ఎన్నారై పెళ్లి సంబంధాలా.. జాగ్రత్త సుమా..! | be careful with NRI marriage relations | Sakshi
Sakshi News home page

ఎన్నారై పెళ్లి సంబంధాలా.. జాగ్రత్త సుమా..!

Published Sun, Nov 6 2016 2:59 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

ఎన్నారై పెళ్లి సంబంధాలా.. జాగ్రత్త సుమా..! - Sakshi

ఎన్నారై పెళ్లి సంబంధాలా.. జాగ్రత్త సుమా..!

అన్ని అంశాలపై స్పష్టత వచ్చాకే పెళ్లి చేసుకోవాలి
‘ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లు–సమస్యలు’ అంశంపై
    సమావేశంలో నిపుణుల అభిప్రాయం

హైదరాబాద్: ‘‘ఎన్‌ఆర్‌ఐ పెళ్లి సంబంధమంటే గుడ్డిగా ముందుకెళ్లొద్దు. అబ్బాయి వ్యవహారశైలిని పూర్తిగా తెలుసుకోవాలి. వీసా మొదలు... పనిచేసే కంపెనీలో వైఖరి ఎలా ఉందనే అంశాన్ని ఆరా తీయాలి. స్పష్టత వచ్చాకే పెళ్లికి ఒప్పుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్‌ఆర్‌ఐ సంబంధాలు బెడిసి కొడుతున్నాయి. అలా బలైన మహిళలకు న్యాయం చేయలేకపోతున్నాం’’  అని మహిళా కమిషన్ సమావేశంలో సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం ప్లాజా హోటల్‌లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం అధ్యక్షతన ‘ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లు-సమస్యలు’  అంశంపై సమావేశం జరిగింది.

రాజ్యసభ సభ్యులు కేశవరావు, పోలీసు ఉన్నతాధికారులు సౌమ్య మిశ్రా, స్వాతిలక్రా, సీనియర్ న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్‌ఆర్‌ఐ పెళ్లిలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భారీ మార్పులు చేయాలని, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ప్రొఫార్మాలో అబ్బాయి/అమ్మాయి పాస్‌పోర్టు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఇందుకు కమిషన్ తరపున లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తే సరిపోతుందని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఉమాపతి సూచించారు. ఎన్‌ఆర్‌ఐలతో పెళ్లి తర్వాత భాగస్వామిని విదేశాలకు తీసుకెళ్లకుండా ఇబ్బందులు పెడుతున్న సందర్భాలు వెలుగు చూస్తున్నాయి. అయితే వారిపై కేసులు పెడితే విదేశాల్లో చెల్లడం లేదని, దీంతో వారిపై చర్యలు క్లిష్టతరమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ముందుగా తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వస్తేనే ఫలితం ఉంటుందన్నారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ చురుకుగా పనిచేయడం లేదని, కొత్త రాష్ట్రంలో కమిషన్ మరింత బలోపేతం కావాల్సిన ఆవశ్యకత ఉందని ఎన్జీఓలు అభిప్రాయపడ్డారు. మైనార్టీ కుటుంబాల్లోని మహిళలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా విదేశీయులతో పెళ్లిళ్లకు అంగీకరిస్తున్నారని, దుబాయ్, అబుదాబీ, ఒమన్, సుడాన్ దేశాల్లో హైదరాబాద్‌కు చెందిన అమ్మాయిలు నరకం అనుభవిస్తున్నట్లు సమావేశంలో బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వచ్చిన సూచనలు, సలహాలు జాతీయ కమిషన్‌కు సమర్పించనున్నట్లు కమిషన్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement