భామిని: విదేశీ అమ్మాయి... భారత దేశ సంస్కృతికి మెచ్చి ఇక్కడి అబ్బాయితో ప్రేమ వివాహం చేసుకున్న సంఘటన శ్రీకాకుళం జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. రష్యా సమీపంలోని ఉక్రెయిన్‌కు చెందిన యువతి నడియా గ్లాడ్కా విద్యాభ్యాసం నిమిత్తం ఒడిశాలోని భువనేశ్వర్ వచ్చారు. అదే కళాశాలలో శ్రీకాకుళంజిల్లా భామిని మండలం బత్తిలికి చెందిన దేవకుమార్(దేబ్) విద్యనభ్యసిస్తున్నారు. వీరిద్దరికీ ముంబయిలోనే ఉద్యోగం లభించింది.
వీరిమధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరువురి మనసులు కలిశాయి. ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను అమితంగా ఇష్టపడిన ఆమె దేవకుమార్‌తో వివాహానికి అంగీకరించింది. పెద్దల అంగీకారంతో బత్తిలి రోమన్ కేథలిక్ చర్చిలో బుధవారం వివాహం జరిగింది. చర్చి ఫాదర్ జోజిబాబు కొత్త జంటతో ప్రమాణం చేయించి, నూతన దంపతులుగా ప్రకటించారు.
కుల పెద్దల సమక్షంలో మత పెద్దల ఆశ్వీర్వచనాలతో ముత్యాల దండలు మార్చుకొని, కేక్‌ను కట్ చేసి ఒక్కటయ్యారు. స్థానిక కుల పెద్దలు మీసాల భాస్కరరావు, నిమ్మల దాస్‌తో పాటు మాజీ ఎంపీపీ టింగ శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు.