లాఠీ..లూటీ
Published Sun, Oct 23 2016 8:45 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
- ఆదాయ వనరులుగా పోలీస్ సర్కిళ్లు
- అధికార పార్టీ నేతల అండదండలు
- బాధితులకు అందని న్యాయం
- మూమూళ్లిస్తే కేసు తారుమారు
- మసకబారుతున్న పోలీస్‌శాఖ ప్రతిష్ట
కర్నూలు: కర్నూలు సబ్‌డివిజన్ పరిధిలోని బళ్లారి రోడ్‌లో హంద్రీ బ్రిడ్జీ వద్ద రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా గుంత తవ్వి వదిలేశారు. వెంకటగిరికి గ్రామానికి చెందిన ఎల్లసాని అనే యువకుడు మోటర్‌సైకిల్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెందాడు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించాడంటూ కాంట్రాక్టరును బెదిరించి ఓ పోలీసు అధికారి రూ.4 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.
- పులకుర్తి గ్రామంలో ఈ ఏడాది జనవరిలో హత్య జరిగింది. రాజకీయ కుట్రలో భాగంగా మద్దిలేటి అనే రైల్వే ఉద్యోగిని ప్రత్యర్థులు కేసులో ఇరికించారు. అతడిని రిమాండ్‌కు పంపకుండా ఉండేందుకు ఓ అధికారి రూ.3 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పై రెండు ఉదాహరణలే కాదు.. ఇలాంటివి ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు శాఖ ప్రతిష్టను దిగదార్చుతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాలను అణచివేయడం పోలీసుల బాధ్యత. కొంతమంది అధికారులు.. విధి నిర్వహణలను పక్కనపెట్టి ఆదాయమే పరమావధిగా పని చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరికి అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడం విమర్శలు తావిస్తోంది.
పోలీస్ స్టేషన్‌కు బాధితులు వేదనతో వస్తారు. తమ కష్టాన్ని పోలీసులతో చెపుకుంటే న్యాయం జరుగుతుందని భావి«స్తారు. కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్న వారికి స్వాంతన కలిగించేలా వ్యవహరించాలి. న్యాయం జరుగుతుందనే ధీమా కల్పించాలి..పోలీసు ఉన్నతాధికారులు తరచూ కిందిస్థాయి సిబ్బందికి చెప్పే మాటలివి. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తిభిన్నంగా ఉంది. పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పలువురు పోలీసు అధికారులు ఆశాఖ పరువును మంటగలుపుతున్నారు. డబ్బుల కోసం కేసులను తారుమారు చేయడం, నిందితులను మార్చడం దాకా వ్యవహారాలు కొనసాగిస్తున్నారు.
అక్రమ ఆదాయం పైనే కన్ను ..
ప్రతీ పోలీస్ సర్కిల్ పరిధిలో మద్యం, కళ్లు దుకాణాలు, బియ్యం, కిరోసిన్ అక్రమ రవాణా వ్యాపారులు ప్రతి నెలా స్టేషన్ మామూళ్లు ఇస్తారనేది బహిరంగ రహస్యమే. దీనికి తోడు హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలు, లాడ్జీలు, పైరసీ సీడీ సెంటర్లు, మద్యం బెల్టు దుకాణాలతో పాటు, చిన్నా చితక చికెన్, మటన్ దుకాణా దారుల నుంచి మామూళ్ల కోసం బలవంతం చేసిన ఉదంతాలు జిల్లాలో అనేకం. ఈ వసూళ్లను ఆయా స్టేషన్లలో పని చేసే ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు చక్కబెడుతున్నారు. ఒక్కొక్క సర్కిల్ పరిధిలో అక్రమ ఆదాయం రూ.5 నుంచి రూ.8 లక్షలపైగా వస్తున్నా... చిన్నా, చితక పిటిషన్లతో స్టేషన్లను ఆశ్రయించే బాధితులను సహితం డబ్బుల కోసం పట్టి పీడిస్తున్న ఉదంతాలు కోకొల్లలు.
అసాంఘిక కార్యకలాపాలకు మామూళ్లు ః
జూదం, వ్యభిచారం, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలతో పాటు హత్యలు, ఆత్మహత్యలు, వరకట్న హత్యలు, రోడ్డు ప్రమాదాలు, స్థల దురాక్రమణలు, భార్యభర్తల తగాదాలు, కుటుంబ సభ్యుల ఆస్థి తగాదాలు ఇలా ఒక్కటేంటి... పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ప్రతి సమస్య రక్షణ భటులకు ఆదాయ వనరులే. సివిల్ పంచాయితీల్లో తలదూర్చే అధికారం వారికి లేకున్నా.. కేసుల పరిష్కారం సందర్భాల్లో అటు ఫిర్యాదు దారులనుంచి, ఇటు నిందితుల నుంచి కూడా పర్సంటేజీలు నిర్ణయించి సొమ్ము చేసుకోవడం జిల్లాలో నిత్యం నడుస్తున్నదే.
అధికార పార్టీ నేతల అండ...
జిల్లాలో పని చేస్తున్న ప్రతి పోలీస్ అధికారికి అధికార పార్టీకి చెందిన నాయకుల అండ ఉంది. కొంత మంది పోలీస్ అధికారులు టీడీపీ నేతలకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి ఆదాయం ఉన్న సర్కిళ్లలో పాగా వేస్తున్నారు. దీంతో అధికారుల అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసే వారు లేరు. జిల్లాలో సర్కిళ్లతో కలిపి ఉన్నవి 19, అప్‌గ్రేడ్ స్టేషన్లు 14 ఉన్నాయి. వీటిలో సివిల్ పోలీస్ సర్కిళ్లు 28 ఉన్నాయి. వీటిని ఆదాయపరంగా పోలీసు శాఖ ఏ,బీ, సీ కేటగిరిలుగా విభజించినట్లు సమాచారం. బాగా ఆదాయమార్గాలున్న సర్కిళ్లలో పని చేసేందుకు పోలీసు అధికారులు పోటీ పడుతుంటారు. ఏకేటగిరిలోని సర్కిళ్లను ఇన్‌స్పెక్టర్లు తమకు కాసుల వర్షం కురిపించేవిగా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఏ కేటగిరి సర్కిల్‌కు ఒక ఇన్‌స్పెక్టర్ అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతకు రూ.20 లక్షలు ముడుపులు చెల్లించి పోస్టింగ్ వేయించుకున్నట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలను ఇళ్లవద్ద కలిసి వారి అనుమతి తీసుకుంటే తప్ప పోస్టింగ్‌లు దక్కే పరిస్థితి లేదు.
ఆదాయన వనరులులివే...
నిబంధనలను ఉల్లంఘించి తిరిగే వాహనాలు, వరికోత మిషన్లు, క్యాట్‌ఫిష్ వాహనాలు, కంకర ఫ్యాక్టరీలు, బండలను పేల్చే మందుగుండు సామగ్రి వ్యాపారులు, ఇసుక, మైనింగ్.. పోలీసు అధికారుల అక్రమ సంపాదనకు ప్రధాన వనరులు. చట్టాన్ని అతిక్రమించి లావాదేవీలు నిర్వహించే ఎలాంటి నేరగాళ్లయినా మామూళ్లు ఇచ్చుకుంటూ తమ పని సాఫీగా కొనసాగించుకోవచ్చు. గత బదిలీల్లో కర్నూలుకు వచ్చిన ఒక పోలీసు అధికారి.. శాంతిభద్రతలను అక్కడ ఎలా పరిరక్షించాలి. నేరాల నివారణ, నేరస్తులను ఆటకట్టించడం ఎలాగనే విషయంపై అధ్యయనం చేయాల్సింది పోయి ఆదాయ మార్గాలను అన్వేషించారు. విధుల్లో చేరగానే సర్కిల్ పరిధిలో జరిగే నేరాలు ఎలాంటివి, ఆదాయ మార్గాలు ఏమిటి, స్టేషన్‌కు వచ్చే సాధారణ మామూళ్లు ఎంత, పంచాయతీలు, సెటిల్‌మెంట్ల ద్వారా ఎంత సమకూరుతుంది.. మట్కా, పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాల నిర్వహకులవైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు ఎంతిస్తారు, ఇది వరకు ఉన్న అధికారి నిర్ణయించిన రేట్ల వివరాలను కనుగొన్నారు. సదరు అధికారి అదనపు ఆదాయం కోసం రేట్లు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ప్రచారం ఉంది. కర్నూలు నగరంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పాణ్యం, డోన్, కోవెలకుంట్ల, కర్నూలు రూరల్ తాలూకా, బేతంచెర్ల, నంద్యాల సర్కిళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఒక్కొక్క సర్కిల్ పరిధిలో మూడు నుంచి 5పోలీస్ స్టేషన్లు ఉన్నందున, స్టేషన్ల వారీగా కూడా సర్కిల్ స్థాయి అధికారికి భారీగా మామూళ్లు అందుతున్నట్లు సమాచారం.
ఇవీ ఉదాహరణలు..
-డోన్ పట్టణానికి చెందిన ఓ దొంగను కర్నూలు పోలీసులు రెండు వారాల క్రితం అదుపులోకి తీసుకున్నారు. భారీ ఎత్తున నేరాల చిట్టా బయటపడింది. అతని వద్ద నుంచి రూ.1.80 లక్షల నగదు, రెండు విలువైన సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని.. కేసు లేకుండా వదిలేశారు.
- కర్నూలు పట్టణం శ్రీరామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ప్రకాష్‌నగర్‌లో ఉన్న భర్త ఆమెను పుట్టింటిలోనే కొట్టి వేధించాడు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఇద్దరూ రాజీ అయ్యారు. అంతా మీ ఇష్టమేనా అంటూ ఒక అధికారి వారి నుంచి రూ.50 వేలు వసూలు చేశారు.
- కర్నూలు నగరం అయ్యప్పగుడి వద్ద ఐదుగురు మిత్రులు పేకాడుతూ విభేదాలు తలెత్తి కొట్టుకున్నారు. పంచాయితీ స్టేషన్‌కు చేరింది. వారి వద్ద నుంచి రూ.50 వేలు తీసుకొని ఓ అధికారి అందరినీ రాజీ చేశాడు.
- ఆదోని పట్టణంలో నిషేధిత పదార్థాలు పట్టుబడ్డాయి. వాటిని విక్రయిస్తున్న వారిపై కేసు నమోదు చేయకుండా భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు.
ఆదాయపరంగా సర్కిళ్లకు గ్రేడ్‌లు
ఏగ్రేడ్ సర్కిళ్లు (ఆదాయం రూ.5 నుంచి, రూ.8 లక్షలు)
– కర్నూలు టూటౌన్, త్రీటౌన్, ఫోర్త్ టౌన్, ఆదోని టౌన్, టూటౌన్, ట్రాఫిక్, నంద్యాల టౌన్, టూటౌన్, డోన్, ఆళ్లగడ్డ, బేతంచెర్ల.
బీగ్రేడ్ సర్కిళ్లు ( రూ.3 నుంచి రూ.4 లక్షలు)
– కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ ట్రాఫిక్, ఆత్మకూరు, పత్తికొండ, ఆదోని తాలూకా, ప్యాపిలి, కర్నూలు రూరల్ తాలూకా, మంత్రాలయం.
సీ గ్రేడ్ సర్కిళ్లు (రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు)
– కోసిగి, శిరివెళ్ల, శ్రీశైలం, నంద్యాల తాలూకా.
Advertisement
Advertisement