
‘ఛీ’జీహెచ్
♦ రోగుల ప్రాణాలు..గాల్లో దీపాలు!
♦ అరకొర వసతులతో అవస్థలు
♦ వైద్య సేవలూ అంతంతమాత్రమే
♦ ఉన్న పరికరాలనూ మూలన పడేస్తున్న వైనం
♦ వైద్యులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం
రోగుల ప్రాణాలు పోతున్నా వీరికి పట్టదు... పసికందుల ఊపిరి ఆగిపోతున్నా వీరిలో చలనం ఉండదు.. అత్యవసర విభాగాల్లో వెంటిలేటర్లు, ఏసీలు పనిచేయవు.. సమయపాలన పాటించని వైద్యులు.. గంటన్నరలో ముగుస్తున్న ఓపీ సేవలు.. ఒక్కో బెడ్డుపై ఇద్దరు బాలింతలు.. ఒక్క పసికందును ఉంచాల్సిన వార్మర్, ఫొటోథెరపీ యూనిట్‌లలో ముగ్గురిని చొప్పున ఉంచుతున్న వైనం.. మందుల బాక్సులు, వైద్య పరికరాల తరలింపునకే వినియోగిస్తున్న స్ట్రెచర్లు, వీల్ చైర్లు.. ఇదీ గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి దుస్థితి.
సాక్షి, గుంటూరు రాజధాని ప్రాంతంలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో వైద్య సేవలు సక్రమంగా అందుతాయనే ఆశతో జీజీహెచ్‌కు వచ్చే నిరుపేద రోగులకు ఆస్పత్రి అధికారులు, వైద్యులు ప్రత్యక్ష నరకాన్ని చూపుతున్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో ఓపీకి నిత్యం 3 వేల మంది నుంచి 4 వేల మంది రోగులు వస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆస్పత్రిలో రోజుకు కొన్ని వైద్య విభాగాల ఓపీలు నిర్వహించాల్సి ఉంది. అయితే వైద్యులు, పీజీలు తాపీగా 10. 30 గంటలకు వచి, 12. 30 గంటల కల్లా ఓపీని నిలిపివేస్తున్నారు. దీంతో అనేక మంది వైద్యసేవలు పొందకుండానే వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రొఫెసర్లు ఓపీలో కూర్చుని వైద్య సేవలందిచాల్సి ఉన్నప్పటికీ కొందరైతే అటు వైపు తిరిగి కూడా చూడటం లేదు. ఓపీ సమయంలో వైద్య విద్యార్థులకు బోధనలు, బోధనల సమయంలో సొంత ఆసుపత్రుల్లో సేవలతో పబ్బం గడుపుకుంటున్నారు. మధ్యాహ్నానికి వైద్యులు సొంత ప్రాక్టీసులకు వెళ్తుండటంతో పీజీలు, నర్సులే రోగులకు దిక్కు. రాత్రి వేళ వైద్యులు కనిపించరు. రాత్రి వేళల్లో ఇన్‌పేషెంట్‌కు హఠాత్తుగా సీరియస్ అయిందంటే డాక్టర్ వచ్చే లోపు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
అరకొరగా సౌకర్యాలు..
గుంటూరు జీజీహెచ్‌లో మెడికల్, సర్జికల్, జనరల్, క్యాజువాలిటీ వార్డులు ఉన్నాయి. కోస్తాంధ్రలో 6 జిల్లాల నుంచి రోగులు ఇక్కడకు వస్తుండటంతో పడకల సంఖ్యకు మించి రోగులు ఉంటున్నారు. ఆస్పత్రిలోని ఏఎంసీలో 14 పడకలు ఉండగా, నాలుగు వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఒకటి పని చేయడం లేదు. ఐసీయూలో 12 పడకలు ఉండగా తొమ్మిది వెంటిలేటర్లు ఉన్నాయి. అందులో రెండు పనిచేయడం లేదు. ఎన్‌ఐసీయూలో ఉన్న వార్మర్లు, ఫొటోథెరపీ యూనిట్‌లలో ఒక్కరు చొప్పున పసికందులను ఉంచాల్సి ఉండగా ఒక్కో దానిలో ముగ్గురు చొప్పున ఉంచుతున్నారు. ఎన్‌ఐసీయూ, పీఐసీయూల్లో కలిపి 20కి పైగా బెడ్‌లు ఉండగా 50 మంది వరకూ పిల్లలు చేరుతుంటారు. ఈ రెండు విభాగాల్లో కలిపి కేవలం 14 వెంటిలేటర్లు ఉండగా అందులోనూ రెండు పనిచేయడం లేదు. సర్జికల్ పోస్ట్ ఆపరేటివ్ వార్డులో 30 పడకలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి బెడ్‌కూ ఒక వెంటిలేటర్ అవసరం కాగా, మొత్తం మీద మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. క్యాజువాలిటీ వార్డులో 30 పడకలు ఉండగా నాలుగు వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి.
అందులో రెండు మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం. అత్యవసర విభాగాలన్నింటిలో ఏసీలే సక్రమంగా పనిచేయక రోగులు ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి దాపురించింది. పిల్లల శస్త్ర చికిత్స విభాగంలో 20 పడకలు ఉండగా మూడు వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం ఎలుకల దాడిలో శిశువు మృతి చెందింది ఈ విభాగంలోనే. జీజీహెచ్‌కు వచ్చే కేసుల్లో అధికశాతం ఎమర్జన్సీ కేసులు ఉంటాయి. దీనికి అనుగుణంగా అత్యవసర వైద్య విభాగాల్లో ప్రతి బెడ్‌కు ఓ వెంటిలేటర్ ఉండాల్సి ఉండగా ఐదోవంతు కూడా లేకపోవడం దారుణమైన విషయం. అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రం సోమవారం 11 గంటల వరకూ తెరవకపోవడంతో రోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు.
మరికొన్ని సమస్యలు..
♦ జీజీహెచ్‌లో ఓపీ, ఐపీ, రక్త పరిక్ష, ఎక్స్‌రే, స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలు ఇలా ఎక్కడకు వెళ్ళినా గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి.
♦ ఈ వార్డుల వద్ద తాగునీటి సౌకర్యమూ లేక రోగులు నీరసంతో కూలబడిపోతున్నారు.
♦ చాలా మందులు బయట కొనాల్సిన దుస్థితి.
♦ మందులు, వైద్య పరికరాలు, దుప్పట్లు మోసుకెళ్లేందుకే ఉపయోగపడుతున్న స్ట్రెచర్లు, వీల్ చైర్లు
♦ రోగులను మోసుకెళ్లేందుకు సహాయం అందక బంధువుల ఇక్కట్లు