మల్లన్న సాగర్‌తో ఇందూరుకే లబ్ధి | benefit to indoor form mallanna sagar | Sakshi
Sakshi News home page

మల్లన్న సాగర్‌తో ఇందూరుకే లబ్ధి

Aug 13 2016 11:04 PM | Updated on Sep 4 2017 9:08 AM

మల్లన్న సాగర్‌తో ఇందూరుకే లబ్ధి

మల్లన్న సాగర్‌తో ఇందూరుకే లబ్ధి

మల్లన్న సాగర్‌ నిర్మాణంతో ముందుగా లబ్ధి చేకూరేది నిజామాబాద్‌ జిల్లాకేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.

  • నిజామాబాద్‌ అన్నపూర్ణ అవుతుంది
  • ‘కాళేశ్వరం’తో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం
  • భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
  • నిజాంసాగర్‌ : మల్లన్న సాగర్‌ నిర్మాణంతో ముందుగా లబ్ధి చేకూరేది నిజామాబాద్‌ జిల్లాకేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. అటువంటి మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుపడుతున్న కాంగ్రెస్‌ నాయకులు షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌రెడ్డి రైతులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. శనివారం సాయంత్రం మాగి గాయత్రి కార్మాగారంలో సీడీసీ చైర్మన్‌ దుర్గారెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మించడంతో మంజీర నదిలో గలగలలు తగ్గాయని, ఇన్‌ఫ్లో లేక నిజాంసాగర్‌ ప్రాజెక్టు మైదానంలా మారిందని పేర్కొన్నారు. సముద్రం పాలవుతున్న గోదావరి జలాల మళ్లింపునకు చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు తీసుకు వచ్చి ఇందూరు జిల్లాను అన్నపూర్ణగా మారుస్తామన్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న మల్లన్నసాగర్‌ నిర్మాణాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేస్తామని, ఎవరెన్ని అడ్డుకట్టలు వేసినా మల్లన్నసాగర్‌ నిర్మించి తీరుతామని పేర్కొన్నారు. రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్కసీటూ గెలవలేకపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీకి అదే గతి పడుతుందని పేర్కొన్నారు. 
    అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టు నిర్మాణ పనుల వేగవంతానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడానని హరీశ్‌రావు తెలిపారు. త్వరలో లెండి పనులు పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, జుక్కల్, నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యేలు హన్మంత్‌ సింధే, భూపాల్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గంగాధర్‌ రావు పట్వారి, సీడీసీ చైర్మన్‌ దుర్గారెడ్డి, నాయకులు వినయ్‌కుమార్, గంగారెడ్డి, విఠల్, సత్యనారాయణ, మోహన్‌రెడ్డి, మాగి గాయత్రి కార్మాగారం జనరల్‌ మేనేజర్‌ సత్యనారాయణరెడ్డి, కేన్‌ మేనేజర్‌ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    సమైక్య రాష్ట్రంలో అన్యాయం..
    పిట్లం : పిట్లంలో శనివారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో జుక్కల్‌ నియోజకవర్గంలో 5 వేల మెట్రిక్‌ టన్నుల గోదాము ఉండేదని, తెలంగాణ వచ్చాక రూ. 13.50 కోట్లతో 22,500 మెట్రిక్‌ టన్నుల గోదాములను మంజూరు చేశామని పేర్కొన్నారు. వెంపల్లి మత్తడి, పుప్పల వాగుకు బీపీఆర్‌ పూర్తి కాగానే అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. మంజీర నదిలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మించి పైప్‌లైన్‌ ద్వారా రైతులకు సాగునీరందిస్తామన్నారు. నాలుగు నెలల క్రితం విద్యుదాఘాతంతో మరణించిన బిచ్కుంద మండలంలోని పుల్కల్‌ గ్రామానికి చెందిన కుర్లా సాయిలు అనే రైతు కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారం అందించారు. 
    కుట్రలు మానుకోవాలి
    ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, అడ్డంకులు సృష్టించినా మల్లన్నసాగర్‌ నిర్మాణం ఆగబోదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మల్లన్నసాగర్‌ నిర్మిస్తే జిల్లా రైతాంగానికి మేలు కలుగుతుందని, నిజామాబాద్‌ సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. 
    పిట్లం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ముదిరెడ్డి ప్రమీల వెంకట్‌ రాంరెడ్డి, బిచ్కుంద మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఎన్‌.శ్రీహరి, మద్నూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సాయాగౌడ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌ ఏడీ రియాజొద్దీన్, ఎంపీపీలు రజనీకాంత్‌రెడ్డి, సునంద గంగారెడ్డి, లలిత అశోక్‌ పటేల్, బస్వంత్‌ రావ్‌ శెట్కార్, బసంత్‌ రావ్‌ పటేల్, జెడ్పీటీసీ సభ్యులు ప్రతాప్‌ రెడ్డి, సంది సాయిరాం, మాధవ్‌రావ్‌ దేశాయ్, బస్వరాజ్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు. 

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement