
చెత్త కుప్ప నుంచి శిశు గృహానికి...
ఖమ్మం: మే 18వ తేదీ. ఉదయ పది గంటలు. నగరంలోని ఎన్‌ఎస్‌టీ రోడ్డులోగల ఆర్‌ఎస్ మెడికల్ షాపు వద్ద చెత్త కుప్ప. అందులో ఓ పసికందు (మగ). పుట్టిన వెంటనే తీసుకొచ్చి పడేసినట్టుగా ఒంటిపై రక్తపు చారికలు. ఆ పసికందు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఒంటి నిండా చీమలు. అటుగా వెళుతున్న అనేకమంది చూస్తున్నారు. కొద్దిసేపటి తరువాత ఒకరు ముందుకొచ్చారు. చేతుల్లోకి తీసుకుని, చీమలన్నిటిని దులిపేసి, జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
డ్యూటీ డాక్టర్లు వెంకటేశ్వర్లు, శారద వెంటనే స్పందించారు. అత్యవసర వైద్యం అందించారు. అప్పుడు ఆ శిశువు బరువు ఒక కేజీ 400 గ్రాములు. జూలై 6వ తేదీ. థ్యాంక్ గాడ్! ఆ పసికందు క్షేమంగా ఉన్నాడు. చెత్తకుప్పల దుర్వాసనను, చీమల దాడిని తట్టుకుని బతికాడు..! కాదు.. కాదు.. వైద్య నారాయణులు కంటికి రెప్పలా చూసుకుంటూ బతికించారు. ఆ శిశువు ఇప్పుడు రెండున్నర కేజీలకు పెరిగాడు. ఐసీడీఎస్ పీడీ వరలక్ష్మి, ఆ శిశువును ఆస్పత్రి నుంచి శిశుగృహకు అప్పగించారు. ‘బిడ్డా.. నువ్వు చల్లగా బతకాలి!’ అంటూ, ఆ ఆస్పత్రి వైద్యులు తమ మనసులోనే మౌనంగా దీవించి పంపించారు..!!