
నగరానికే నడుం నొప్పి వచ్చేలా..
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లో సుమారు 45 లక్షల వాహనాలు ఉండగా, వీటిలో 30 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలే. ఏడు లక్షల కార్లు, లక్షకుపైగా ఆటోలు, మరో లక్ష ఇతర వాహనాలు ఉన్నట్టు రవాణా శాఖ అంచనా. రోడ్లపై గుంతల కారణంగా బైక్ నడిపేవారు వెన్ను, మెడ, భుజాలు, ఇతర కండరాల నొప్పులతో బాధ పడుతుంటే, కారును నడిపేవారు నడుము, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.
వీరి వాహనం గుంతలో పడిన ప్రతిసారీ డిస్క్‌ల మధ్య కదలికలు ఎక్కువై జాయింట్స్ అరిగి పోతున్నట్టు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం తమ ఓపీకి వచ్చే బాధితుల్లో 60 శాతం మంది వెన్ను నొప్పితో బాధపడుతుండగా, బ్యాక్ పెయిన్‌తో 20 శాతం మంది, మెడ, భుజాల నొప్పులతో 15 శాతం, కండరాల నొప్పులతో 5 శాతం మంది బాధపడుతున్నారని ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ జీవీ సుబ్బయ్య స్పష్టం చేశారు.
పాడవుతున్న వాహనాలు
శిథిలమైన రోడ్లు, వాటి మధ్య గుంతలతో ద్విచక్ర వాహనాలు, కార్ల నిర్వహణ ఖర్చు పెరుగుతోంది. ద్విచక్ర వాహనాలకు క్లచ్, బ్రేక్ సిస్టమ్ దెబ్బ తింటుంది. టైర్లు కూడా చీలిపోతున్నాయి. తరచూ ఇలాంటి గుంతల్లో కార్లు, బైకులు ప్రయాణిస్తే సస్పెన్షన్ వ్యవస్థ నాశనమవుతోంది. ప్రతి గుంత వద్దా బ్రేకులు వేస్తూ.. గేర్లు మార్చడం వల్ల మైలేజీ సైతం పడిపోతోంది. ఈ సమస్యలతో రోజుకు తన గ్యారేజీకి నాలుగైదు కార్లు వస్తున్నట్లు బాగ్‌లింపల్లిలోని కేడీఎన్ హైదరాబాద్ మోటార్ గ్యారేజీ నిర్వాహకుడు మహ్మద్ ఖదీర్‌ఖాన్ తెలిపారు.
వాహనం నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సన్‌షైన్ ఆస్పత్రి స్పైన్ సర్జన్ డాక్టర్ జీవీ సుబ్బయ్య సూచిస్తున్నారు. అవి..
► బైక్ నడిపేటప్పుడు తల, నడుము, షోల్డర్ వంచకుండా నిటారుగా నిలబడడం అలవాటు చేసుకోవాలి
► మెడపై భారం పడకుండా తేలికైన హెల్మెట్లను వాడాలి
► ర్యాష్ డ్రైవింగ్ పనికిరాదు. సీటు దిగజారినట్టుగా ఉండకూడదు
► కారులో సిట్టింగ్ 110 డిగ్రీలు తప్పని సరిగా ఉండాలి
► క్లచ్‌లు, గేర్లు చేతికి చేరువలో ఉండేలా చూడాలి.
► వీపు భాగాన్ని పూర్తిగా సీటుకు ఆనించి కూర్చోవాలి
► గుంతలు, ఎగుడు దిగుడు రోడ్లు, స్పీడ్ బ్రేకర్ల వద్ద వాహన వేగం తగ్గించాలి
► దూర ప్రయాణంలో ప్రతి గంట, రెండు గంటలకోసారి కొంత విరామం తప్పనిసరి