
'ఆయన్ని చంపవలసిన అవసరం టీడీపీకి లేదు'
విజయవాడ : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై పనికిమాలిన ఆరోపణలు మానుకోవాలని ముద్రగడ పద్మనాభంకు బోండా ఉమ హితవు పలికారు. మంగళవారం విజయవాడలో బోండా ఉమ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ముద్రగడను చంపించాల్సిన అవసరం టీడీపీకి లేదని స్పష్టం చేశారు. స్వగ్రామం కిర్లంపూడిలో కూర్చోని లేఖలు రాయడం సరికాదని ముద్రగడకు ఆయన సూచించారు.
కిర్లంపూడి దాటి బయటకొస్తే ఎంతమంది కాపులకు రుణాలు మంజూరు చేశామో చెబుతామన్నారు. కాపుల కోసం రూ. 1000 కోట్లు ఇస్తామని టీడీపీ ఎక్కడా చెప్పలేదని చెప్పారు. కాపుల రిజర్వేషన్ పై ఏర్పాటు చేసిన జస్టిస్ మంజునాథ కమిషన్ను కలిసి రిజర్వేషన్ అంశంపై ఎందుకు ఆయనతో చర్చించలేదని ముద్రగడను బోండా ఉమ సూటిగా ప్రశ్నించారు.