► 18న జిల్లా పరిరక్షణ సమితి సమావేశం
► బీజేపీ నాయకుడు కొరివి వేణుగోపాల్
కరీంనగర్: జిల్లాలు, మండలాల పునర్విభజన పేరిట ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దని బీజేపీ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కొరివి వేణుగోపాల్ ప్రభుత్వానికి సూచించారు. కరీంనగర్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం విభజన ప్రక్రియను చేపట్టడం మంచిదేఅయినా.. ప్రజాభీష్టానికి అనుగుణంగా జరగాలని, నాయకుల సౌలభ్యం కోసం కాకుండా పారదర్శకంగా ఉండేలా చూడాలని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణలో చాలా గ్రామాల్లో విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ అశాస్త్రీయంగా చేపడితే ద్యమాలు ఎదుర్కొవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
జిల్లాలో మంథని డివిజన్ మినహా మిగతా మండలాలన్నీ జిల్లా కేంద్రానికి అనుకూలంగా, సౌలభ్యంగానే ఉన్నాయని, తాజాగా ప్రభుత్వం జగిత్యాలతోపాటు సిరిసిల్లను జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేస్తామని అనడంతో గందరగోళం నెలకొందని అన్నారు. అన్నింటికీ ఆమోదయోగ్యంగా ఉన్న జిల్లాను మూడు ముక్కలు చేసి కరీంనగర్‌కు ప్రాధాన్యత లేకుండాచేయడాన్ని తప్పుపట్టారు. మంథని డివిజన్‌ను భూపాలపల్లికి, హుజూరాబాద్ ప్రాంతంలోని కొన్ని మండలాలను వరంగల్‌కు, హుస్నాబాద్ ప్రాంతాన్ని సిద్దిపేట జిల్లాకు ఇలా ముక్కలు ముక్కలు చేసి అశాస్త్రీయంగా విభజన ప్రక్రియకు ప్రభుత్వం ఒడిగడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈనెల 18న అన్ని వర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కరీంనగర్ జిల్లా పరిరక్షణ సమితి పేరిట జిల్లాల విభజనకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో సిగిరి శ్రీధర్, సుజాతరెడ్డి, కొరివి వినయ్, సాయిచరణ్, రాజు, వేణు, రాంచంద్రం, తదితరులు పాల్గొన్నారు.
పునర్విభజన పేరిట గందరగోళం చేయొద్దు
Published Wed, Jun 15 2016 10:08 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement
Advertisement