంతులుగా తీర్చి దిద్దాడు. గ్రామంలో నాటుసారాతో ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్న వారికి రైతులుగా తీర్చిదిద్దాడు. పూర్తిస్థాయిలో వ్యవసాయం వైపు మరళించిన ఘనత ఇతనికే దక్కింది. వ్యవసాయదారులకు మద్దతుగా నిలిచి ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాడు. గ్రామంలోని యువజన సంఘ నాయకుడిగా గ్రామ అభివృద్ధికి పాటుపడే వాడు. ఉద్దాన ప్రాంతాల్లో పెత్తందారులకు మొదటిగా ఎదురించిన వ్యక్తిగా నిలిచాడు. విప్లవభావాలతో గ్రామానికి చెందిన జోగారావుతో పాటు 11మందిని తన అడుగుజాడల్లో నడిపించాడు. తన కుటుంబం కోసం గానీ, ఆస్తి కోసం గానీ ఎన్నడూ ఆలోచించలేదని స్థానికులు తెలిపారు.