అపోలోలో బ్రెయిన్ స్ట్రోక్ చికిత్స విభాగం
కాకినాడ సిటీ: కోస్తాలోనే తొలిసారిగా గుండె మాదిరిగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి న్యూరో సర్జన్, న్యూరో ఫిజీషియన్లతో అత్యవసర చికిత్సా విభాగాన్ని కాకినాడ అపోలో హాస్పటల్‌లో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నట్టు అపోలో హాస్పటల్స్ రీజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సందీప్ చత్రాత్ తెలియజేశారు. స్థానిక జీఆర్‌టీ గ్రాండ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారిన జీవన శైలి కారణంగా మనిషికి వస్తున్న బ్లడ్ ప్రెజెర్, డయాబెటిక్, ఊబకాయం వంటి వాటివల్ల హార్ట్ ఎటాక్ మాదిరిగా బ్రెయిన్ స్ట్రోక్‌లు కూడా వస్తున్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, 15 సంవత్సరాల అనుభవం ఉన్న న్యూరో సర్జన్ డాక్టర్ ఎం.వి.కిరణ్‌కుమార్ విభాగాధిపతిగా, నిమ్స్‌లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న డాక్టర్ భూషణ్‌పాల్ వద్ద శిక్షణ పొందిన న్యూరో ఫిజీషియన్లతో ఈ బ్రెయిన్‌స్ట్రోక్ చికిత్సా విభాగాన్ని కాకినాడ అపోలోలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీన్ని మంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్పు చేసేందుకు వీలుగా అపోలో యాజమాన్యం రూ.14 కోట్లు మంజూరు చేసిందని, దీంతో అధునాతన పరికరాలు సమకూర్చుకోనున్నట్టు, మరో ఆరునెలల్లో కొత్తబ్లాక్ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. న్యూరో సర్జన్ డాక్టర్ ఎం.వి.కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆధునిక చికిత్స, మందులు ద్వారా బ్రెయిన్‌లో డ్యామేజీ జరగకుండా అరికట్టేందుకు వీలవుతోందన్నారు. ఈ సమావేశంలో అపోలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఐవీ రమణ, న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బెజవాడ కామరాజు, ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ చటర్జి పాల్గొన్నారు.