సిరుల బంతి
రొద్దం : సంప్రదాయ వ్యవసాయంతో నష్టాలు చవిచూసిన రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లాభాలు గడిస్తున్నారు. నిత్యమూ అన్ని సామాజిక వర్గాలకు ఉపయోగకరమైన పూల సాగు రోజు వారి ఆదాయాన్ని సమకూరుస్తుండడంతో రైతులు ఆ దిశగా అడుగు వేశారు. అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. వివరాలు.. రొద్దం మండలంలోని రెడ్డిపల్లికి చెందిన 20 మంది రైతులు నూనత వంగడాల బంతి పూల సాగును 50 ఎకరాల్లో చేపట్టారు.
పూల విత్తనం అందించిన కంపెనీ వారే దిగుబడిని కూడా కొనగోలు చేస్తుండడంతో మార్కెటింగ్‌లో తలెత్తుతున్న సమస్యల నుంచి వారు బయటపడ్డారు. ఎకరా బంతి పూల సాగుకు రూ. రెండు వేల వరకు పెట్టుబడులు అవసరం కాగా, ప్రతి కోతకు రూ. నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. వారానికి ఒకసారి కోతకు వచ్చే పూలను తరలించేందుకు కంపెనీ వారే లారీలను తీసుకువచ్చి కర్ణాటకలోని టిప్పుటూరు మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈ లెక్కన పంట మొత్తం 9 సార్లు కోతకు వస్తుందని రైతులు వివరిస్తున్నారు.