అతి పెద్ద పాదరక్షలు ఇవే..
హాయ్ పిల్లలూ.. దాదాపు రెండున్నర అడుగుల పొడవు.. ఒక అడుగు వెడల్పు ఉండే పాదరక్షలను ఎక్కడైనా మీరు చూశారా? ఇంత పెద్ద రక్షలు ఎక్కడున్నాయి.. వీటిని ఎవరు వేసుకుంటారు? అనే అనుమానాలు మీకు వస్తున్నాయి కదూ? అయితే మీరు తప్పకుండా కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని ఒకసారి దర్శించుకోవాల్సిందే. ఎందుకంటే ఇంత పెద్ద పాదరక్షలు ఉండేది అక్కడి ఆలయంలోనే కాబట్టి. అసలు ఈ పాదరక్షల వెనుక ఓ పెద్ద కథే ఉంది సుమా! అదేమంటారా? అయితే ఇది చదవండి..
పూర్వం కర్నూలు జిల్లా కోసగి గ్రామానికి చెందిన ఓ కుటుంబం చాలా కాలంగా కష్టాల్లో ఉండేది. ఒకసారి ఆ కుటుంబ సభ్యులు కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకుని తమ కష్టాలు తీరితే స్వామికి జత పాదరక్షలు సమర్పించుకుంటామని మొక్కుకున్నారు. ఆశ్చర్యకరంగా వారి కష్టాలు ఒకదాని వెనుక తీరిపోయాయి. దీంతో ఆనందభరితులైన వారు స్వామి వారికి ఇంత పెద్ద పాదరక్షలు చేసి సమర్పించారు. నేటికీ ఆ కుటుంబానికి చెందిన సంతతి స్వామి వారికి ప్రతిఏటా పాదరక్షలను సమర్పిస్తూ ఉంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం వద్ద ఉండే ఈ పాదరక్షల స్పర్శ కోసం భక్తులు పోటీ పడుతుంటారు.
- గుంతకల్లు