
మంత్రి మాణిక్యాలరావు, బోండా ఉమా మధ్య వాగ్వివాదం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మధ్య శుక్రవారం విజయవాడలో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. బెజవాడ దుర్గ గుడి ఈవో నర్సింగరావు వేధింపులతో ఆసుపత్రి పాలై... చికిత్స పొందుతున్న అర్చకుడు మంగళంపల్లి సుబ్బారావును శుక్రవారం మంత్రి మాణిక్యాలరావు పరామర్శించారు.
అయితే ఈవో నర్సింగరావుపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని దుర్గ గుడి అర్చకులు విజయవాడలో ఆందోళకు దిగారు.ఈవోపై చర్యలు తీసుకుంటాం... ఆందోళన విరమించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు వారికి హామీ ఇచ్చారు. ఈవోపై చర్యలు తీసుకుంటే కానీ తాము ఆందోళన విరమించమని అర్చకులు భీష్మించుకుని కూర్చున్నారు. ఇంతలో అక్కడికి మంత్రి మాణిక్యాలరావు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న అర్చకులను ఆయన కలిశారు.
ఈవోపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న బోండా ఉమా జోక్యం చేసుకుని ఈవోపై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాలని మాణిక్యాలరావును డిమాండ్ చేశారు. అందుకు ఆయన ససేమీరా అన్నారు. నివేదిక రాకుండా ఆయన్ని ఎలా సస్పెండ్ చేస్తామంటూ మాణిక్యాలరావు ఎమ్మెల్యే బోండాను ప్రశ్నించారు. దీంతో బోండా ఉమా ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.