కదం తొక్కిన బీసీలు
కర్నూలు(న్యూసిటీ): చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కష్ణయ్య పిలుపు మేరకు బీసీ నాయకులు మంగళవారం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా స్థానిక బిర్లాగేట్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి గాయత్రీ ఎస్టేట్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ముట్టడికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీ కులాలు రాజకీయంగా వెనుకబడిపోయాయన్నారు. తమకు చట్టసభల్లో సరైన ప్రాధాన్యం లేకుండాపోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్లమెంటులో రాజకీయ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టెలా కేంద్రంపై వత్తిడి తీసుకోరావాలని కోరారు. పట్టించుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేయడంతో పాటు ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భావసార క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.అయ్యరావు, ఏపీఎస్‌ఆర్‌టీసీ బీసీ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి హెచ్‌ఆర్‌ఎస్ రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాల వెంకటేశ్వర్లు, నాయకులు లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్, రాయలసీమ యువజన సంఘం అధ్యక్షుడు జి.రాజు, జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంగముని నాయుడు, తదితరులు పాల్గొన్నారు.