ఆదోనిలో అన్నదమ్ముల హత్య
ఆదోనిలో అన్నదమ్ముల హత్య
Published Mon, Sep 4 2017 10:12 PM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM
- వివాహేతర సంబంధమే కారణం
- ఆదివారం రాత్రి అన్న కిడ్నాప్
- అడ్డుకోబోయిన అతని తమ్ముడిపై వేటకొడవళ్లతో దాడి
- చికిత్స పొందుతూ మృతి
- కిడ్నాప్ అయిన వ్యక్తి దారుణ హత్య
- ఎమ్మిగనూరు సమీపంలో చంపేసి, శవాన్ని తగులబెట్టిన దుండగులు
- ముగ్గురు నిందితుల గుర్తింపు
ఆదోని టౌన్/ఎమ్మిగనూరు రూరల్: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన ఆదోనిలో చోటు చేసుకుంది. సోమవారం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు జంట హత్యల వివరాలను వెల్లడించారు. ఆదోని పట్టణంలోని విక్టోరియ పేటలో నివాసముంటున్న రాజు, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు నాగేంద్ర (38) రైస్ మిల్లులో పని చేస్తున్నాడు. రెండో కుమారుడు నాగరాజు (34) బెంగళూరు ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. మూడో కుమారుడు నరేష్(32) ఇంటి పట్టునే ఉంటున్నాడు. నాగేంద్రకు భార్య, కుమార్తె ఉన్నారు. ఇతనికి అదే కాలనీకి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి భార్య శిరీషను మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో 2016లో అతనిపై వేధింపుల కేసు నమోదైంది. వివాహేతర సంబంధం మానుకోవాలని భార్య, బంధువులు చెబుతున్నా పెడచెవినా పెడుతూ వచ్చాడు. ఈ విషయం మహిళ ఇంట్లో తెలియడంతో నాగేంద్రను చంపేందుకు కుట్ర పన్నారు.
అడ్డొచ్చిన తమ్ముడిని కడతేర్చారు..
ఆదివారం రాత్రి నాగేంద్ర భోజనం ముగించుకుని ఇంటి ముందు కూర్చున్నాడు. తూపాన్ వాహనంలో తెల్ల దుస్తులు ధరించిన కొందరు గుర్తు తెలియని అక్కడికి వచ్చి అతడిని బలవంతంగా వాహనంలోకి ఎక్కిస్తుండగా కేకలు వేశాడు. కొంత దూరంలో ఉన్న అతని తమ్ముడు నరేష్ అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి వాహనానికి అడ్డుగా నిలిచాడు. తమ అన్నను ఎక్కడికి తీసుకెళ్తారని ప్రశ్నించేలోగా దుండగులు కత్తులతో దాడి చేయడంతో కుప్పకూలి పోయాడు. వాహనం మాధవరం రోడ్డువైపు వేగంగా వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన నరేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఇతనికి వివాహం కాలేదు.
చేతి కడియంతో మృతదేహం గుర్తింపు
ఆదివారం రాత్రి కిడ్నాప్‌నకు గురైన బోయ నాగేంద్రను దుండగులు ఎమ్మిగనూరు మండల బనవాసి ఫారం ఎల్లెల్సీ కాల్వ దగ్గరకు తీసుకువచ్చి హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తించకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. శరీర భాగాలు పూర్తిగా కాలిపోయాయి, అయితే కుడిచేయి మాత్రం కాలలేదు. సోమవారం ఉదయం కాలువ గట్టుపై నుంచి పొలాలకు వెళ్తున్న రైతులు మృతదేహాన్ని గుర్తించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న సీఐ జీ.ప్రసాద్, రూరల్ ఎస్‌ఐ వేణుగోపాల్‌లు సంఘటన స్థలానికి చేరుకొని çపరిశీలించారు. ఆదివారం రాత్రి ఆదోనిలో కిడ్నాప్ ఘటనపై వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు కావటం, పత్రికల్లో కథనాలు రావటంతో ఆదోని పోలీసులకు, బంధువులకు ఎమ్మిగనూరు పోలీసులు సమాచారం అందించారు. ఈ మేరకు ఆదోని త్రీ టౌన్ సీఐ చంద్రశేఖర్, వన్‌టౌన్ ఎస్‌ఐ మన్మధవిజయ్ మృతుడి బంధువులను సంఘటన స్థలం దగ్గరకు తీసుకువచ్చారు. కుడిచేయి కాలిపోకుండా ఉండటం, చేతికి వెండి కడియం, దారం ఉండటంతో గుర్తించారు. అనంతరం ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హత్యకు గల కారణాలు వివాహేతర సంబంధం అని అనుమానాలను బంధువులు వ్యక్తం చేస్తున్నారన్నారు. అదే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు.
కేసును త్వరలోనే ఛేదిస్తాం: డీఎస్పీ
అన్నదమ్ముల హత్య కేసును త్వరలో ఛేదిస్తాం. నిందితులను అరెస్ట్ చేసేందుకు 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాం. మృతుడు నాగేంద్ర భార్య, మామ ఈరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో ఈరన్న, రవి, సత్యనారాయణపై కేసు నమోదు చేశాం. ఈ ఘటనలో పది మంది నిందితుల వరకు పాల్గొని ఉండవచ్చు.
Advertisement
Advertisement