బాబు మోసాలే గోపాల్‌రెడ్డి విజయసోపానాలు
నూనెపల్లె: ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసాలే పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయానికి సోపానాలని వైస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా పరిశీలకుడు విజయ రాఘవరెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి మలికిరెడ్డి రాజగోపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరఫున బరిలోకి దిగిన వెన్నపూస గోపాల్ రెడ్డిని గెలుపుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రచారం ముమ్మరం చేయాలన్నారు. సీఎం చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోయారని, అబద్ధాల బాబుకు ఎమ్మెల్సీ ఎన్నికలే గుణపాఠం కావాలని అన్నారు.
మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచారన్నారు. రాజధాని పేరుతో కమిషన్లు పాల్పడుతూ పారిశ్రామిక, వ్యాపార వేత్తలకు సీట్లు ఇస్తున్నారని, అలాంటి వారికి అవకాశం ఇవ్వరాదన్నారు. ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉద్యోగులు, కార్మిక సమస్యలపై పోరాటాలు చేసిన ఘనత గోపాల్‌రెడ్డికి ఉందన్నారు. ఇలా పోరాడే నాయకుడికే పట్టం కట్టాలన్నారు. ఎన్నికల ప్రచారకులు కుమార్, వైఎస్ యువసేన రాష్ట్ర కార్యదర్శి సునీల్‌రెడ్డి, పార్టీ నంద్యాల, గోస్పాడు మండలాల కార్యదర్శులు భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, నాయకులు ద్వారం వీరారెడ్డి, ద్వారాం మాధవరెడ్డి, వివేకానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.