
విజృంభిస్తున్న డయేరియా
► రోజురోజుకు పెరుగుతున్న కేసులు
► కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
► గ్రామాలు, పట్టణాల్లో లోపించిన పారిశుధ్యం పట్టించుకోని అధికారులు
ఆసిఫాబాద్: జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. గత వారం రోజులుగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో పదుల సంఖ్యలో డయేరియా, విషజ్వరాలతో రోగులు చికిత్స పొందుతున్నారు. వారం రోజుల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో 63 మంది డయేరియా చికిత్స పొందగా, మలేరియా, టైఫాయిడ్‌తో పలువురు చికిత్స పొందారు. వీరితోపాటు ప్రతీరోజు సుమారు 400 నుంచి 500 వరకు ఔట్ పేషెంట్లు నమోదవుతున్నారు.
వారం రోజుల్లో మండలంలోని ఆర్‌ఆర్‌కాలనీకి చెందిన పాపయ్య, మోతుగూడకు చెందిన అనిత, కొసరకు చెందిన సునీత, చిర్రకుంటకు చెందిన మోహన్, తారకరామానగర్‌కు చెందిన సునీత, రాకేశ్, జన్కాపూర్‌కు చెందిన రోహిణి, గుడిసెల కాశమ్మ, లచ్చయ్య, మజీద్‌వాడికి చెందిన లక్ష్మి, బజార్‌వాడికి చెందిన భారతి, గొల్లగూడకు చెందిన విజయ, సందీప్‌నగర్‌కు చెందిన ఎల్లవ్వ, హడ్కోకాలనీకి చెందిన శివకృష రెబ్బెన మండలం ఖైర్‌గాంకు చెందిన రంగమ్మ, రాంపూర్‌కు చెందిన రేణుకతోపాటు పలువురు డయేరియా, మలేరియా చికిత్స పొందగా, ఆదివారం మండలంలోని సందీప్‌నగర్‌కు చెందిన లత, జన్కాపూర్‌కు చెందిన తారుబాయి, బెస్తవాడకు చెందిన మారుతి, రెబ్బెన మండలం ఖైర్‌గాంకు చెందిన అంజలి డయేరియాతో ఆస్పత్రిలో చేరారు. వీరితోపాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వందలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో డయేరియా, జ్వరాలతో చికిత్స పొందుతున్నారు.
లోపిస్తున్న పారిశుధ్యం
జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లోని 173 గ్రామపంచాయతీలకు ఇటీవల 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.24.32 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల్లో 60 శాతం పారిశుధ్యం, తాగునీటి అవసరాలకు ఖర్చు చేయనున్నారు. గ్రామపంచాయతీలకు రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు లేకపోవడంతోపాటు ఉన్న సిబ్బందికి అదనపు బాధ్యతలు ఇవ్వడంతో పంచాయతీ పాలన పడకేసింది. జిల్లా కేంద్రంలోనే ఎక్కడ చేసినా చెత్తాచెదారం దర్శనమిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా గ్రామీణ, పల్లె ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
గ్రామాల్లో చెత్తా చెదారం నిండిపోయింది. అందులో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమలు పెరిగి జ్వరాల పాలవుతున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలు, పల్లెల్లో ప్రజలు తాగునీటి కోసం పాట్లు పడుతున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి సరఫరాపై నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంతో ఏటా వర్షాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా కేంద్రంలోనే రోజుల తరబడి నల్లాల ద్వారా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో, తాగునీటికోసం చేతి పంపులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు వ్యాధుల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.