
విషజ్వరంతో చిన్నారి మృతి
కందుకూరు: విషజ్వరంతో ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరు గ్రామ పంచాయతీ పరిధిలోని మాన్యగూడలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గోదాసు తానయ్య, సరితల పెద్ద కుమారుడు అఖిల్(8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు.వారం రోజులుగా ఆ చిన్నారి జ్వరం సోకడంతో పాటు విరేచనాలు, వాంతులతో బాధపడుతున్నాడు. వారి తల్లిదండ్రులు కూలినాలీ చేసుకుని పూట గడుపుకునే వారు కావడంతో స్థానికంగానే ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. ఆదివారం ఉదయం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడు.