జాట్లకు రిజర్వేషన్లు హళక్కేనా?
న్యూఢిల్లీ: హర్యానాతోపాటు కేంద్రం ఉద్యోగాల్లో ఓబీసీల తరహాలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలో సోమవారం జాట్లు తలపెట్టిన ఆందోళనను తాత్కాలికంగా విరమింప చేయడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి విజయం సాధించాయి. తలనొప్పిగా మారిన జాట్ల రిజర్వేషన్ల అంశం నుంచి తాత్కాలికంగా తప్పుకునేందుకు లేదా ఉపశమనం పొందేందుకు ఈ విజయం ఉపయోగపడుతుంది తప్ప, శాశ్వత పరిష్కారానికి ఎలాంటి దోహదం చేయదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందేందుకు తమను కూడా ఇతర వెనకబడిన వర్గాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్లమెంట్‌కు భారీ ఎత్తున ప్రదర్శన జరిపేందుకు జాట్లు సమాయత్తమవడం, ఎక్కడికక్కడ వారిని అదుపులోకి తీసుకునేందుకు నగరంలో 144వ సెక్షన్ కింద కేంద్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించడం తెల్సిందే.
అఖిల భారత జాట్ అరక్షన్ సంఘర్ష్ సమితి చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా మారకూడదనే ఉద్దేశంతో ఇటు కేంద్ర మంత్రులు, అటు మనోహర్ లాల్ కట్టర్ చర్చలు జరిపి తాత్కాలికంగా జాట్లు ఆందోళన విరమించేలా చేశారు. జాట్ల రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని, జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ కొత్త చైర్మన్, సభ్యులను నియమించాక ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని కట్టర్ ఆందోళనకారులకు నచ్చచెప్పారు.
ఇదే డిమాండ్‌పై గతేడాది జాట్లు హర్యానాలో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి 30 మంది మరణించారు. అపార ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఆందోళనకారులపై దాదాపు 21వేల క్రిమినల్ కేసులు దాఖలయ్యాయి. వాటిని ఎత్తివేయడం కూడా నేడు జాట్ల ప్రధాన డిమాండ్లలో ఒక్కటి. అందుకు ప్రభుత్వం కూడా సుముఖంగానే ఉంది. కోర్టుల కారణంగా రిజర్వేషన్ల సమస్య ప్రభుత్వానికి సంక్లిష్టంగా తయారైంది. ఇందులో కోర్టుల తప్పేమి లేదు. ఎన్నికల ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు రాజ్యాంగానికి విరుద్ధంగా హామీలు ఇవ్వడమే సమస్యకు ప్రధాన కారణం.
అటల్ బిహారి వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1999లో ఈ సమస్య ప్రారంభమయింది. రాజస్థాన్‌లో జాట్లకు ఓబీసీ హోదా కల్పిస్తామంటూ నాడు ఆయన హామీ ఇచ్చారు. పర్యావసానంగా ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అక్కడ ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికలప్పుడు ఇది ఎన్నికల అంశమై కూర్చుంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లోని జాట్లకు ఓబీసీ హోదాను కల్పిస్తామని యూపీఏ హామీ ఇచ్చింది.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కూడా జాట్ల డిమాండ్లపై సానుకూలంగానే స్పందించింది. జాతీయ బీసీ కమిషన్ అభిప్రాయాన్నే ప్రధానంగా పరిగణలోకి తీసుకున్న కోర్టులు ప్రభుత్వ ప్రతిపాదనలను కొట్టివేస్తూ వస్తున్నాయి. ఈసారి జాతీయ బీసీ కమిషన్ అభిప్రాయన్నే మార్చి వేస్తామన్న ఉద్దేశంతో కొత్త చైర్మన్, కొత్త సభ్యుల నియామకం తర్వాత జాట్ల రిజర్వేషన్ల ప్రక్రియను చేపడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.
బీసీల ప్రయోజనాలకు భిన్నంగా బీసీ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందా? కేంద్రం ఒత్తిడికి ఒకవేళ తీసుకున్నా ఆ నిర్ణయం అత్యున్నత న్యాయస్థానం ముందు నిలబడుతుందా? సమాజంలో కులాల వెనకబాటుతనాన్నే ప్రధాన కొలమానంగా తీసుకునే సుప్రీం కోర్టు సామాజికంగా అభివద్ధి చెందిన జాట్లను ఓబీసీల్లో చేర్చేందుకు అంగీకరిస్తుందా? అన్న ప్రశ్నలు ప్రస్తుతానికి సమాధానం దొరకనివే. జాట్ల అభివద్ధికి సరైన చర్యలు తీసుకోవడంలో మొదటి నుంచి ప్రభుత్వాలు అలసత్వ ధోరణిని అవలంబించడం వల్ల నేడు అన్ని సమస్యలకు పరిష్కారం రిజర్వేషన్లు కల్పించడమేనన్న భ్రమ అందరిలో ఏర్పడింది.