
అయ్యో‘పాప’ం
- పసిబిడ్డను చెత్తకుప్పలో వదిలేసిన తల్లి
- చేరదీసిన ఆటో డ్రైవర్
- నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స
నంద్యాల: నెలలు నిండకముందే పుట్టిన బిడ్డను ఓ తల్లి చెత్తకుప్పపాలు చేసింది. గమనించిన ఆటోడ్రైవర్..ఆ పసిపాపను కాపాడి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మెడికేర్ ఆసుపత్రి వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..పాణ్యం మండలం కొణిదేడు గ్రామానికి చెందిన లక్ష్మిదేవి, ఆమె భర్త వెంకట్వేర్లు మెడికేర్ ఆసుపత్రికి వచ్చారు. కడుపునొప్పి అధికంగా ఉందని లక్ష్మిదేవికి చెప్పడంతో వైద్య సిబ్బంది స్కానింగ్ చేసి గర్భిణిగా నిర్ధారించారు. కాని ఆమెకు ప్రసవ వేదన ప్రారంభం కావడంతో ఆసుపత్రి చివరలో ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఏడు నెలలలోనే ఆడపిల్ల పుట్టడంతో ఆ తల్లి ప్రహరీ పక్కనే ఉన్న చెత్తకుప్పలో వేసి వెళ్లింది. అక్కడే ఉన్న నందమూరినగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ శ్రీనివాసులు గమనించి.. బిడ్డను పందుల బారిన పడకుండా కాపాడాడు. మెడికేర్ ఆసుపత్రిలో పసిబిడ్డను అప్పగించగా వారు ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ ఏంజిల్‌కు సమాచారాన్ని అందించారు. ఐసీడీఎస్ అర్బన్ సీడీపీవో ఏంజల్ పసికందును ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స చేసిన అనంతరం చిన్నారి కోలుకుంది. బరువు ఒకటిన్నర కేజీ ఉన్నందున కోలుకుందని, మెడికేర్ ఆసుపత్రిలో సీసీ కెమెరాల పుటేజ్ ద్వారా తల్లిదండ్రులను గుర్తించి కేసు నమోదు చేయిస్తామని సీడీపీవో తెలిపారు.