ఏపీలోనూ సేవలందిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సేవా కేంద్రాలకు తాము సేవలు అందిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఏపీలో ఉన్న సేవా కేంద్రాల నిర్వహణ ఖర్చులను, సిబ్బంది జీతభత్యాలను భరించేందుకు ఏపీ సర్కారు ముందుకొచ్చిందని, ఈ నేపథ్యంలో ఆ కేంద్రాలకు సేవలందించేందుకు తాము సంసిద్ధత వ్యక్తం చేశామని తెలిపింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని ఈ రెండు విశ్వ విద్యాలయాలకు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తగిన ఆదేశాలు జారీ చేశారని వెల్లడించింది.
ఈ వివరాలతో ఓ మెమోను న్యాయస్థానం ముందుంచింది. దీనిపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేశారో లేదో వివరిస్తూ రాతపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ కోర్టుకు నివేదించారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని క్యాంపస్‌లకు తమ సేవలను నిలిపేస్తూ తెలుగు విశ్వవిద్యాలయం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అలాగే ఏపీలో ఉన్న ప్రాంతీయ కేంద్రాలకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తన సేవలను నిలిపేసిందంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించి, విచారణ ప్రారంభించిన విషయం విదితమే. ఈ రెండు వ్యాజ్యాలను ధర్మాసనం బుధవారం విచారించింది. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి ఓ మెమోను ధర్మాసనం ముందుంచారు.