
మెదక్‌లోని జమా మసీద్‌లో సామూహిక నమాజ్‌లు
మెదక్: త్యాగనిరతికి విశ్వాసానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ముస్లింలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. బక్రీద్‌ను వేడుకలను మంగళవారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. మెదక్ పట్టణానికి చెందిన ముస్లింలు స్థానిక జమా మజీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏటా పట్టణంలోని నవాబుపేటలో గల ఈద్గా వద్ద సామూహిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేవారు. ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో జమా మజీద్‌లోనే సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
పాపన్నపేటలో...
పాపన్నపేట: పాపన్నపేట మండలంలో బక్రీద్ పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఉదయం వేళ ఈద్గాల వద్ద ప్రార్థనలు నిర్వహించారు. పలువురు గొర్రెపొటేళ్లు, మేకలను భగవంతునికి బలి ఇచ్చి ఆ మాంసాన్ని పేదలకు పంపిణీ చేశారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హిందూముస్లింలు ఒకరినొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
చిన్నశంకరంపేటలో...
చిన్నశంకరంపేట: పండుగ సందర్భంగా మండల కేంద్రంలోని మజీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురువడంతో ఈద్గా వద్ద జరపాల్సిన ప్రార్థనలు మజీద్‌లోనే నిర్వహించారు. మత గురువు ప్రార్థనల అనంతరం బక్రీద్ ప్రత్యేకతను వివరించారు. ప్రతి ముస్లిం దాన గుణంతో పాటు, త్యాగనిరతిని కలిగి ఉండాలని సూచించారు. ఈ ప్రార్థనలో ముస్లిం మతపెద్దలు గౌస్‌మియా, దస్తగిరి, ఖాజా, రఫీ, ఏదుల్ తదితరులు పాల్గొన్నారు.