ట్యాంకర్ ఢీకొని బాలుడు మృతి
బద్వేలు అర్బన్ : స్థానిక నెల్లూరు రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఉన్న ఓ కల్యాణ మండపం వద్ద మంగళవారం డీజిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో షేక్ బషీర్ (12) అనే బాలుడు మృతి చెందాడు. స్థానిక సుందరయ్యకాలనీలో నివసించే షేక్ రసూల్, మాబున్నిలకు 8 మంది కుమారులు, 5 మంది కుమార్తెలు. వారిలో 8వ కుమారుడు షేక్ బషీర్ పూసలవాడ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. తన సమీప బంధువుల శుభ కార్యక్రమంలో భాగంగా కల్యాణ మండపం వద్దకు వెళ్లిన బాలుడు ఎదురుగా ఉన్న దుకాణం వద్దకు వెళ్లి రోడ్డు దాటుతుండగా బద్వేలు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న ట్యాంకర్ ఢీకొంది. ఈ ఘటనలో బషీర్ కుడికాలితొడపై నుంచి ట్యాంకర్ చక్రాలు వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జు అయింది. వెంటనే బంధువులు 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం కడప రిమ్స్‌కు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందడంతో తిరిగి వెనక్కి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.